15 ల‌క్ష‌ల మంది యాత్రికులు వ‌స్తార‌ని అంచ‌నా

Header Banner

15 ల‌క్ష‌ల మంది యాత్రికులు వ‌స్తార‌ని అంచ‌నా

  Wed Oct 10, 2018 07:21        APNRT, అమరావతి కబుర్లు, India, Telugu, World


అంగ‌రంగ వైభ‌వంగా ద‌స‌రా ఉత్స‌వాలు...
స‌ర్వాంగ సుంద‌రంగా ఇంద్ర‌కీలాద్రి
అమ‌రావ‌తి ః విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు బుధ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు వేడుకలు జరగనున్నాయి. నిత్యం 70 వేల మంది నుంచి లక్షన్నర మంది చొప్పున 15లక్షల మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పక్కాగా ఏర్పాట్లు చేశారు. రోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 14న మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు ఒకే రోజు 3 లక్షల మంది వరకూ భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అర్ధరాత్రి ఒంటి గంట నుంచే దర్శనానికి అనుమతిస్తారు. 25 లక్షల లడ్డూ ప్రసాదం, 25వేల కిలోల పులిహోరను భక్తుల కోసం తొమ్మిది రోజుల్లో సిద్ధం చేయనున్నారు. వేడుకల విధుల్లో ఏడు వేల మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. 1,500 మంది ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు వలంటీర్లుగా సేవలందిస్తారు. కొండ దిగువన రెండు కిలోమీటర్ల దూరం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఒకసారి క్యూలైన్‌లోకి ప్రవేశిస్తే నేరుగా కొండపైకి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నాకే బయటకు వస్తారు. రెండు ఉచిత, ఒకటి రూ.100, మరొకటి రూ.300 దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీ భక్తులకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ సమయంలోనే దర్శనానికి రావాలని అధికారులు సూచించారు. రోజూ ఉదయం 7 గంటల నుంచి 8గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 4గంటల వరకు పున్నమిఘాట్‌ నుంచి రూ.300 టిక్కెట్‌ తీసుకుని ప్రముఖులు వారికి కేటాయించిన వాహనాల్లో దర్శనానికి రావాలని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ విజ్ఞప్తిచేశారు. నిత్యం అమ్మవారి సన్నిధిలో ఐదు నుంచి పది వేల మందికి అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖ, గుంటూరు, మచిలీపట్నం నాలుగు వైపుల నుంచి దుర్గగుడికి వచ్చే వాహనదారులకు ఎక్కడికక్కడ పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వాహనదారులు ఆయా ప్రాంతాల్లో తమ వాహనాలను నిలిపి.. దర్శనానికి రావాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు సూచించారు. కృష్ణా రీజియన్‌ ఆర్టీసీ 17వందల ప్రత్యేక బస్సులను దసరా కోసం విజయవాడ నుంచి నడుపుతోంది. నేడు స్వర్ణకవచాలంకృత శ్రీదుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.   durga gudi