ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా ద‌స‌రా ఉత్స‌వాలు

Header Banner

ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా ద‌స‌రా ఉత్స‌వాలు

  Thu Oct 11, 2018 11:19        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


బాలా త్రిపుర సుందరి దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం
అమ‌రావ‌తి ః ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లలితా త్రిపుర సుందరిదేవి రూపంలో అమ్మవారు 3 సంవత్సరాల బాలికా రూపంలో కనిపిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా అనుకున్న పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం.

ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు. తొలిరోజు 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి రోజుతో పోలిస్తే ఈరోజు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి తెప్పించిన కళాకారుల డప్పు వాయిద్యాలు దుర్గమ్మ ఆలయంలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మవారి భక్తుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్సోత్సవాలు బుధవారం వైభవంగా ఆరంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలు మొదలయ్యాయి. వివిధ రకాల పూజలు అలంకరణ తరువాత ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మ తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చింది. భక్తుల సకల దారిద్య్రాలను తొలగించి.. ఐశ్వర్యాన్ని ప్రసాదించే రూపంలో దుర్గమ్మ దేదీప్యమానంగా వెలుగులీనుతూ.. భక్తులను ఆశీర్వదించింది. స్వర్ణకవచాలంకృత అమ్మవారిని దర్శించుకుంటే.. శుభదాయకం, ఆనందదాయకం, ఐశ్వర్యదాయకమని భక్తుల భావన. అందుకే జగన్మాత దర్శనానికి తండోపతండాలుగా భక్తజనం తరలివచ్చింది. నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవమూర్తులను అలంకరించిన పల్లకీలో ఉంచి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నగరోత్సవం నిర్వహించారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ నగరోత్సవాన్ని ప్రారంభించారు. మల్లేశ్వరాలయ ప్రధానార్చకుడు మల్లేశ్వరశాస్త్రి, స్థానాచార్య శివప్రసాదశర్మ పాల్గొన్నారు. నేడు బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరించనున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తారు.

శరన్నవరాత్ర వేడుకల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల పుణ్యస్నానాల నిమిత్తం కృష్ణవేణి ఘాట్‌కు ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్‌ నుంచి రోజుకు సుమారు 10 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేయనున్నట్లుగా నీటిపారుదల విభాగం అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నందున ఘాట్‌లో కనీస నీటిమట్టం మూడు అడుగులకు తగ్గకుండా రెగ్యులేటర్‌ను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. కేశఖండనశాలలో పురుషులకు, మహిళలకు విడివిడిగా ఏర్పాట్లు వేడుకలకు సంబంధించి అధికారులు కృష్ణవేణి ఘాట్‌ వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. దీంతో అమ్మవారికి తలనీలాలను సమర్పించుకోవాలనుకున్న భక్తులందరూ ఇక్కడికే వచ్చి తలనీలాలను సమర్పించుకోవాల్సి ఉంటుంది. గతంలో కేశఖండనశాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించగా ఈ ఏడాది పర్యవేక్షణను ఆలయ అధికారులే స్వయంగా నిర్వహిస్తున్నారు. గుండు, మూడు కత్తెర్లకు రూ.25గా నిర్ధారించి టిక్కెట్లు అందజేస్తున్నారు. కేశఖండనశాలలో విధుల నిమిత్తం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే సుమారు 611 మంది నాయీబ్రాహ్మణులు చేరుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. గతంలో పురుషులు, మహిళలు ఒకే వరుసలో కూర్చుని తలనీలాలను సమర్పించుకునేవారు కాగా ప్రస్తుతం అందుకు భిన్నంగా మహిళలకు వేరుగా ఏర్పాటు చేపట్టడం విశేషం. తలనీలాలు సమర్పించిన భక్తుల సౌకర్యార్థ్యం సమీపంలోనే జల్లుస్నానం సౌకర్యాన్ని కల్పించి వృధానీటిని పక్కగా వెళుతున్న బందరు కాలువ లోనికి మళ్లింపును చేపట్టారు.

 


   durgagudi