అమెరికాలో టాప్‌-10లో నిలిచిన ఒకే ఒక్క భారత సంస్థ‌ టిసిఎస్, హెచ్‌-1బి ధ్రువీకరణ పత్రాలు 20 వేలకు పైగా పొందిన ఘనత టిసిఎస్ దే

Header Banner

అమెరికాలో టాప్‌-10లో నిలిచిన ఒకే ఒక్క భారత సంస్థ‌ టిసిఎస్, హెచ్‌-1బి ధ్రువీకరణ పత్రాలు 20 వేలకు పైగా పొందిన ఘనత టిసిఎస్ దే

  Wed Oct 24, 2018 12:04        Exclusives, Telugu

వాషింగ్టన్‌: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మరో ఘనత సాధించింది. అమెరికాలో 2018 ఆర్థిక ఏడాదికి గాను హెచ్‌-1బి వీసాల కోసం ఎక్కువ విదేశీ కార్మిక ధ్రువీకరణ పత్రా (ఫారిన్ లేబర్‌ సర్టిఫికెట్‌)లు పొందిన అగ్రశ్రేణి తొలి 10 సంస్థల్లో నిలిచింది. ఇరవై వేలకు పైగా పత్రాలతో భారత్‌ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక్క సంస్థ టీసీఎస్‌ కావడం గమనార్హం. భారత్‌ నుంచి ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు హెచ్‌-1బి వీసాల కోసం దరఖాస్తు చేసే సంగతి తెలిసిందే. అమెరికా కార్మిక శాఖ ఈ వివరాలను వెల్లడించింది.

అమెరికాలో కొన్ని ప్రత్యేక ఉద్యోగాలు, ఫ్యాషన్‌ మోడళ్లు, అత్యుత్తమ నైపుణ్యాలు, తెలివితేటలు ఉన్న విదేశీయులను సంస్థలు తాత్కాలికంగా వలసయేతర పద్ధతిలో నియమించుకొనేందుకు ఈ ధ్రువీకరణ విధానం ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కంపెనీలు నిపుణులను నియామకం చేసుకొనేందుకు విదేశీ కార్మిక ధ్రువీకరణ పత్రాలు పొందుతాయి. అలా ఎక్కువ పత్రాలు పొందిన టాప్-10 సంస్థల జాబితాలో టీసీఎస్‌ (20,755 పత్రాలు) నిలిచింది.

లండన్‌ ప్రధాన కార్యాలయంగా సేవలందించే ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ 1,51,164 హెచ్‌-1బి ప్రత్యేక నైపుణ్య కార్మిక ధ్రువపత్రాలతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ధ్రువపత్రాల్లో ఇది 12.4 శాతం కావడం గమనార్హం. కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ (47,732), హెచ్‌సీఎల్‌ అమెరికా (42, 820), కే ఫోర్స్‌ ఇంక్‌ (32, 996), ఆపిల్‌ (26, 833), టీసీఎస్‌ (20,755), క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ (20,723), ఎంఫసిస్‌ కార్పొరేషన్‌ (16,671), క్యాప్‌జెమిని అమెరికా (13,517) టాప్‌-10లో వరుసగా నిలిచాయి.

అమెరికా కార్మిక శాఖ సమాచారం ప్రకారం ఈ ఆర్థిక ఏడాది 6,54,360 దరఖాస్తులను స్వీకరించగా 5,99,782ను ధ్రువీకరించారు. 8,627ను తిరస్కరించారు. 45,951 దరఖాస్తులను ఉపసంహరించారు. మొత్తం 12,66,614 పోస్టులకు అనుమతి కోరగా 12,23,053ని ధ్రువీకరించారు. వీటిలో ఎక్కువ ఉద్యోగాలు 2,85,963 సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ కావడం గమనార్హం. కంప్యూటర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌ (1,76,025), కంప్యూటర్‌ సంబంధిత ఉద్యోగాలు (1,20,736), సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ (67,262), అకౌంటెంట్లు, ఆడిటర్లు (5,42,41), కంప్యూటర్‌ ప్రోగ్రామర్స్‌ (53,727) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హెచ్-1బి కార్మిక ధ్రువీకరణలో రాష్ట్రాల వారీగా చూస్తే కాలిఫోర్నియా (3,09, 205) అగ్రస్థానంలో ఉంది. టెక్సాస్‌ (1,15,484), న్యూయార్క్‌ (95,722), న్యూజెర్సీ (65,232), ఇల్లినాయిస్‌ (56,196), వాషింగ్టన్‌ (52,522), పెన్సిల్వేనియా (51,471) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

 


   హెచ్‌-1బి ధ్రువీకరణ పత్రాలు 20 వేలకు పైగా పొందిన ఘనత టిసిఎస్ దే