స్మార్ట్‌ హోమ్స్‌

Header Banner

స్మార్ట్‌ హోమ్స్‌

  Mon Oct 08, 2018 10:18        Real Estate, Telugu

కొత్త తరం ఇళ్లొస్తున్నాయి.. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ హోమ్స్‌దే హవా.. బడా స్థిరాస్తి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా తమ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను నిర్మించే ప్రణాళికల్లో ఉన్నాయి. కసరత్తు మొదలెట్టాయి. విదేశాల్లోని ఈ తరహా ఇళ్లను అధ్యయనం చేస్తున్నాయి. సాంకేతికతను అర్థం చేసుకునేందుకు నిర్మాణదారులు వ్యక్తిగతంగా తమ ఇళ్లలో వాటి పనితీరును అంచనా వేస్తున్నారు. కుదిరితే 2020 కల్లా మన దగ్గర స్మార్ట్‌హోమ్స్‌ ప్రాజెక్ట్‌లు కార్యరూపం దాల్చబోతున్నాయి. 
ఇంటి నిర్మాణం, అలంకరణలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు వస్తున్నాయి. సంప్రదాయ శైలి నుంచి క్రమంగా పాశ్చాత్య, ఆధునిక పోకడల వైపు మరలుతున్నాయి. విదేశీ అనుకరణ ఎక్కువగా కనిపిస్తోంది. కొనుగోలుదారుల ఆసక్తులకు తగ్గట్టుగా నిర్మాణదారులు కొత్తవాటిపై దృష్టి పెడుతున్నారు. సకల సౌకర్యాలు క్లబ్‌హౌస్‌, ఈతకొలను, వాకింగ్‌ ట్రాక్‌, అతిథి గదులు, ఆటస్థలాలు, ఆహారశాలతో పాటూ అన్నీ అక్కడే దొరికే గేటెడ్‌ కమ్యూనిటీలు బాగా ప్రాచుర్యం పొందాయి. విల్లాలైనా, ఆకాశహార్మ్యాలైనా ఈ హంగులన్నీ ఉండాల్సిందే. పెద్ద సంస్థలు నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో ఇవి తప్పనిసరిగా ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో వీరు చేపట్టే ఇళ్లలన్నీ స్మార్ట్‌గా ఉండబోతున్నాయనే సంకేతాలు ఇస్తున్నారు. 
ఇప్పటికే వ్యక్తిగతంగా.. 
స్మార్ట్‌ హోమ్స్‌ అంటే ఇంట్లో ఉండేవారి పనిని తేలిగ్గా చేయడం. ఇంట్లోని ఉపకరణాలు, పరికరాలు వివేకంతో పని చేయడం అన్నమాట. ఇంటర్‌నెట్‌ ఆధారిత(ఐవోటీ), కృత్రిమ మేధతో పనిచేస్తాయి. సాధారణంగా ఇంట్లో గదుల్లో మనుషులు ఉన్నా లేకున్నా విద్యుత్తు దీపాలన్నీ వెలుగుతుంటాయి. బంద్‌ చేయడం మర్చిపోతే అలాగే వెలుగుతుంటాయి. దీంతో చాలా విద్యుత్తు వృథా అవుతోంది. అదే గదిలో వెళ్లగానే లైట్‌ వెలిగి.. బయటకు రాగానే ఆరిపోయేలా సెన్సర్లతో పనిచేసేలా ఏర్పాటు చేసుకుంటే మన ఇల్లు చాలా స్మార్ట్‌ అవుతోంది. గది ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాను, ఏసీలు పనిచేయడం వరకు చాలా ఉన్నాయి. వేసవిలో బయటి నుంచి ఇంటికి రాగానే చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇంటికి చేరువలో ఉన్నప్పుడే మొబైల్‌ ఆధారంగా ఏసీని ఆన్‌ చేస్తే ఇంట్లో అడుగుపెట్టేసరికి చల్లదనం స్వాగతం పలుకుతుంది. ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉంటే వైఫై సెక్యూరిటీ కెమెరాతో మొబైల్‌ నుంచే వారిని ఓ కంట కనిపెట్టవచ్చు. ఆపిల్‌ ఫోన్‌ అయితే సిరి, అండ్రాయిడ్‌ మొబైల్‌ అయితే గూగుల్‌ అసిస్టెంట్‌తో నగరంలో వ్యక్తిగతంగా కొంతమంది ఇళ్లలో ప్రస్తుతం స్మార్ట్‌గా ఉపయోగించుకుంటున్నారు. మార్కెట్లోనూ స్మార్ట్‌ పరికరాల అందుబాటు పెరగడం, ధరలు సైతం అందుకునే స్థాయిలో ఉండటంతో వీటిపై అవగాహన ఉన్నవారు వాడుతున్నారు. 
ప్రాజెక్ట్‌ మొత్తం 
వ్యక్తిగత ఇళ్లనుంచి రాబోయే రోజుల్లో ప్రాజెక్ట్‌ మొత్తం ఈ తరహా స్మార్ట్‌హోమ్స్‌ నిర్మించే పోకడ చూడబోతున్నాం.ప్రస్తుతం చూస్తే ఇంట్లోని ఇంటీరియర్‌కు కొనుగోలుదారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్గుగా డిజైన్‌ చేయించుకునేందుకు ఖర్చుకు వెనకాడడం లేదు. ఇందుకు తగ్గట్టుగా ప్రాజెక్ట్‌ డిజైన్‌ దశ నుంచే నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇదే మాదిరి రాబోయే రోజుల్లో ఇల్లు స్మార్ట్‌గా పనిచేసేందుకు తగ్గట్టుగా ప్రణాళిక దశ నుంచే డిజైన్‌పై దృష్టి పెట్టబోతున్నారు. 
మార్కెట్‌ పోకడను బట్టి.. 
కొనుగోలుదారులను ఆకట్టుకోవాలన్నా.. మార్కెట్లో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నా..తాజా పోకడలను అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో నగరంలోని నిర్మాణ సంస్థలు ముందుంటున్నాయి. ప్రస్తుతం హరిత భవనాల నిర్మాణాల పోకడ నడుస్తోంది. ఐజీబీసీ నుంచి ప్లాటినం, గోల్డ్‌ రేటింగ్‌ పొందిన ఇళ్లను నిర్మిస్తున్నారు. వ్యక్తిగతంగా మొదలైన ఈ తరహా ఇళ్ల నిర్మాణం.. ప్రాజెక్ట్‌ల్లో విస్తరించింది. ప్రస్తుతం బడా సంస్థలన్నీ తమ కొత్త ప్రాజెక్ట్‌లను దాదాపుగా హరిత భవనాల కింద రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ముందుకు వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ మేరకు నిర్మాణదారులు మారుతున్నారు. దీని తర్వాత స్మార్ట్‌హోమ్స్‌ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు.

ఇలా చాలా స్మార్ట్‌ గురూ..

 * నగరమైనా దొంగతనాల భయం వెంటాడుతుంటుంది. దసరా పండగ సెలవుల్లో, ఎక్కడికైనా కొద్దిరోజుల పాటు విహారానికి వెళితే ఇంటి భద్రతపైనే ఎక్కువమంది ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్‌ హోమ్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ ఉంటే భరోసాగా ఉండొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచినా ఆందోళన చెందాల్సిన పనిలేదనే భరోసా ఇస్తోంది ఈ పరికరం. వైఫై సెక్యూరిటీ కెమెరా ఇది. రాత్రిపూట కూడా పనిచేస్తుంది. అవసరమైన చోట దీన్ని బిగించుకుని యాప్‌ సహాయంతో అవసరమైనప్పుడు మొబైల్‌ నుంచే చూసుకోవచ్చు. ఇంటిని, పిల్లలను ఓ కంట కనిపెట్టవచ్చు.  
* వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్‌ స్విచ్చులు వచ్చాయి. టీవీలు ఏసీలు మాత్రమే కాదు ఇంట్లో బల్బులు, ఫ్యానులు, స్టీరియోలు రిమోట్‌తో నియంత్రించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. మొబైల్‌ యాప్‌ సహాయంతో ఎక్కడ ఉన్నా వీటిని ఆన్‌, ఆఫ్‌ చేయవచ్చు. ఏ సమయంలో నిద్ర లేపాలో చెబితే ఆ వేళకు బిగ్‌బాస్‌ షో మాదిరి మ్యూజిక్‌ సిస్టమ్‌ నుంచి వచ్చే పాటతో నిద్ర లేపుతుంది.  
* స్మార్ట్‌గా పనిచేసే ఎల్‌ఈడీ బల్బులు ఈ రోజుల్లో ఇంటికి ప్రధాన ఆకర్షణ. అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్‌ వేయగానే సంగీతం కూడా వినపడితే అలసిన మనసుకు స్వాంతన కలుగుతుంది. ఈ తరహా స్మార్ట్‌ పరికరాలు మున్ముందు ప్రతి ఇంట్లో సాధారణం కాబోతున్నాయి.  
* రోజువారీ, ముఖ్యంగా దీపావళి వంటి పండగల సమయంలో గృహిణులకు ఇంటిని శుభ్రం చేయడం పెద్దపని. తీరిక లేకుండా ఉండేవారికి ఇంటిని శుభ్రం చేసే స్మార్ట్‌ క్లీనింగ్‌ రోబోలు వచ్చాయి. వాక్యుమ్‌ క్లీనర్‌ అనగానే ఎక్కడో అల్మారాలో దాచిన దాన్ని బయటకు తీసి శుభ్రం చేయమంటే బద్దకిస్తుంటారు. చిన్న పరిమాణంలో వచ్చిన ఈ క్లీనింగ్‌ రోబో సులువుగా శుభ్రం చేస్తుంది. మూలలు, ఫర్నిచర్‌ అడుగుభాగం అన్నిచోట్లకు వెళుతుంది. క్లీనింగ్‌ రోబోలతో ఏ రోజు, ఏ సమయంలో శుభ్రం చేయాలో ఆదేశాలు ఇస్తే చాలు దానంతట అది పని చేసుకుంటూ పోతుంది.

 


   స్మార్ట్‌ హోమ్స్‌