తుపాన్ల‌పై ఇక ప‌క్కా విధానం ః చంద్ర‌బాబు

Header Banner

తుపాన్ల‌పై ఇక ప‌క్కా విధానం ః చంద్ర‌బాబు

  Tue Oct 16, 2018 07:16        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, Telugu


ఏటా సైక్లోన్‌ డే
అమరావతి: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందన్నా, తుపానుగా మారిందన్నా కోస్తా జిల్లాల ప్రజలకు కంటిపై కునుకు ఉండదు. వాయుగుండం, తుపాన్లు ఏ దిశగా కదులుతున్నాయి? వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది ప్రజలు నిరంతరం తెలుసుకుంటూ క్రమంగా ప్రాణనష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నా సహాయ చర్యలలో జాప్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు, వారాలపాటు ఇక్కట్లు తప్పటం లేదు. తుపాన్ల గురించి తెలుసుకోడానికి మొదట్లో రేడియోలో వచ్చే వాతావరణ సూచనలపైనే ఆధారపడేవారు. 2014 తరువాత రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ, రియల్‌టైం గవర్నెన్స్‌ (ఆర్‌టీజీ)ల నుంచి ప్రజలకు అందుతున్న సమాచారం నిర్దుష్టంగా ఉంటోంది. నాలుగేళ్ల వ్యవధిలో ప్రధానంగా హుద్‌హుద్‌, తిత్లీ తుపాన్లు వచ్చాయి. ఇస్రో సాయంతో వీటిని ముందుగా పసిగట్టి ఖచ్చితంగా ఎక్కడ తీరాన్ని దాటుతాయి? ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది చెప్పగలిగారు. ఫలితంగా తిత్లీలో ప్రాణనష్టాన్ని అంకెకు తగ్గించగలిగారు. హుద్‌హుద్‌ తుపాను ప్రభావం తగ్గాక యుద్ధప్రాతిపదికన తీసుకున్న సహాయచర్యలతో అతి తక్కువ సమయంలో యథాతథ స్థితికి తీసుకురావటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై బ్లూబుక్‌ రూపొందించి రాష్ట్రం కేంద్రానికి సమర్పించింది. తాజా తిత్లీలో మాత్రం హుద్‌హుద్‌ సమయంనాటి వేగంతో పోలిస్తే సహాయ చర్యలలో వెనకంజ ఉన్నట్లు కనిపిస్తోంది. రహదారులకు అడ్డంగాపడిన భారీ వృక్షాలు, వేలల్లో కూలిన విద్యుత్తు స్తంభాలు.. మారుమూల ప్రాంతాలలో సహాయచర్యలకు అడ్డంకిగా మారాయి. ఈ రెండింటి అనుభవాల ఆధారంగా తుపాన్లను ఎదుర్కోవటంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, వివిధ వర్గాల ప్రజలను సన్నద్ధపర్చడానికి కొన్ని నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
* ప్రధానంగా అక్టోబరు, నవంబరులోనే తుపాన్లు వస్తున్నా వీటిని ఎదుర్కోవటంలో మాత్రం పక్కా విధానం లేదు. హుద్‌హుద్‌ సమయంలో తయారుచేసిన బ్లూబుక్‌లో వీటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రస్తావనలున్నా, వరదల సమయంలో మాదిరి దీనిని అనుసరించటం లేదు. ఇకపై పక్కా విధానం అనుసరించాలని తాజా సమీక్షలో సీఎం నిర్ణయించారు.

* భూకంపాలు తీవ్రంగా ఉండే దేశాల్లో అవి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై పాఠశాల విద్య స్థాయిలోనే పిల్లలకు అవగాహన కల్పిస్తారు. తుపాన్లు వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసేటప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై కోస్తా ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు సహాయ చర్యలు చేపట్టే సంబంధిత శాఖల సిబ్బందితో అవగాహన కల్పిస్తారు. దీనికోసం ఏటా ఒక రోజును సైక్లోన్‌ డే గా గుర్తిస్తారు.

* సహాయచర్యలలో రహదారులు, విద్యుత్తు సౌకర్యం పునరుద్ధరణే కీలకం. ఇవి రెండూ అందుబాటులోకొస్తే మిగిలిన వాటిని సమకూర్చటంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. హుద్‌హుద్‌ అనుభవంతో విశాఖలోని అత్యధిక ప్రాంతానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు రూ.760కోట్ల వ్యయంతో భూగర్భకేబుళ్లు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం పనులు పూర్తయ్యాయి. ఇలా కోస్తా మొత్తానికి భూగర్భకేబుళ్లు వేయాలంటే రూ.వేల కోట్లు అవసరం. ప్రస్తుతం విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు వెచ్చిస్తున్న మొత్తానికి పది రెట్లు ఖర్చు పెడితేనే ఇది సాధ్యం. పరిమిత ఆర్థిక వనరుల దృష్ట్యా ఇది అసాధ్యం. దీనికి పరిష్కారంగా తుపాన్ల సందర్భంగా వీచే బలమైన గాలుల్ని (తాజా తిత్లీ సందర్భంగా వీచిన గాలుల్ని) సైతం తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన విద్యుత్‌ స్తంభాల్ని వినియోగించాలని నిర్ణయించారు. ఇవి ప్రస్తుతం వినియోగిస్తున్న స్తంభాలకు నాలుగు రెట్లు ఖరీదైనవే. ప్రస్తుత స్తంభాల స్థానంలో క్రమంగా వాటిని అమర్చుతారు. ఈలోగా కోస్తా ప్రాంతమంతటా ప్రతి పది, పదిహేను గ్రామపంచాయతీలకు ఒకటి చొప్పున జనరేటర్లు ఉంచుతారు. తిత్లీ ప్రభావిత ప్రాంతాలలో సుదూర ప్రాంతాల నుంచి జనరేటర్లు తీసుకెళ్లి పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేసేలా చూస్తున్నారు. దీనికి ఎక్కువ సమయం పడుతోంది.

* తుపాను బాధితులను ఆదుకోడానికి బియ్యం, పప్పులను రేషన్‌ దుకాణాల ద్వారా అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలల ద్వారా ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇకపై దీనికి పక్కా ఏర్పాట్లు చేస్తారు


   cm