భ‌లే...భ‌లే..దుబాయ్ విమానాశ్ర‌యం

Header Banner

భ‌లే...భ‌లే..దుబాయ్ విమానాశ్ర‌యం

  Wed Oct 17, 2018 14:11        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, Travel, World


1948లో హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు హజ్‌యాత్ర కోసం ప్రత్యేక విమానాలు నడిపిన కాలంలో దుబాయిలో విమానాశ్రయం ఊహల్లో కూడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఇంత ఘనమైన స్థానానికి చేరుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన ఆంశం ఉంది. సువిశాల దుబాయి విమానాశ్రయంలోని లాంజిలలో ఎదురు చూసే వేలాది మంది ప్రయాణికులను చూస్తుంటే అశ్చర్యం కల్గుతుంది. కోనసీమ కుగ్రామాల నిరక్షరాస్య మహిళల నుంచి అమెరికా, బ్రిటన్‌ల పాశ్చాత్య దేశస్థులు, అరబ్బు వ్యాపారస్థుల వరకు అన్ని రకాల ప్రయాణికులు అందులో కనిపిస్తారు. ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న ఈ సువిశాల విమానాశ్రయం మీదుగా వెళ్ళడం భారతీయులతో సహా అందరికీ ఒక రకమైన అనుభూతి కల్గిస్తుంది.

చమురు ఆదాయం లేని దుబాయి ఆర్థిక వికాసంలో విమానాశ్రయం అత్యంత ముఖ్య భూమిక వహిస్తుండగా విమానాశ్రయం గుండా ప్రయాణం సాగించే విమానాలలో భారత దేశం గమ్యంగా ఉన్న విమానాలు ఎక్కువ ఉన్నాయి. దుబాయి – భారతదేశాల్లోని వివిధ నగరాల మధ్య సగటున ప్రతి రోజు 79 విమానాలలో సుమారు 20వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టులోని ప్రతి చోటా తెలుగు రాష్ట్రాల కార్మికులు, ఉద్యోగులు కనిపిస్తారు; కొందరు తాము తెలుగువారని చెప్పుకొంటారు మరికొందరు చెప్పుకోవడానికి ఇష్టపడరు.

గత కొన్నాళ్ళుగా విశ్వవ్యాప్తంగా అనేక ఉత్తమ ఆవార్డులను ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ అందుకుంది. 250 పైగా అత్యంత ఆధునిక విమానాలు కల్గిన ఈ సంస్థ కార్యకలాపాలన్నీ దుబాయి విమానాశ్రయం కేంద్రంగా జరుగుతాయి. దుబాయి విమానాశ్రయం అభివృద్ధి చెందినంత శరవేగంగా బహుశా ప్రపంచంలోని మరే ఇతర దేశంలోని విమానాశ్రయమూ అభివృద్ధి చెందలేదు.

ఇప్పుడు ఒకసారి మన స్వంత గడ్డ విషయానికి వద్దాం. హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానా శ్రయం నుంచి 1940లలో నిజాం నవాబు, టాటాల భాగస్వామ్యం కల్గిన దక్కన్ ఎయిర్ వేస్ క్రమం తప్పక ఢిల్లీ, బెంగళూర్, కలకత్తా, బొంబాయి, రంగూన్‌లకు విమానాలు నడిపిస్తున్న కాలంలో దుబాయితో సహా గల్ఫ్ దేశాలలో ఎక్కడా విమానాశ్రయాలు లేవు. 1948లో హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలు నడిపిన ఆ కాలంలో దుబాయిలో విమానాశ్రయం మాట దూరంలో కూడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఇంత ఘనమైన ఈ స్థానానికి చేరుకోవడంవెనుక ఒక ఆసక్తికరమైన ఆంశం ఉంది. కూతవేటు దూరంలో ఉన్న షార్జాతో దుబాయ్‌కి పడదు. లండన్ నుంచి భారత్‌కు నడిచే విమానాలు మార్గమధ్యంలో ఇంధనం నింపుకోవడానికి బ్రిటన్ విమానయాన సంస్థ షార్జా రాజు అనుమతితో ఒక విమానాశ్రయాన్ని నిర్మించుకున్నది. దానికి నెలకు 800 రూపాయాల అద్దె చెల్లించేది.

దుబాయి వర్తకులు భారత్‌కు ఎగుమతి చేసే ఉద్దేశంతో బంగారాన్ని లండన్ నుంచి పంపుతూ మార్గమధ్యంలో షార్జాలో దిగుమతి చేసుకొంటుండగా దానికి షార్జా రాజు పన్ను వసూలు చేయడం దుబాయి రాజుకు నచ్చలేదు. దుబాయి రాజు శేఖ్ రాషేద్ (ప్రస్తుత రాజు తండ్రి) లండన్‌కు వెళ్ళాలంటే షార్జాకు వెళ్ళి విమానం ఎక్కడం అవమానకరంగా భావించాడు. ఆ కాలంలో దుబాయి, షార్జా, ఇతర ఎమిరేట్లలలో రక్షణ మరియు విదేశీ వ్యవహారాలు బ్రిటన్ నియంత్రణలో ఉండేవి. కాబట్టి విమానాశ్రయానికి బ్రిటన్ అనుమతి తప్పని సరి. పైగా విమానాశ్రయాన్ని అద్దెకు తీసుకొనేది ఆంగ్లేయులే కాబట్టి అది మరీ అవసరం. దుబాయిలో విమానాశ్రయం నిర్మించుకోవటానికి బ్రిటన్ దొరల అనుమతి కోరగా వారు నిరాకరించారు. శేఖ్ రాషేద్ పట్టువదలకుండా ప్రయత్నించి చివరకు దుబాయిలో విమానాశ్రయ నిర్మాణానికి బ్రిటన్ నుంచి అనుమతి సాధించడమే కాకుండా, షార్జా రాజు కంటే సగం తక్కువ అద్దెకు నెలకు రూ.400 చొప్పున బ్రిటన్ ఎయిర్ లైన్స్ సంస్థకు అద్దెకు ఇచ్చాడు. దాంతో లండన్ నుండి బొంబాయికి నడిచే విమానం మధ్యలో ఈ విమానాశ్రయంలో ఆగేది. బొంబాయి నుండి లండన్‌కు విమాన ప్రయాణ వ్యవధి ఆ కాలంలో పూర్తిగా వారం రోజులు కాగా, విమానం మార్గమధ్యంలో యూరోపు, అరబ్బు దేశాల గూండా ఆగి ఇంధనం నింపుకొంటూ వెళ్ళేది. ఆ రకంగా 1960లో మొదలైన దుబాయి విమానాశ్రయం ఆ తర్వాత 1970 కాలానికి బొంబాయి, కరాచీ విమానాల రాకపోకలతో అభివృద్ధిచెంది నేడు ప్రపంచంలోనే అగ్రగామి విమానాశ్రయంగా ఎదిగింది.   dubai