కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా సచివాలయం

Header Banner

కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా సచివాలయం

  Sun Nov 04, 2018 13:10        అమరావతి కబుర్లు, Telugu

అమరావతి రాజధానిగానే కాక పర్యాటక కేంద్రంగానూ మారనుంది. అత్యాధునిక హంగులు...  ఆకట్టుకునే ఇంటీరియర్‌తో...  అబ్బురపరిచే రీతిలో సచివాలయ భవనాలను  నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారికి ఓ అనుభూతిని మిగిల్చేలా పూర్తిస్థాయి ఆకృతులు సిద్ధమయ్యాయి. పనులు కూడా మొదలయ్యాయి. రెండేళ్లలో వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలకు భిన్నంగా... సమున్నతంగా... ఈ భవనాలను తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర సచివాలయంతో పాటు, విభాగాధిపతుల కార్యాలయాలూ వీటిలోనే ఏర్పాటవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన సచివాలయం ఇలా అనేక విశేషాల సమాహారంగా నిలవనుంది.

ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలను తలదన్నేలా... ఆధునిక హంగులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో... శాసనసభ భవనానికి పశ్చిమ దిశలో ఆధునికత, సౌలభ్యాల కలబోతగా ఐదు టవర్లు నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా మొత్తం పరిపాలనా యంత్రాంగం కొలువుతీరే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం పరిపాలన నగరంలో ఇప్పటికే మొదలైంది.  ఇప్పటిలా సచివాలయం ఒక చోట, విభాగాధిపతుల కార్యాలయాలు మరో చోట ఉండకూడదన్న ఉద్దేశంతో, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా ఆకృతులు తీర్చిదిద్దారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌కి చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ వీటిని సిద్ధం చేసింది. అంతర్గత వసతులకు సంబంధించిన డిజైన్లను తాజాగా ప్రభుత్వం ప్రదర్శించింది. కేవలం పరిపాలనా సౌధాలుగానే కాకుండా... సందర్శనీయ స్థలాలుగా, రాజధాని నగరానికే కళ తెచ్చేలా ఈ భవనాల్ని తీర్చిదిద్దనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయ భవనాలుగా, దేశంలోనే మొదటి డయాగ్రిడ్‌ భవనాలుగా... ఇంకా పలు విశేషాలతో ఇవి వన్నె తేనున్నాయి.

ముఖ్యాంశాలు...! 
212 మీటర్ల ఎత్తు..! 
* మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనాలు నిర్మిస్తారు. 
* ఐదు టవర్లతో పాటు, అదే ప్రాంగణంలో తొమ్మిది పోడియంలు కూడా ఉంటాయి. 
* ముఖ్యమంత్రి కార్యాలయ భవనంలో 50 అంతస్తులు ఉంటాయి. దీని ఎత్తు 212 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ భవనంగా నిలుస్తుంది. 
* మిగతా నాలుగు టవర్లలో (టీ1, టీ2, టీ3, టీ4) 40 అంతస్తుల చొప్పున ఉంటాయి. 
* ముఖ్యమంత్రి కార్యాలయం 50వ అంతస్తులో ఉంటుంది. ఈ భవనంపైనే హెలిపాడ్‌ ఉంటుంది. దేశంలో మరే రాష్ట్రంలోను సచివాలయంపైన హెలిపాడ్‌ లేదు. 
* తొమ్మిది పోడియంలలో.. ఒక్కో దానిలో మూడు అంతస్తులు ఉంటాయి. సందర్శకులు వేచి ఉండటానికి వసతులు, రెస్టారెంట్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు. 
* మొత్తం సచివాలయ భవనాల నిర్మిత ప్రాంతం: 69.8 లక్షల చ.అడుగులు. 
* ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.4 వేల కోట్లు. 
* ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువ: రూ.2271 కోట్లు.

దేశంలో మొదటి డయాగ్రిడ్‌ భవనం 
సచివాలయ టవర్లను దేశంలోనే మొదటిసారిగా డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించనున్నారు. ఈ భవనాల్లో నిలువు స్తంభాలు ఉండవు. సెంట్రల్‌ కోర్‌పైనా, చుట్టూ ఉండే ఇనుప ఫ్రేంపైనా భవనం ఆధారపడి ఉంటుంది. నిలువు స్తంభాలు లేకపోవడం వల్ల సాధారణ భవనాలతో పోలిస్తే ‘ఫ్లోర్‌ స్పేస్‌’ ఎక్కువగా ఉండటంతో పాటు, సౌలభ్యంగాను ఉంటుంది. నిర్మాణంలో ఉక్కు వినియోగం 30 శాతం వరకు తగ్గుతుంది. 
* భూకంపాలు, తుపానులను తట్టుకుని నిలబడే సామర్థ్యం డయాగ్రిడ్‌ భవనాలకు మరింత ఎక్కువగా ఉంటుంది. 
* డయాగ్రిడ్‌ ఫ్రేంకి బిగించిన అద్దాల్లోంచి సూర్యరశ్మి ఎక్కువగా భవనం లోపలికి రావడం వల్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. డయాగ్రిడ్‌ షేడ్‌లా ఉపయోగపడటం వల్ల భవనంలో ఉన్న వారిపై ఎండ తీవ్రత ఎక్కువగా పడదు.

ట్విన్‌ లిఫ్ట్‌లు..! 
* సచివాలయ భవనాల్లో దేశంలోనే మొదటిసారి ట్విన్‌ లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 
* ప్రతి లిఫ్ట్‌ మార్గంలోను రెండు లిఫ్ట్‌ కార్లు ఉంటాయి. సగం అంతస్తుల వరకు ఒకటి, ఆ తర్వాత మరొకటి ఉంటుంది. 
* ప్రతి టవర్‌లో 15 హైస్పీడ్‌ లిఫ్ట్‌ కార్లు ఏర్పాటు చేస్తారు. 
* పరిపాలన నగరం మధ్యలోంచి వెళుతున్న పాలవాగుకి ఒక పక్క మూడు టవర్లు, రెండో పక్క రెండు టవర్లు నిర్మిస్తున్నారు. 
* మొత్తం ఐదు టవర్లను అనుసంధానిస్తూ ఎత్తైన కాలినడక మార్గం (కనెక్టింగ్‌ స్పైన్‌) ఉంటుంది. 
* సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసే సదుపాయాలు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఉద్యోగ సంఘాలకు ప్రత్యేక సమావేశ మందిరం, రెస్టారెంట్‌లు/కెఫెటేరియాలు, బ్యాంకులు, ఈ-సేవ కేంద్రాలు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌, లైబ్రరీ, ప్లేస్కూల్‌ వంటివి ఉంటాయి. 
* ప్రతి టవర్‌లో కల్పించే సదుపాయాలు బ్రేకౌట్‌ ఏరియా, 200, 125, 75 మంది కూర్చునేలా సమావేశమందిరాలు. కెఫెటేరియా, క్రెచ్‌, జిమ్‌. 
* ప్రస్తుత పరిస్థితి ఐదు టవర్ల పునాదుల నిర్మాణానికి తవ్వకాలు జరిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం టవర్‌కు ర్యాఫ్ట్‌ నిర్మాణం మొదలైంది. డిసెంబరు 15కి పునాదులు పూర్తి చేసి, భవనం పనులు ప్రారంభిస్తారు.

ఆధునిక వసతులు..! 
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి భిన్నంగా, ఆధునిక వసతులతో ఉంటాయి. విశాలమైన ఎంట్రెన్స్‌ లాబీలు, మంత్రులు, సీనియర్‌ అధికారులకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, ప్రతి అంతస్తులో విశాలమైన వెయిటింగ్‌ లాంజ్‌, మంత్రులు, ఉన్నతాధికారులకు విశాలమైన ఛాంబర్లు ఉంటాయి. విరామ సమయంలో సేద తీరేందుకు లాబీలు, జిమ్‌లు  ఏర్పాటు చేస్తున్నారు. 
* ప్రతి 15 అంతస్తులకు ఒక ‘బ్రేకవుట్‌ ప్లేస్‌’ ఉంటుంది. అక్కడ కెఫెటేరియా వంటి వసతులు ఉంటాయి. 
* సచివాలయ ప్రాంగణంలో విశాలమైన ఆడిటోరియం ఉంటుంది. 
* ప్రతి టవర్‌లో, ప్రతి అంతస్తులో సమావేశమందిరాలు ఉంటాయి.


   కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా సచివాలయం