హరిత భవనాలపై ప్రజల్లో ఆసక్తి .... డిజైన్ దశలో జాగ్రత్త అవసరం

Header Banner

హరిత భవనాలపై ప్రజల్లో ఆసక్తి .... డిజైన్ దశలో జాగ్రత్త అవసరం

  Sat Oct 27, 2018 16:03        Real Estate, Telugu

హరిత భవనాలపై ప్రజల్లో క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. పర్యావరణహితంగా నిర్మాణాలతో దీర్ఘకాలంలో నిర్వహణ వ్యయాలు తగ్గడం, ఆరోగ్యంగా ఉండడం వంటి ప్రయోజనాలతో గ్రీన్‌ బిల్డింగ్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడిప్పుడే బిల్డర్లు ముందుకొస్తున్నారు. నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని చాలామంది ఇప్పటికీ దూరంగా ఉంటున్నారు. డిజైన్‌ దశలోనే జాగ్రత్త పడితే సాధారణ నిర్మాణాల వ్యయంలోనే వీటిని నిర్మించవచ్చని అర్కిటెక్ట్‌లు అంటున్నారు. ఈ తరహా నిర్మాణాలకు ఉపయోగించే సామగ్రి ధరలు చాలావరకు ఇప్పటికే తగ్గాయని గుర్తు చేశారు. ప్రభుత్వం కొన్ని రాయితీలు అందిస్తే ప్రతి నిర్మాణం హరిత భవనం అవుతుందని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) హైదరాబాద్‌ ఛాప్టర్‌ అంటోంది.  విద్యుత్తు, నీటి కనెక్షన్ల మంజూరులో అనుమతులు వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది.  ఆస్తి పన్నులో 10 శాతం తగ్గింపు ఇవ్వాలని కోరింది. ‘సౌర విద్యుత్తు వినియోగిస్తున్న, మురుగు నీటి శుద్ధి, పునర్వినియోగం చేస్తున్న ప్రాజెక్ట్‌లకు ఆస్తిపన్నులో పది శాతం తగ్గింపు ఇవ్వాలని జీవో నం. 168 జారీ చేశారు. కానీ ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక తగ్గింపు ఇవ్వడం లేదు. దీన్ని అమలయ్యేలా చూడాలి. ఆక్యుపెన్సీ వచ్చినప్పటి నుంచి కాకుండా నిర్మాణ సమయం నుంచి దీన్ని వర్తింపచేయాలి’ అని సర్కారును ఐజీబీసీ కోరుతోంది. హరిత భవనాల ప్రమాణాల మేరకు నిర్మించకపోతే జరిమానా విధించాలని సూచించింది. తమ అభ్యర్థనలతో పాటు ఇతర రాష్ట్రాలు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి సర్కారుకు విన్నవించింది. 
రాష్ట్రాల వారీగా ప్రోత్సాహకాలు చూస్తే.. 
పంజాబ్‌: అదనంగా ఐదు శాతం ఫ్లోర్‌ ఏరియా రేషియో(ఎఫ్‌ఏఆర్‌) ఆయా ప్రాజెక్ట్‌ల్లో ఉచితంగా ఇస్తోంది. ఐజీబీసీ గోల్డ్‌, అంతకంటే పైన రేటింగ్‌ ఉన్నవాటికి దీన్ని వర్తింపజేస్తోంది. 
రాజస్థాన్‌:  సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం రేటింగ్‌ ఆధారంగా 7.5, 10, 15 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ను ఇస్తోంది. 
పశ్చిమ బంగ: ఐజీబీసీలో రిజిస్టర్‌ అయిన ప్రాజెక్ట్‌లకు 10 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ ఇస్తోంది. 
ఉత్తరప్రదేశ్‌: గోల్డ్‌, అంతకంటే పైన రేటింగ్‌ ఉన్నవాటికి అదనంగా ఐదు శాతం ఫ్లోర్‌ ఏరియా రేషియో(ఎఫ్‌ఏఆర్‌) ఆయా ప్రాజెక్ట్‌ల్లో ఉచితంగా ఇస్తోంది. 
మహారాష్ట్ర: సిల్వర్‌, గోల్డ్‌, ఫ్లాటినం రేటింగ్‌ ఆధారంగా 3, 5, 7 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ను ఇస్తోంది. 
ఆంధ్రప్రదేశ్‌: పర్మిట్‌ ఫీజుల్లో 20 శాతం తగ్గింపు ఇస్తున్నారు. మూడేళ్లలో ఆస్తిని విక్రయిస్తే 20 శాతం స్టాంప్‌డ్యూటీని ఒకసారి తగ్గిస్తున్నారు. 
హిమాచల్‌ప్రదేశ్‌: గోల్డ్‌, ఫ్లాటినం రేటింగ్‌ కలిగిన ప్రాజెక్ట్‌లకు 10 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ ఇస్తోంది. 
ఝార్ఖండ్‌: సిల్వర్‌, గోల్డ్‌, ఫ్లాటినం రేటింగ్‌ ఆధారంగా 3, 5, 7 శాతం అదనపు ఎఫ్‌ఏఆర్‌ను ఇస్తోంది.  

ఇవీ ప్రయోజనాలు.. 
పదిలక్షల చదరపు అడుగుల హరిత భవనం నిర్మాణాలతో సగటున పర్యావరణపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

12,000 టన్నులు  
15 మిలియన్‌  
45,000 లీటర్లు 
450 టన్నులు 
కార్బన్‌ డైయాక్సైడ్‌ తగ్గుతుంది 
యూనిట్లు    విద్యుత్తు ఆదా 
నీరు పొదుపు 
నిర్మాణ వ్యర్థాలు తగ్గుదల 
 

ఎందుకు వ్యయం అధికమంటే...

* 2001లో హరిత భవనాలకు అవసరమైన సామగ్రిలో అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. దీంతో వ్యయం బాగా పెరిగేది. 
* 2016-17 నాటికి కేవలం 10 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం. 90 శాతం ఉత్పత్తులు దేశీయంగా దొరుకుతున్నాయి. ఫలితంగా నిర్మాణ ఖర్చు తగ్గింది.

నిర్మాణ వ్యయంలో తగ్గుదల..

* 2003లో ప్లాటినం గ్రీన్‌ బిల్డింగ్‌ నిర్మాణ వ్యయం 18 శాతం అధికం. ఐదు నుంచి 8 ఏళ్లలో తిరిగి వెనక్కి వస్తుంది. 
* 2010లో నిర్మాణ వ్యయం 5 శాతానికి తగ్గింది. అదనపు వ్యయం మూడు నుంచి 5 ఏళ్లలో వెనక్కి వచ్చింది. 
* 2017లో నిర్మాణ వ్యయం 3 శాతానికి తగ్గింది. రెండుమూడేళ్లలో అదనపు వ్యయం తిరిగి వచ్చేస్తుంది. 
* 2022 నాటికి 0-1 శాతానికి వ్యయం తగ్గుతుందని అంచనా. ఆ మొత్తం కూడా ఏడాది నుంచి రెండేళ్లలో వస్తుంది.

ఒకటిన సదస్సు

గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ 16వ సదస్సు వచ్చేనెల 1 నుంచి 3 వరకు హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు. హరిత భవనాల నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి స్టాళ్లతో పాటూ ఈ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికత, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి చర్చించనున్నారు.

హరిత భవనాల నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి..

* ఫ్లైయాష్‌ ఇటుకలు 
*వేడిని నిరోధించే గ్లాసులు 
గోడలు, పైకప్పు ఇన్సులేషన్‌ 
సీఆర్‌ఐ సర్టిఫైడ్‌ కార్పెట్స్‌ 
తక్కువ వీఓసీ ఉండే రంగులు 
ఎఫ్‌ఎస్‌సీ సర్టిఫైడ్‌ కలప

ఖర్చు తగ్గించుకోవచ్చు..

హరిత భవనాల వ్యయం ఎక్కువ అంటుంటారు. డిజైన్‌ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ భవన నిర్మాణ వ్యయంలోనే వీటిని సైతం నిర్మించవచ్చు.

- ఎఫ్‌.పి.అంచూరి, ఛైర్మన్‌, 
ఇండియన్‌ కాంక్రీట్‌ ఇనిస్టిట్యూట్‌- హైదరాబాద్‌ ఛాప్టర్‌  

ప్రపంచంలో రెండో స్థానం మనది..

దేశంలో 6.33 బిలియన్‌ చదరపు అడుగుల హరిత భవనాల నిర్మాణాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచంలో మనం రెండో స్థానంలో ఉన్నాం. హరిత నగరాలు, హరిత పాఠశాలలు, అందుబాటులో హరిత గృహాలు లక్ష్యంగా ఈ ఏడాది గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ వార్షిక సదస్సులో ప్రధానంగా చర్చించబోతున్నాం.   హరిత భవనాలపై ప్రజల్లో ఆసక్తి .... డిజైన్ దశలో జాగ్రత్త అవసరం