కర్ణాటక ముఖ్యమంత్రితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

Header Banner

కర్ణాటక ముఖ్యమంత్రితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

  Fri Nov 09, 2018 22:08        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Kuwait, Telugu, World


అమ‌రావ‌తి ః భాజపాకు ప్రత్యామ్నాయ వేదిక కోసం సాగుతున్న ప్రయత్నాలపై మరో అడుగు పడింది. బెంగళూరులో గురువారం జరిగిన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల భేటీ లక్ష్యం దిశగా సాగింది. అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తెచ్చి భాజపాకు గుణపాఠం చెబుతామని వారు ప్రతిన పూనారు. . బెంగళూరులోని జనతాదళ్‌ (ఎస్‌) జాతీయ అధ్యక్షుడు హెచ్‌.డి.దేవేగౌడ నివాసంలో జరిగిన ఈ భేటీ 45 నిమిషాలపాటు సాగింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన 5 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి సాధించిన విజయంపై చంద్రబాబు ఇద్దరు నేతలను అభినందించారు.
ప్రధాని అభ్యర్థి ముఖ్యం కాదు: చంద్రబాబు
‘దేశ ఆర్థిక పరిస్థితి గత నాలుగేళ్లలో ఛిన్నాభిన్నమైంది. రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితి మరెంతో కాలం కొనసాగకూడదనే లక్ష్యంతోనే దేశంలోని లౌకిక శక్తులన్నీ ఒక్కటి కావాలని శ్రమిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం విలేకరులతో పేర్కొన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసే పనిలో నిమగ్నమైందని ధ్వజమెత్తారు. ‘స్వేచ్ఛగా విచారణ చేపట్టాల్సిన సీబీఐ, దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచాల్సిన ఆర్‌బీఐలు వేధింపులకు గురవుతున్నాయి. స్వయంగా ఆర్‌బీఐ గవర్నరే కేంద్రం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు సమస్యలను సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలను నియంత్రించేందుకే ఈడీ, ఐటీ సంస్థలున్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. రఫేల్‌ ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రధాని నోరు మెదపటం లేదు’ అని చంద్రబాబు విమర్శించారు. ‘పెద్ద నోట్ల రద్దు, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు.. తదితరాల కారణంగా సామాన్యుడు సురక్షితంగా జీవించలేని స్థితి దేశంలో నెలకొంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రూపాయి విలువ రూ.76కు చేరే అవకాశాలున్నాయన్న హెచ్చరిక దేశ ప్రజలను ఆందోళనలో పడేస్తోంది. అన్నింటీకి మించి అల్ప సంఖ్యాకులు అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యలను పరిష్కరించేందుకు భాజపా ప్రత్యామ్నాయ శక్తులన్నీ ఏకం కావాలి’ అని పిలుపునిచ్చారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రస్తుతానికి ముఖ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్‌డీఏలో అసంతృప్తిగా ఉన్న పార్టీలు తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.   cm