జపాన్‌ భాగస్వామ్యంతో హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌

Header Banner

జపాన్‌ భాగస్వామ్యంతో హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌

  Tue Oct 09, 2018 10:39        APNRT, Associations, అమరావతి కబుర్లు, Entertainment, Environment, India, Telugu, World


2న ముఖ్యమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన
2 ఎకరాల్లో, రూ.6 కోట్లతో భారత, జపాన్‌ సంస్కృతుల ప్రదర్శన
300- 500 మంది ఆసీనులయ్యేలా ఆడిటోరియం
కాగితపు గుజ్జుతో రూపొందే పిల్లర్లు ప్రత్యేక ఆకర్షణ
విజ‌య‌వాడ : రాజధాని అమ‌రావ‌తిలో భారత, జపాన్‌ దేశాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ‘హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌’కు ఈ నెల 12న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. మానవీయత, వైవిధ్యం, ఆవిష్కరణ (హ్యుమానిటీ, డైవర్సిటీ, ఇన్నొవేషన్‌)లకు చిహ్నంగా ఇది నిలవనుంది. ఇండో- జపాన్‌ సంయుక్త భాగస్వామ్యంతో అమరావతిలోని లింగాయపాలెం- కొండమరాజుపాలెంకు సమీపంలో రెండు ఎకరాల్లో ఇది రూపుదిద్దుకోనుంది. రూ.6 కోట్ల నిర్మాణ వ్యయంతో, ఒక అంతస్థుతో నిర్మితమయ్యే ఈ పెవిలియన్‌లోని ఒక భాగంలో భారతదేశం, జపాన్‌ సంస్కృతులను, ఈ రెండు దేశాల మధ్య చిరకాలంగా వర్థిల్లుతున్న స్నేహసంబంధాలను కళ్లకు కట్టే వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. ఇంకొక భాగంలో 300 నుంచి 500 మంది వరకు ఆసీనులయ్యేందుకు వీలుగా చక్కటి ఆడిటోరియంను నిర్మిస్తారు. భారతదేశంతోపాటు జపాన్‌కు చెందిన కళాకారుల ప్రదర్శనలను ఇందులో ఏర్పాటు చేస్తారు. కాగితపు గుజ్జుతో రూపొంది, కనువిందు చేసే వినూత్న పిల్లర్లు ఈ పెవిలియన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రిట్జ్‌కర్‌ పురస్కార గ్రహీతతో డిజైన్‌..
అమరావతిని భవిష్యత్తులో సందర్శించే జపాన్‌ దేశ ప్రజలతోపాటు మన దేశీయులనూ అలరించేలా రూపొందబోతున్న ఈ పెవిలియన్‌ డిజైన్‌ను జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ షిగురు బన్‌ రూపొందించారు. పలు సుప్రసిద్ధ కట్టడాల ఆకృతులను రూపొందించిన షిగురు ఆర్కిటెక్చర్‌లో నోబెల్‌ బహుమతిగా అభివర్ణించదగిన ప్రిట్జ్‌కర్‌ ఆర్కిటెక్చర్‌ పురస్కార గ్రహీత! విశాలంగా, ప్రశాంతతకు నెలవుగా ఉండబోయే ఈ పెవిలియన్‌ను జపాన్‌కే చెందిన కుని ఉమి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్మించబోతోంది.

శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన
అమరావతిలోని ఏపీసీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయానికి సమీపంలో ఈ నెల 12వ తేదీన ఈ పెవిలియన్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కుని ఉమి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యసుయో యమజకి ప్రభృత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పెవిలియన్‌కు కేటాయించిన ప్రదేశాన్ని సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ ఎస్‌.షణ్మోహన్‌, ఉన్నతాధికారులు బి.ఎల్‌.చెన్నకేశవరావు, సీఈ ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ, జేడీ వి.శ్రీనివాసరావు, సీసీడీపీ జేడీ జిలానీ, తుళ్లూరు ఏఎస్పీ బి.కృష్ణారావు, తుళ్లూరు ఎంపీడీవో బి.శ్రీనివాసరావు సోమవారంనాడు పరిశీలించారు. శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.   pevilion