నగలా కావవి నక్షా బోరిస్

Header Banner

నగలా కావవి నక్షా బోరిస్

  Sat Oct 27, 2018 16:21        Recipes, Telugu

అంతరించిపోతున్న ఓ వంటకం కోసం ప్రభుత్వం దిగొచ్చి మహిళలకు ప్రత్యేకంగా ఆ వంటకం చేయడంలో శిక్షణ ఇస్తోందంటే ఆశ్చర్యంగా లేదూ! ‘నక్షా బోరీస్‌’ అనే వంటకం కోసమే ఈ తపనంతా! బెంగాలీ భాషలో బోరిస్‌ అంటే వడియాలు. నక్షా బోరిస్‌ అంటే నగల్ని పోలిన వడియాలని అర్ధం. వీటినే స్థానికంగా గ్యానాబోరిస్‌ అంటారు. పశ్చిమ్‌బంగలోని మిడ్నాపూర్‌ ప్రాంతం ఈ రకమైన వడియాల తయారీకి పెట్టింది పేరు. అక్టోబరు, నవంబర్‌ మాసాల్లో వర్షాలు ఆగి చలికాలం మొదలయ్యే రోజుల్లో ఈ వడియాలు పెడతారు. ఎండ కంటికి కనిపించకపోయినా వేడిమి తీవ్రత ఎక్కువగా ఉండే రోజులివి. ఈ మాసంలో పండే మినుములని రుబ్బురోల్లో రుబ్బి, ఒక పళ్లెంలో గసగసాలు పోసి మినప్పిండితో మెహెందీ పెట్టినట్టుగా చాలా చాకచక్యంగా ఈ నగల వడియాలని పెడతారు అక్కడి మహిళలు. అత్తారింటికి వెళ్లే అమ్మాయికి ఈ వడియాలని సారెగా పెట్టి పంపించడం అక్కడి ఆచారం. క్రమంగా ఈ వడియాలు పెట్టే మహిళలు తగ్గిపోవడంతో.. పశ్చిమ్‌బంగ ప్రభుత్వం స్వయంసహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఈ వడియాలకి భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

    నగలా కావవి నక్షా బోరిస్