వేదాంత విద్యలో తిరుగులేని ప్రతిభను చూపిన మధ్వాచార్యులు

Header Banner

వేదాంత విద్యలో తిరుగులేని ప్రతిభను చూపిన మధ్వాచార్యులు

  Sat Oct 27, 2018 16:26        Devotional, Telugu

తత్త్వ జ్ఞానాన్ని పొందాలంటే ఉత్తమ శాస్త్రాలుండాలి. మంచి గురువు ఉండాలి. ఆయన బోధనలు విని తెలుసుకునేందుకు ఆరోగ్యం ఉండాలి. ఆ గురువును గౌరవించే స్థోమత ఉండాలి. ఇవన్నీ లభ్యమయ్యే అదృష్టం ఉండాలి... అనే భావన ఉన్న సమయంలో ప్రతి మనిషీ సులభంగా తత్త్వజ్ఞానాన్ని పొందేలా చేయాలని తపించిన మహనీయమూర్తి, ద్వైత సిద్ధాంతకర్త, త్రిమతాచార్యుల్లో ఒకరు మధ్వాచార్యులు. ఆయన జన్మస్ధలం కర్ణాటకలోని ఉడిపి సమీపంలో ఉన్న పాజక. తల్లిదండ్రులు వేదవతి, మధ్యగేహులు. క్రీ.శ.1199లో ఆశ్వయుజ శుక్ల దశమినాడు ఆయన జన్మించారు. 
ఈయన అసలు పేరు వాసుదేవ. చిన్నతనంలోనే తత్త్వ జిజ్ఞాస, ఆధ్యాత్మిక జిజ్ఞాస, భక్తిభావన కలిగిన వాసుదేవ పదేళ్ల వయసులోనే సర్వవిద్యా పారంగతుడయ్యారు. ఉడిపిలోని అచ్యుత ప్రేక్షకులకు శిష్యుడయ్యారు. ఆయనే పదకొండు సంవత్సరాల వయసులో వాసుదేవకు సన్యాస దీక్ష ఇచ్చి ‘పూర్వప్రజ్ఞాతీర్థులు’ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ఆయన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, జ్ఞానబోధ చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వెలుగును అందరికీ పంచారు. ఒకసారి ఉడిపి అనంతేశ్వరస్వామి ఆలయంలో గొప్ప పండితుడిని వేదాంత వాదనలో ఓడించి పూర్ణ బోధ, మధ్వాచార్యులు అనే బిరురులను, వేదాంత విద్యలో తిరుగులేని ప్రతిభను చూపి ఆనందతీర్థులు అనే పేరును సంపాదించారు. ఎన్నో మహత్యాలను కూడా ప్రదర్శించారు.

ఇదే ద్వైతం 
* జగత్తు సత్యం 
* జీవుడు, బ్రహ్మం ఒకటికాదు. వేర్వేరు తత్త్వాలు. 
* పరమాత్మ సగుణసాకారుడు. శ్రీమహావిష్ణువే ఆ దైవం. 
* మోక్షానికి విష్ణుభక్తే ఏకైకమార్గం.

అమృతవాక్కులు 
* నిత్యకర్మలు ఎంత ప్రధానమో... సత్యధర్మాలను పాటించడం కూడా అంతే ముఖ్యం. సకలప్రాణుల హితాన్ని కోరి భగవంతుడిని ఆరాధించడమే భక్తి 
జ్ఞానం పొందడం ప్రధానం. జ్ఞానం సాధించని ఆచారం వృథా! అరిషడ్వర్గాలు జ్ఞానసాధనకు అడ్డుగోడలు. వాటిని అదుపులో ఉంచుకుని నిర్మలమైన మనస్సుతో ఆరాధించాలి. 
* పరమతాలను నిరాకరించడం యొక్క లక్ష్యం ఉత్తమ మత స్థాపన కావాలి తప్ప వాటిని ద్వేషించడం కాకూడదు.

 


   వేదాంత విద్యలో తిరుగులేని ప్రతిభను చూపిన మధ్వాచార్యులు