డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ద‌స‌రా కానుక‌గా ఆర్ధిక సాయం

Header Banner

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ద‌స‌రా కానుక‌గా ఆర్ధిక సాయం

  Wed Oct 10, 2018 13:56        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Telugu, World


పసుపు-కుంకుమ చివరి విడతగా రూ.1,931 కోట్ల పంపిణీ
రూ.316 కోట్ల వడ్డీ మంజూరు...పండుగ నాటికి ఖాతాల్లో జమకు ఏర్పాట్లు
అమ‌రావ‌తి ఃడ్వాక్రా సభ్యులకు పసుపు-కుంకుమ చివరి విడత సాయాన్ని దసరా కానుకగా ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2014 మార్చి 31 నాటికి డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలికీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీకి బదులుగా పసుపు-కుంకుమ/పెట్టుబడి నిధి పేరుతో రూ.10వేలు ఆర్థిక సాయం చేస్తోంది. ఇందుకోసం అప్పటివరకు ఉన్న 86లక్షల మంది సభ్యులకు రూ.8,604 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే ఒక్కో సభ్యురాలికి మూడు విడతల్లో రూ.8వేల చొప్పున రూ.6,883 కోట్లు అందించగా చివరి విడతగా రూ.2వేలు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు రూ.1,931 కోట్లు అవసరమంటూ అధికారులు దస్త్రాన్ని ఆర్థిక శాఖకు నివేదించారు. మూడు, నాలుగు రోజుల్లో అక్కడి నుంచి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు.

అందనివారికి ఏకమొత్తంగా పదివేలు..
డ్వాక్రా సభ్యుల్లో కొందరికి ఆర్థిక సాయం చేరలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలో వెలుగు సీసీ ప్రతి సంఘాన్ని సంప్రదిస్తూ సాయం అందిందో లేదో తెలుసుకుంటున్నారు. సెర్ప్‌ పరిధిలో 70లక్షల మంది డ్వాక్రా సభ్యులుండగా ఇప్పటికే 30లక్షల మంది చెంతకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 22,205 మందికి అందలేదని గుర్తించారు. వీరందరికీ ఏకమొత్తంలో రూ.10వేల వంతున అందించనున్నారు.

డ్వాక్రా సభ్యులకు వడ్డీ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం రూ.316 కోట్లు మంజూరుచేసింది. దీన్ని కూడా దసరా నాటికి సభ్యుల రుణఖాతాల్లో జమచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డ్వాక్రా సభ్యులు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటి వడ్డీ రేటు మేరకు ప్రతి నెలా కడుతున్నారు. సభ్యులు చెల్లించే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం విడతల వారీగా సభ్యుల ఖాతాల్లో జమ(రీయింబర్స్‌) చేస్తోంది. ఇలా 2016 ఆగస్టు వరకు వడ్డీ మొత్తాన్ని చెల్లించింది. ప్రస్తుతం మంజూరు చేసిన రూ.316కోట్ల మొత్తంతో 2017 జనవరి వరకు అన్ని సంఘాలకు వడ్డీ చెల్లించనున్నారు.


   dwakra