ఫేస్ బుక్ తో ఒకటైన ఫ్యామిలీ

Header Banner

ఫేస్ బుక్ తో ఒకటైన ఫ్యామిలీ

  Mon Oct 29, 2018 13:54        Exclusives, Telugu

కుటుంబానికి అంది వచ్చే సమయంలో... పరీక్ష ఫెయిల్‌ అయ్యానని ఇంట్లో నుంచి పారిపోయాడు ఓ కుమారుడు. ఆ కొడుకు కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అనేక ఊర్లు తిరిగారు. పన్నెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చివరికి వారిని ఫేస్‌బుక్‌ కలిపింది! అందరిలో ఆనందం నింపింది. ఈ ఘటన కడప జిల్లాలోని పెనగలూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...
 పెనగలూరుకు చెందిన దర్జీ చాపల నరసయ్య, రత్నమ్మలకు కుమారుడు పెంచలయ్య, కుమార్తె మాధవి ఉన్నారు. పన్నెండేళ్ల క్రితం పాలిటెక్నిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానన్న మనస్తాపంతో పెంచలయ్య ఇంటి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు పడరాని పాట్లుపడ్డారు. ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగారు. మూడేళ్ల కిందట బెంగళూరులో ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న పెంచలయ్య ఫేస్‌బుక్‌లో తనఫొటో ఉంచాడు.
 చెల్లెలు మాధవి ఈ ఫొటోను గుర్తించడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. తిరిగి రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పెంచలయ్య ఫొటోలు పెట్టాడు. అందులోని ఫోన్‌ నంబర్‌ ఆధారంగా అతను ముంబైలో ఉన్నట్లు గుర్తించి తండ్రి నరసయ్య పోలీసులను ఆశ్రయించారు. పెనగలూరు ఎస్‌ఐ వరప్రసాద్‌, కానిస్టేబుల్‌ బాషా కలసి నర్సయ్యను వెంటబెట్టుకొని మూడు రోజుల కిందట ముంబై వెళ్లి ఎట్టకేలకు శుక్రవారం పెంచలయ్యను పట్టుకున్నారు. పన్నెండేళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకున్న తండ్రీకొడుకులు... ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వీరంతా ముంబై నుంచి రైలులో శనివారం పెనగలూరుకు బయలుదేరారు.


   ఫేస్ బుక్ తో ఒకటైన ఫ్యామిలీ