సిక్కోలుపై సీఎస్‌ పునేఠ సమీక్ష

Header Banner

సిక్కోలుపై సీఎస్‌ పునేఠ సమీక్ష

  Sun Oct 14, 2018 07:02        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World


బాధితులకు అండగా ఆన్‌లైన్‌
అనుక్షణం పనులపై పర్యవేక్షణ
ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు
అమరావతి ః తితలీ’ విలయంతో కుదేలయిన శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న సహాయక చర్యలను ఆన్‌లైన్‌లో పొంచుపరిచి పర్యవేక్షిస్తున్నారు. ఏఏ గ్రామంలో ఎన్ని విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి, వాటిలో ఎన్ని పునరుర్ధరించారు. ఎన్ని గ్రామాలకు తిరిగి విద్యుత్‌ సరఫరా చేయగలుగుతున్నారు, ఎన్ని చోట్ల రహదారు దెబ్బతిన్నాయి, వాటిలో ఎన్నింటికి మరమ్మతులు చేశారు, తుఫాన్‌కు కూలిపోయిన చెట్లలో ఎన్ని చోట్ల తొలగించారు...ఇలా క్షేత్ర పరిస్థితిని, సహాయ చర్యల తీరును ఎప్పటికప్పుడు తెలసుకొంటూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.

దీనికోసం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అధికారులు ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుర్ధరణ నుంచి ప్రతి వివరం ఈ సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాబు.ఏ, ఆయన సిబ్బంది సిక్కోలులో జరుగుతున్న సహాయక పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ సమస్యలున్నాయి అనేది తెలుసుకుని యంత్రాంగాన్ని అక్కడికి పురమాయిస్తున్నారు.

సమస్య తీవ్రత ఉన్న ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన అధికారులను పంపుతూ, అక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రతి విభాగం నుంచి ఒక ప్రత్యేక ఉన్నతాధికారి ఆర్టీజీఎస్‌ కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలో ఆ విభాగానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను తక్షణం పరిష్కారమయ్యేలా సమన్వయం చేస్తున్నారు. తుఫాను విజృంభించిన తొలిరోజునుంచీ పలాసలోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆర్టీజీఎస్‌ నుంచి నిత్యం సమాచారం తెప్పించుకుని సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.

హెచ్‌టీటీపీఎస్‌://డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.ఆర్‌టీజీఎస్.ఏపీ.జీవోవీ.ఐన్‌/బీఐ/టీఐటీఎల్‌వై.హెచ్‌టీఎంఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా ఈ వివరాలు తెలుసుకొనే వెసులుబాటు కల్పించారు. కాగా, తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ సమీక్షించారు. శనివారం ఆయన సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి సహాయక చర్యల తీరును సమీక్షించారు. ఆర్టీజీఎస్‌ సీఈవో బాబు.ఏ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించాల్సిన సాయం గురించి తగు సూచనలు చేశారు. విద్యుత్‌ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రజలకు సకాలంలో మంచినీరు, ఆహారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు నిత్యం సమీక్షించాలన్నారు.   cs