కృత్రిమ అవయవాలతో సాధన విద్యార్దులకు చక్కని జ్ఞాన సముపార్జన

Header Banner

కృత్రిమ అవయవాలతో సాధన విద్యార్దులకు చక్కని జ్ఞాన సముపార్జన

  Mon Oct 08, 2018 10:12        Science, Telugu

ఆ ల్యాబ్‌లో.. రక్తమోడుతున్న కిడ్నీలని చేతుల్లోకి తీసుకుని.. దగ్గరగా పరిశీలిస్తున్నాడో సర్జన్‌..  రక్తనాళాలతో భీకరంగా ఉన్న గుండెను నొక్కుతూ రక్తాన్ని పంప్‌ చేస్తున్నాడు మరో డాక్టర్‌.. ఆపరేషన్‌  గదిలో నిజమైన సర్జరీ చేయడానికి ముందే ఇక్కడ ఇలా ప్రాక్టీస్‌ జరుగుతోంది. అర్థం కాలేదా? అవన్నీ 3డీలో ప్రింట్‌ అయిన అవయవాలు. అయితే ప్లాస్టిక్‌ విడిభాగాల్లా కాకుండా కత్తిపడగానే రక్తం స్రవిస్తూ నిజమైన అవయవాల్లా ప్రవర్తించడమే వీటి ప్రత్యేకత...

టిమ్‌కి కిడ్నీ క్యాన్సర్‌ ఉందని తెలిసింది. శస్త్రచికిత్స చేయాలి. ఆపరేషన్‌కి రెండువారాల ముందు తనకు శస్త్రచికిత్స చేయబోయే డాక్టర్‌ని కలిశాడు టిమ్‌. డాక్టర్‌ సీటీస్కాన్‌ చేసి టిమ్‌ కిడ్నీ గురించిన పూర్తి సమాచారం సేకరించాడు. దాని బరువు... స్వభావం. ఇంకా చాలా విషయాలు. కొద్దిరోజుల్లోనే ఆయన చేతిలోకి అచ్చంగా టిమ్‌ కిడ్నీని పోలిన నమూనా కిడ్నీ వచ్చి చేరింది. అదాటున చూస్తే తలవెంట్రుక మందంలో ఉన్న రక్తనాళాలు, వాటి రంగు... తాకితే కలిగిన అనుభూతి, కోస్తే నెత్తురు రావడం ఇవన్నీ చూస్తే అది అచ్చమైన కిడ్నీనే అనిపించింది. కానీకాదు. అది నమూనా మాత్రమే. దాంతో డాక్టర్‌కి తాను చేయబోయే శస్త్రచికిత్స గురించి లోతైన అవగాహన ఏర్పడింది.  ఇలా 3డీ ప్రింటింగ్‌లో తయారైన ఈ కృత్రిమ అవయవాలని  వైద్యులు సర్జరీలు చేయడానికి ముందు జరిగే ప్రాక్టీస్‌లో వాడుతున్నారు. ఈ సాధన వల్ల సర్జన్లకి శస్త్రచికిత్సలప్పుడు పని సులభతరం అవ్వడంతోపాటు  రోగికి మరింత భద్రత ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

కీలక శస్త్రచికిత్సలవేళ సాధన కోసం... 
రోచెస్టెర్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన సిములేషన్‌ ఇన్నొవేషన్‌ ల్యాబ్‌ ఈ ప్రత్యేకమైన త్రీడీ అవయవాలని తయారుచేస్తోంది. ఆ సంస్థకు చెందిన బయో మెడికల్‌ విద్యార్థుల బృందమే ఈ కృత్రిమ అవయవాలని తయారుచేస్తోంది. క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేటప్పుడు.. రోబోటిక్‌, ఓపెన్‌ సర్జరీల్లో రోగి శరీరంపై పూర్తి అవగాహనరావడానికీ, శస్త్రచికిత్సను సులభతరం చేయడానికీ ఈ త్రీడీ అవయవాలు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతానికి మూత్రపిండాలు, కాలేయం, వెన్నెముక, గుండె, మోకీళ్లు వంటి అవయవాలని ఈ సంస్థ తయారుచేస్తోంది.

సిలికాన్‌కి బదులుగా... హైడ్రోజెల్‌ 
మొదట్లో ఈ అవయవాలని ప్లాస్టిక్‌తో తయారుచేసినా... అవి సహజత్వానికి దూరంగా ఉండటంతో సిములేషన్‌ ఇన్నొవేషన్‌ ల్యాబ్‌ని ప్రారంభించిన ఘాజీ ఈ విధానంలో సరికొత్త మార్పులని తీసుకొచ్చారు. రోగి సీటీస్కాన్‌ ఆధారంగా అచ్చంగా అదే అవయవాలని పోలిన కృత్రిమ అవయవాలని 3డీ విధానంలో తయారుచేస్తారు. ఈ విధానంలో ప్లాస్టిక్‌, సిలికాన్‌ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు జెల్‌ తరహా పదార్థాన్ని వాడుతున్నారు. ఈ జెల్‌ని హైడ్రోజెల్‌ అంటారు. ఇందులో 70శాతం నీరే ఉంటుంది. అచ్చంగా మన అవయవంలానే అనిపించడానికి ఈ పదార్థమే కారణం. ఈ పదార్థాన్ని వాడటం వల్ల ఆపరేషన్‌ థియేటర్‌లో నిజమైన రోగి పరిస్థితి ఎలా ఉంటుందో డాక్టర్‌కి అర్థమవుతుంది. వైద్యవిద్యార్థులకు ఉపయోగపడే ఈ అనటామికల్‌ మోడల్స్‌కి చాలా వేగంగా ఆదరణ పెరుగుతోందని అంటున్నారు వీటిని తయారుచేస్తున్న ఘాజీ.

రక్తం స్రవిస్తుంది 
అయితే వీటిని ఓకేసారి పెద్దఎత్తున తయారుచేయడానికి కాదట. రోగి అవసరాన్ని బట్టి రెండు వారాల ముందుగా తయారుచేస్తారట. ఒక్క నకలు ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకసారి దానిపై ప్రాక్టీస్‌ జరిగితే మళ్లీమళ్లీ ఉపయోగపడదు. నిజమైన అవయవాలని పోలిన స్వభావం, రంగు తీసుకురావడం ఒక సవాల్‌ అయితే... నరాలు, కిడ్నీలను తాకినప్పుడు అవి ప్రవర్తించే తీరుని కూడా పసికట్టాలి. కృత్రిమ అవయవాలు సైతం అలా ప్రవర్తించేట్టు చేయాలి. కోస్తే రక్తం రావాలి. అప్పుడే సర్జన్‌ దానిని నిజమైన శస్త్రచికిత్సలా అనుభూతి చెందుతాడు అంటున్నారు బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు.

 


   కృత్రిమ అవయవాలతో సాధన విద్యార్దులకు చక్కని జ్ఞాన సముపార్జన