నాలుగేళ్లుగా కేంద్రమే నాన్చుతోంది

Header Banner

నాలుగేళ్లుగా కేంద్రమే నాన్చుతోంది

  Fri Oct 12, 2018 11:14        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


కాపు రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచండి
కేంద్రం వద్ద 9 నెలలుగా పెండింగ్‌
దీనిపై జగన్‌ మోసాన్ని నిలదీద్దాం
విజ‌య‌వాడ ః రాష్ట్ర విభజన చట్టం అమలుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లతోనే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన మోసం బట్టబయలైందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారమిక్కడి నుంచి ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో ఆయన టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘పార్లమెంటులో కేంద్రమే హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని చేయలేమని అఫిడవిట్లు వేస్తోంది. కేంద్రం ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి. బీజేపీ నేతల మోసాన్ని. ద్రోహాన్ని నిలదీయాలి. కడప ఉక్కు తరహాలోనే విశాఖ రైల్వే జోన్‌ సాధనకు పోరాటం తీవ్రం చేయాలి.

రాజధానికి నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్‌... ఇలా అన్నింటిపైనా పోరాటం ఉధృతం చేయాలి. పార్లమెంటులో ఎంపీలు ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. విభజన చట్టంలోని అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుబట్టాలి. అటు పార్లమెంటు... ఇటు ప్రజాక్షేత్రం రెండు చోట్లా మన పోరాటం కొనసాగాలి. అన్నివైపుల నుంచీ కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. దాని మోసాన్ని దేశవ్యాప్తంగా ఎండగట్టాలి’ అని వారికి పిలుపిచ్చారు. కాపు రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రం పంపిన ప్రతిపాదన కేంద్రం వద్ద తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉందని, ఆ రిజర్వేషన్లను షెడ్యూల్‌ 9లో చేర్చాలని ఒత్తిడి తేవాలని సూచించారు.

కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్‌ మోసాన్ని నిలదీయాలన్నారు. కేసుల మాఫీ తప్ప జగన్‌ దృష్టి మరి దేనిమీదా లేదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో మానుఫాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎంపీలకు సూచించారు. ‘దీని ఏర్పాటుకు భూములు, విద్యుత్‌, నీరు అన్నీ ఇస్తున్నాం. అయినా కేంద్రం నాలుగేళ్లుగా నాన్చుతోంది. పైగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దుర్మార్గం. బీజేపీ అసత్యాలను తిప్పికొట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడేది లేదని చాటాలి’ అన్నారు.   cm