ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలం

Header Banner

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలం

  Tue Oct 16, 2018 07:23        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Technology, Telugu, World


అమ‌రావ‌తి ః పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలమైందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి చెప్పారు. మండల పరిధిలోని అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో 3వ ఆటోమేటివ్‌ బ్యాటరీ ప్లాంట్‌కు సోమవారం ఉదయం భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమల అనుమతులు ఇవ్వడానికి ఉన్న పాలసీలను సరళతరం చేయడం, పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేయడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగంగా సాగుతోందన్నారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని రీతిలో ఏపీ వరుసగా మూడు సార్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచిందన్నారు. వరసగా మూడేళ్ల పాటు రాష్ట్రంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో 17 లక్షల కోట్లరూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల సదస్సులు నిర్వహిస్తున్నా.. అక్కడ చేసుకున్న ఒప్పందాల్లో 10-15 శాతం మాత్రమే పరిశ్రమలు ఏర్పడుతుండగా... ఏపీలో మాత్రం 30-45 శాతం కార్యరూపం దాల్చుతున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా నియోజకవర్గానికి ఒక ఎంస్‌ఎంఈ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే అంశంపై తిరుపతిలో త్వరలో ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ సదస్సును నిర్వహించనున్నట్లు చెప్పారు. అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో ఇప్పటికే రెండు బ్యాటరీ ప్లాంటులు ప్రారంభమయ్యాయని, తాజాగా రూ.700 కోట్ల పెట్టుబడితో 3వ ప్లాంట్‌కు భూమి పూజ చేసినట్లు అమరరాజా గ్రూప్‌ ఛైర్మన్‌ గల్లా రామచంద్రనాయుడు చెప్పారు. ఈ ప్లాంటు ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సమావేశంలో అమరరాజా గ్రూప్‌ సీఈవో ఎస్‌.విజయానంద్‌, మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ గీర్వాణి, ఎమ్మెల్సీ రాజసింహులు, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, చిత్తూరు మేయర్‌ హేమలత, ఏపీఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ దుర్గ తదితరులు పాల్గొన్నారు.   industries