హ‌మ్మ‌య్య‌...తీరం దాటింది...

Header Banner

హ‌మ్మ‌య్య‌...తీరం దాటింది...

  Thu Oct 11, 2018 11:04        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


ఉత్త‌రాంధ్ర‌లో వ‌ణికిస్తున్న ఈదురుగాలులు...వ‌ర్షం
అప్ర‌మ‌త్తంగా ఉంచాల‌ని సిఎం చంద్ర‌బాబు ఆదేశం

అమరావ‌తి ః శ్రీ‌కాకుళం జిల్లాలో ‘తితలీ’ తుఫాను తీరం దాటింది. వజ్రపుకొత్తూరు మండలం తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను తీరం దాటిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై వాతావరణ శాఖ ముందే రెడ్ మెసేజ్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున రెండు గంటల సమయం వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఆ తరువాత మెల్లగా తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు తలదాచుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 53 కిలోమీటర్ల మేర తుఫాను కేంద్రం విస్తరించి ఉంది.తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం అంతటా పెను గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను ప్రభావం ఉద్దానం ప్రాంతంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, సోంపేటలో కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటలకు 140 నుంచి 150 ఒక్కోసారి 165 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురవడం మొదలయ్యాయి. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాలో, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది.
కొత్త‌పాలెం వ‌ద్ద ముందుకొచ్చిన సముద్రం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని డి మరువాడ ప్రాంతంలో సముంద్రం ముందుకు వచ్చింది. ఇసుక దిబ్బలు కోతకు గురయ్యాయి. హుద్‌హుద్ తర్వాత ఈ స్థాయిలో గాలులు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద సముద్రం బుధవారం 150 అడుగుల ముందుకు వచ్చింది. భీకర శబ్ధంతో అలలు తీరంపై విరుచుకుపడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొండ్రాజుపాలెంలో మత్స్యకారుల పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా జిల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాలైన పాలకాయితిప్ప, బసవన్నపాలెం, ఊటగుండ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి.

స‌హాయ‌క చ‌ర్య‌లలో తూర్పునావికా దళం
తితలీ తాకిడికి దెబ్బతినే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి తూర్పునావికా దళం సిద్ధమైంది. ఒడిశాతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నష్టం జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన తూర్పు నావికాదళం ముందస్తు ఏర్పాట్లు చేసింది.
రాత్రంతా కునుకు లేకుండా స‌మీక్ష‌లో సిఎం చంద్ర‌బాబు
‘తితలీ’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. తుపానుపై రాత్రంతా అప్రమత్తంగా ఉన్న సీఎం ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజి, ఇస్రో అధికారుల నుంచి తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. ఆర్టీజి ద్వారా శ్రీకాకుళం అధికారులకు తుపాన్ సమాచారం అందజేశారు. తెల్లవారుజామున వాయుగుండం తీరాన్ని దాటినట్లు సమాచారం అందడంతో దాని ప్రభావంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
పంట‌లు, ఆస్త‌ల‌కు న‌ష్టం
తుఫాను ప్రభవాతంతో పలాస మున్సిపాలిటీలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈదురుగాలుల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తినష్టం కలిగినట్లు తెలిపారు. పంటనష్టం, ఆస్తి నష్టంపై సమాచారం సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాలు తెరిపి ఇచ్చిన వెంటనే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. భోజనం, పులిహోర, తాగునీటి పాకెట్లు పంపిణీ చేయాలని, సహాయ పునరావాస చర్యల్లో అందరూ పాల్గొనాలని సీఎం సూచిచంారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సహాయచర్యలలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వేట‌కు వెళ్లొద్ద‌ని మ‌త్స్య‌కారుల‌కు ఆదేశం

తితలి తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తూ.గో జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో పెద్దఎత్తున అలలు రోడ్డుపైకి ఎగిసిపడటంతో రహదరి ధ్వంసమైంది. తీరాన ఉన్న ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.
ఎంపి రామ్మోహ‌న్‌నాయుడు స‌మీక్ష‌
జిల్లాలో ‘తితలీ’ తుఫాను తీరం దాటిన నేపథ్యంలో దాని ప్రభావంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు...అధికారులను అడిగి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎంపీ సూచించారు. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఆ తరువాత మెల్లగా తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ప‌రీక్ష‌లు వాయిదా
తలీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్, రవాణా వ్యవస్థ స్తంభించింది. తుఫాను పెను బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈరోజు, రేపు జరిగే ఇంటర్‌ హాఫ్ఇయర్లీ పరీక్షలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. తుఫాన్‌ కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నామని వెల్లడించారు.


   tuffan