రూ.2.69 లక్షల కోట్ల సంపద ఆవిరి

Header Banner

రూ.2.69 లక్షల కోట్ల సంపద ఆవిరి

  Fri Oct 12, 2018 15:17        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, Business, India, World


తీవ్ర నష్టాలతో ముగిసిన మార్కెట్‌
సెన్సెక్స్‌ 750 పాయింట్లు, నిఫ్టీ 225 పాయింట్లు నష్టం
హైద‌రాబాద్ ః ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా క్షీణించడంతో భారత మార్కెట్‌ గురువారం నష్టాల బాట పట్టింది. భారీ ఎత్తున అమ్మకాలు సాగడంతో ఒక దశలో బిఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 1,000 పాయింట్ల వరకు పడిపోయి 33,723.53 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. దేశీయ కరెన్సీ రూపాయి కూడా జీవితకాల కనిష్ఠ స్థాయి 74.45కి దిగజారడంతో భయోత్పాతంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఆర్థిక శాఖ రంగంలోకి వచ్చి కరెంట్‌ ఖాతా లోటును అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, రూపాయి త్వరలోనే కోలుకుంటుందని భరోసా ఇవ్వడం మార్కెట్లకు ఊరట ఇచ్చింది. ముడిచమురు ధర కాస్త తగ్గినప్పటికీ అమెరికన్‌ మార్కె ట్‌ ఏడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం, ఫలితంగా ప్రధాన యూరోపియన్‌, ఆసియా మార్కెట్లలో ఏర్పడిన పతనం, రూపాయి విలువ క్షీణత అన్నీ కలిసి మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీశాయని పరిశీలకులంటున్నారు.

బీఎ్‌సఈ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 760 పాయింట్ల మేరకు పడిపోయి 34,325.09 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆరు నెలల కనిష్ఠ స్థాయి. ఏప్రిల్‌ 11వ తేదీ తర్వాత సూచీ ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. నిఫ్టీ 225.45 పాయింట్ల నష్టంతో 10,234.65 వద్ద ముగిసింది. రోజు మొత్తంలో నిఫ్టీ 10138.60- 11335.95 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్లో ఏర్పడిన ఈ భారీ పతనంలో ఇన్వెస్టర్ల సంపద రూ.2.69 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఇది రూ.2,69,348 కోట్లు దిగజారి రూ.1,35,70,402 కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 నష్టాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ గరిష్ఠంగా 5.74 శాతం నష్టపోగా టాటా స్టీల్‌ 4.60 శాతం నష్టంతో రెండో స్థానంలో నిలిచింది. వేదాంత, మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటామోటార్స్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, కోటక్‌ బ్యాంక్‌, మారుతి, హీరో మోటోకార్ప్‌, కోల్‌ ఇండియా, ఐటీసీ షేర్లు కూడా సగటున 4.45 శాతం వరకు నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, విప్రో, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యుఎల్‌ కూడా నష్టపోయిన షేర్లలో ఉన్నాయి.

బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో 1765 స్ర్కిప్‌లు నష్టపోగా 819 లాభడపడ్డాయి. కేవలం 147 షేర్లు చెప్పుకోదగ్గ కదలికలేకుండా స్థిరంగా ఉన్నాయి. 370 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 2.34 శాతం మేరకు నష్టపోయాయి. మెటల్‌ ఇండెక్స్‌ 3.77 శాతం నష్టంతో అగ్రస్థానంలో ఉండగా ఐటీ, రియాల్టీ, టెక్నాలజీ, ఆటో, బ్యాంకెక్స్‌, హెల్త్‌కేర్‌, యంత్రపరికరాలు, విద్యుత్‌, ఇన్‌ఫ్రా, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ, పిఎ్‌సయు సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి.

చమురు, విమానయాన కంపెనీల దూకుడు
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర బ్యారెల్‌ 1.78 శాతం తగ్గి 81.61 డాలర్లకు చేరడం చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు 15 శాతం మేరకు లాభపడేందుకు దోహదపడింది. హిందుస్తాన్‌ పెట్రోలియం షేరు 14.70 శాతం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేరు 5.39 శాతం, భారత్‌ పెట్రోలియం షేరు 5.11 శాతం లాభపడ్డాయి.

ప్రభుత్వం విమాన ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో పౌర విమానయాన రంగానికి చెందిన షేర్లు మూడు శాతం మేరకు లాభపడ్డాయి. ఒకదశలో ఈ షేర్లన్నీ 7.5 శాతం మేరకు దూసుకుపోయాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు 3.25 శాతం, స్పైస్‌జెట్‌ షేరు 3.16 శాతం, జెట్‌ ఎయిర్‌వేస్‌ 1.11 శాతం లాభాలతో ముగిశాయి.

ట్రంప్‌ ఏమన్నారంటే...
ఇంతవరకు అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షులెవరూ మాట్లాడని విధంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు చర్యలను ట్రంప్‌ విమర్శించారు. డోజోన్స్‌ సూచీ 800 పాయింట్ల మేరకు పతనంకావడంపై విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానిస్తూ ‘ఇటీవల ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల విషయంలో దూకుడు ధోరణి ప్రదర్శించింది, వారు చాలా పెద్ద తప్పిదం చేశారన్నది నా అభిప్రాయం’ అన్నారు. అయితే మార్కెట్లో ఏర్పడింది ఎంతో కాలంగా రావలసిన కరెక్షనే అని, దాని గురించి భయపడాల్సింది లేదని ఆయన భరోసా ఇచ్చారు.

రూపాయి పడి లేచింది
అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ప్రభావం ఫారెక్స్‌ మార్కెట్‌పైనా పడింది. అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి భారీ క్షీణతను నమోదు చేసి చారిత్రక కనిష్ఠ స్థాయి 74.50 వరకు దిగజారి కోలుకుంది. చివరికి బుధవారం నాటి ముగింపు ధరపై 9 పైసలు లాభంతో 74.12 వద్ద ముగిసింది. తీవ్ర ఆటుపోట్లతో కూడిన మార్కెట్‌లో రూపాయి లాభపడడం ఇది రెండో రోజు. ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ బాండ్లపై రాబడులు క్షీణించడం రూపాయి కోలుకునేందుకు దోహదపడినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో రూపాయి ఇంతవరకు 13 శాతం నష్టపోయి ఆసియా దేశాల్లోనే భారీగా నష్టపోయిన కరెన్సీగా నిలిచిన విషయం విదితమే.

రూపాయి పతనం మంచిదే
ఒక క్రమ పద్ధతిలో రూపాయి పతనం మంచిదేనని, ఇది పోటీ సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త మార్టిన్‌ రమ అన్నారు. ఇటీవల కాలంలో రూపాయి పతనాన్ని సానుకూల చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది తాత్కాలికంగా మార్కెట్లపై ప్రభావం చూపినా ఒక క్రమపద్ధతిలో క్షీణించడం వల్ల పెట్టుబడి మార్కెట్లపై వత్తిడి తగ్గుతుందని ఆయన అన్నారు. అయితే దక్షిణాసియా మార్కెట్లు ద్రవ్యోల్బణం ముప్పును దృష్టిలో ఉంచుకుని కరెన్సీ విలువల తగ్గింపును వాయిదా వేసుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని అన్నారు. అయితే రూపాయి విలువ తగ్గుదల వల్ల అమెరికా, యూర్‌పలలో భారత ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని ఆయన అన్నారు.   dolor