భార‌త జాతి పిత గాంధీజీ

Header Banner

భార‌త జాతి పిత గాంధీజీ

  Tue Oct 02, 2018 07:57        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Telugu, World


ప్ర‌పంచం మెచ్చిన నేతగా బాపు
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.
మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ కేవలం స్వాతంత్య్ర సమర యోధుడే అయ్యుంటే బ్రిటీషు దాస్యశృంఖలాలు వీడిపోవటంతోనే ఆయన పాత్ర పూర్తయిపోయి ఉండేది. ఆ పేరు చరిత్రపుటలకే పరిమితమైపోయేది. కానీ ఆయన ఒక సంస్కర్తగా మానవ జీవన స్వరూప, స్వభావాలను ఆకళింపు చేసుకుని.. మనిషిలో మార్పు కోసం, అభ్యుదయం కోసం సత్యనిష్ఠతో అంతర్‌-బహిర్‌ లోకాల్లో అన్వేషిస్తూ బలమైన తాత్విక చింతన చేశారు గాంధీజీ. అందుకే ఆయనను భరతఖండమే కాదు.. చింతనాపరుడిగా, చీకటిలో దారి చూపించే క్రాంతదిగ్దర్శిగా, మానవాళి మధ్య నడయాడిన మహాత్ముడిగా యావత్‌ ప్రపంచం ఇప్పటికీ స్మరించుకుంటోంది. బుద్ధుడి తర్వాత ఇంతగా ప్రపంచ ప్రజల హృదయాలను తాకి, గణనీయ ప్రభావం చూపించిన మరో భారతీయుడు మరెవరూ లేరు. ఆయనను బుద్ధుడు, క్రీస్తు వంటి అజరామర ప్రవక్తల సరసన, సోక్రటీస్‌ వంటి తత్వవేత్తల చెంతన చేర్చి చూస్తుండటం కూడా ఇందుకే! ఎందరు ఆయనను ‘సత్తెకాలపు సత్తెయ్య’గా కొట్టిపారేస్తున్నా, ఆచరణకు అసాధ్యమైన ‘ఆదర్శాల పుట్ట’గా ఈసడించుకుంటున్నా.. గాంధేయ విలువలకు, గాంధీ ఆలోచనలకు ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆధునిక సమాజం ఇప్పుడు మరింతగా గుర్తిస్తోంది. గాంధీ మహాత్ముడి 150వ జయంతి వేడుకల సందర్భంగా జీవిత పర్యంతం ఆయన ప్రవచించిన సార్వజనీన విలువలను మననం చేసుకోవటం.. మనకు అవసరం!!
ఆయన రాకతో...
అంతకముందు బ్రిటీషు పాలనను ధిక్కరిస్తూ స్వరాజ్యం కోసం ప్రాణాలర్పించిన ధీరులెందరో ఉన్నారు. బెంగాల్లో, మహారాష్ట్రలో, పంజాబ్‌లో.. ఇలా దేశమంతటా చిన్నచిన్న తిరుగుబాట్లు తీసుకువచ్చి.. ప్రాణాలను బలిపెట్టిన ఆదివాసులు, పంటకాపులు, విప్లవ వీరులెందరో. కానీ 1921కి పూర్వం ప్రజలు ఒక జన సంద్రంగా కదిలివచ్చి రాజకీయంగా పెను ప్రకంపనలు తెచ్చిన ఉద్యమం లేనేలేదు. ఈ పరిస్థితుల్లో పెనుమార్పు తెచ్చినవారు గాంధీజీ. బ్రిటీషు పాలకులపై పోరాటం జయప్రదం కావాలంటే ముందు ప్రజల్లో ఆత్మస్థైర్యం నూరిపోయాలి. ఆత్మాభిమానాన్ని రగిలించాలి. లోటుపాట్లు ఎన్ని ఉన్నా సొంత సంస్కృతిపై మమకారాన్ని పెంచాలి. వివిధ మతాల ప్రజల మధ్య స్నేహవారధులు నిర్మించాలి. అందుకే గాంధీజీ ముందుగా ఈ పనికి ఉద్యుక్తులయ్యారు. ‘సత్యాగ్రహం’, ‘సహాయ నిరాకరణ’ లను అస్త్రాల్లా ప్రయోగించారు. తొలినాళ్లలో అవేమంత పెద్దగా ఆకట్టుకోలేదు. నాగరకత ఎంతగానో విస్తరిస్తున్న రోజుల్లో ఒక పెద్దాయన ముందుకొచ్చి ‘రాట్నం తిప్పటం’, ‘నూలు వడకటం’ వంటి పాతకాలం పద్ధతులను పైకి తెస్తుంటే ప్రజలు వింతగా చూశారు. కానీ సామ్రాజ్యశక్తిని ధిక్కరిస్తూ ఆయన సవాళ్లు విసురుతున్న తీరు, ఆయన మాటల్లోని అసమాన ధీరత్వం అందరినీ చిత్రంగా ఆకర్షించింది. పట్టణాలను దాటి.. మధ్యతరగతిని మించి.. గ్రామగ్రామాన్నీ ఆయన మేల్కొల్పుతున్న తీరు ప్రజలను కట్టిపడేసింది. బ్రిటీషు వ్యాపారాన్ని దెబ్బకొట్టటం కన్నా ప్రజలు స్వయంశక్తిని గుర్తించేలా చేయటమే ఆయన లక్ష్యం. పల్లె నుంచి పట్టణం వరకూ అంతా అత్యంత సులభంగా ఆచరించగలిగిన ఈ విధానాలు ప్రజలను ఉవ్వెత్తున కదిలించాయి. యావద్దేశాన్నీ ఒక్క ఉద్యమ తాటి మీదకు తెచ్చాయి. తన ప్రణాళిక ఏదైనా సరే.. వీలైనంత మంది ప్రజలను దానిలో భాగస్వాములను చేయటమే ఆయన పద్ధతి! అదే జన నాయకుడిగా ఆయన విజయరహస్యం.

తన ప్రణాళిక ఏదైనా సరే.. వీలైనంత మంది ప్రజలను దానిలో భాగస్వాములను చేయటమే ఆయన పద్ధతి! అదే జన నాయకుడిగా ఆయన విజయరహస్యం.
సామాన్యుల్లో అతి సామాన్యుడిగా..
బ్రిటీషు అనుకరణతో నాయకుడంటే సూటుబూటు, డాబుదర్పం ఉండాలని అంతా నమ్ముతున్న రోజుల్లో గాంధీజీ తన జీవనశైలిని మార్చుకున్నారు. దక్షిణ భారత యాత్రలో తమిళనాట తాను చూసిన నిరుపేదల ఆహార్యం ఆయనను కదలించింది. వెంటనే పేదల్లో ఒక పేదగా కొల్లాయి కట్టుకు మారిపోయారు. తమ ఆత్మను, ఆకాంక్షలను ప్రతిబింబించే వ్యక్తినే ప్రజలు తమ నేతగా స్వీకరించి, అక్కునజేర్చుకుంటారనటానికి గాంధీ మహాత్ముడే తొలినిదర్శనం! ‘పేదల దగ్గరకు పేదల హృదయంతో వెళ్లు’ అన్న గాంధీజీ మాటలు ఆయన నాయకత్వ సారాన్ని పట్టిచూపుతాయి. అందుకే ఆయన పరిమిత ఆహారానికి మారారు. హరిజన వాడల్లోకి వెళ్లి పారిశుధ్యపనులు చేశారు. అంటరానివారుగా వందలాది సంవత్సరాలుగా వివక్షను ఎదుర్కొంటున్న కష్టజీవులను.. సాటిమనుషులుగా చూసే పరిస్థితులు తెచ్చేందుకు ఉద్యమం చేశారు. సమాజంలో నిరంతరం సంఘర్షించే వర్గాల మధ్య సంయమనంతో సయోధ్య తేవాలని ప్రయత్నించారు. అందుకే ఆయన నాయత్వంపై ప్రజల్లో విశ్వాసం బలపడింది. జనవాహిని కదిలింది.
ప్రవక్తల సరసన...
ఆగ్రహావేశాలూ, విద్వేషాగ్నులు మనిషిలోని వివేకం, వివేచనలను హరించేస్తాయి. అందుకే గాంధీజీ మనిషిలో మార్పు తేవాలని పరితపించారు. ఆ మనిషి శత్రువు కావచ్చు, మిత్రుడు కావొచ్చు. మన విధానం మాత్రం మారదు, మారకూడదు. ఆగ్రహావేశాలు ఆవశ్యకమైనవే అయినా అవి వివేచన, విజ్ఞతల అదుపాజ్ఞల్లోనే ఉండాలన్నారు. అందుకే అహింస, సత్యశోధనలకు గాంధేయ విలువల్లో అగ్రాసనం వేశారు! సంప్రదాయ, సనాతనవాదిగా కనిపించినా ఆధునిక దృక్పథం మీదే ఎక్కువ ఆధారపడ్డారు. టాల్‌స్టాయ్‌, థోరోల ఆలోచనలు ఆయనపై బలమైన ముద్రవేశాయి. వ్యక్తిగత క్రమశిక్షణకు టాల్‌స్టాయ్‌ ‘అహింస’ను ప్రతిపాదిస్తే గాంధీజీ దాన్నే మరింత విస్తరించి.. సామాజిక, రాజకీయ రంగాల్లో పెను విప్లవాలు తేవటానికి సమర్థంగా వినియోగించి.. భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా నిరూపించి చూపించి.. ప్రపంచానికి రక్తపాత రహిత, అత్యాధునిక ఆయుధాన్ని అందించారు. వ్యాపార సంస్కృతిలో పడి కొట్టుకుపోతూ వస్తువ్యామోహాన్ని పెంచుకోవటమే నాగరకత అనుకోరాదని నొక్కి చెబుతూ.. నిరాడంబరతలోనే దైవత్వం ఉంటుందని ప్రతిపాదించారు. నవీన భావాలను కూడా సంప్రదాయ సూత్రాల్లా.. సార్వజనీన విలువల్లా.. తేనె గుళికల్లా చేసి చూపటం.. ఆయనను ప్రవక్తల సరసకు తీసుకువెళ్లింది! కోరుకుంటే స్వతంత్ర భారతంలో గాంధీకి దక్కని పదవి ఉండేది కాదు. కానీ త్యాగాన్ని నమ్మిన గాంధీజీ పదవులను ఎన్నడూ ఆశించలేదు. తాను ఆచరించని సూత్రాన్ని ఆయన ఎన్నడూ ఇతరులకు చెప్పలేదు. సామరస్యమే సర్వమత సారమని నమ్మిన గాంధీజీ.. దేశవిభజన సమయంలో మతకలహాలు రేగుతుంటే తట్టుకోలేకపోయారు. మతోన్మాదమే గాడ్సే రూపంలో ఆయనకు భౌతిక రూపం లేకుండా చేసి ఉండొచ్చుగానీ.. సత్యం, శాంతి, అహింస, కరుణ, ప్రేమ అంటూ ఆయన చేసిన క్రాంత దర్శనం.. విలువల వెలుగులు.. మానవాళిని నడిపించే మహోన్నత దీపాల్లా దేదీప్యమానంగానే ఉన్నాయి! చీకటిని నిందించటం ఆపి.. ఆ దిక్కు చూడటం ఇప్పటి మన అవసరం!!!   gandhiji