షామీ, ఒపో, హానర్‌లకు మంచి డిమాండ్

Header Banner

షామీ, ఒపో, హానర్‌లకు మంచి డిమాండ్

  Mon Oct 29, 2018 13:42        Business, Telugu

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీలు బలంగా పాగా వేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును మరీ మన దేశంలో అధికంగా అమ్ముడయ్యే ఫోన్లలో చైనా బ్రాండ్‌లే ఎక్కువగా ఉంటాయి. షామీ, ఒపో, హానర్‌ లాంటి ఫోన్లకు మన దేశంలో డిమాండ్‌ విపరీతంగా ఉంటోంది. ఈ డిమాండ్‌ వల్లే 2017-18 ఆర్థిక సంవత్సరంలో చైనా మొబైల్‌ తయారీ సంస్థలు భారత్‌లో రూ. 50వేల కోట్లకు పైగా ఆర్జించినట్లు మార్కెట్‌ నిపుణులు‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి దేశంలో చైనా ఫోన్ల కంపెనీల ఆదాయం దాదాపు రెట్టింపైందట.

దేశంలోని మొత్తం స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో సగానికి పైగా చైనా కంపెనీలవే. షామీ, ఒపో, వివో, హానర్‌ లాంటి దిగ్గజ సంస్థల ఫోన్లతో పాటు లెనోవో, వన్‌ప్లస్‌ లాంటి ఫోన్లకు కూడా ఇక్కడ గిరాకీ ఎక్కువగానే ఉంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. అధునాతన ఫీచర్లతో తక్కువ ధరకు ఫోన్లను విక్రయించడమే ఈ డిమాండ్‌కు కారణమని అంటున్నారు. ‘భారత్‌లో దాదాపు సగానికి పైగా చైనా ఫోన్లే అమ్ముడవుతున్నాయి. తక్కువ ధరలే ఇందుకు ప్రధాన కారణం. ఒక్క దక్షిణకొరియా సంస్థ శామ్‌సంగ్‌ మినహా ఏ భారత కంపెనీ వీటికి పోటీనివ్వట్లేదు’ అని రీసర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ తెలిపింది.

రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌ఓసీ) ఫైలింగ్‌ ప్రకారం.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో షామీ టెక్నాలజీ ఆదాయం రూ. 22,947.3కోట్లుగా నమోదైంది. అంతకుముందు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం రూ. 8,334.4కోట్లు మాత్రమే. ఇక 2018 ఆర్థిక సంవత్సరంలో ఒపో ఆదాయం రూ. 11,994.3కోట్లు(2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,050.8కోట్లు), వివో ఆదాయం రూ. 11,179.3కోట్లు(2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,292.9కోట్లు), హువావే ఆదాయం రూ. 5,601.3కోట్లు(2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,584.2కోట్లు)గా నమోదైంది.

మరోవైపు ఈ కంపెనీల వల్ల భారత యువతకు ఉపాధి కూడా లభిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేకిన్ ఇండియా కింద ఇప్పటికే షామీ, ఒపో, లెనోవో, హువావే లాంటి సంస్థలు భారత్‌లో తయారీ కేంద్రాలను ప్రారంభించాయి. వీటి ద్వారా భారీ స్థానిక యువతకు ఉద్యోగాలు అందిస్తున్నాయని చెప్పారు.

 
 
 

 


   షామీ, ఒపో, హానర్‌లకు మంచి డిమాండ్