ప్ర‌పంచంలో తొలి నిర్మాణ నగరం...అమ‌రావ‌తి

Header Banner

ప్ర‌పంచంలో తొలి నిర్మాణ నగరం...అమ‌రావ‌తి

  Sun Sep 30, 2018 08:53        APNRT, అమరావతి కబుర్లు, Environment, India, Telugu, World

ప్ర‌పంచంలో తొలి నిర్మాణ నగరం...అమ‌రావ‌తి

విజ‌య‌వాడ ః ప్రపంచంలోనే తొట్టతొలి ‘నిర్మాణ నగరం’(కనస్ట్రక్షన్‌ సిటీ) నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు దగ్గర నుంచి రహదారులు, భారీ జలాశయాల నిర్మాణాలకు సంబంధించిన సమస్త పరికరాలు, యంత్రాలు, ముడిసరుకులు, నిర్మాణ సామగ్రి, ఫిట్టింగ్స్‌ తదితర వస్తువులన్నీ ఒకేచోట లభ్యమయ్యే నగరమే ‘కనస్ట్రక్షన్‌ సిటీ’!. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం లేనివిధంగా ఈ నిర్మాణ నగరాన్ని రూపొందించాలని ఏపీసీఆర్డీయే లక్ష్యంగా పెట్టుకుంది.

నిర్మాణ రంగంలో ఉన్న సుప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఇందులోకి రప్పించేందుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో 150 ఎకరాల్లో నెలకొల్పే ఈ సిటీని 500 ఎకరాలకు విస్తరించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్‌- ఈవోఐ) ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈవోఐలు సమర్పించేందుకు అక్టోబరు 29 వరకూ గడువు ఇచ్చింది. అయితే 12వ తేదీనే ప్రీ-ఈవోఐ సమావేశం నిర్వహించనున్నట్లు సీఆర్డీయే వెల్లడించింది. ఈవోఐలు సమర్పించే సంస్థలు.. ‘ఎలాంటి యూనిట్లు నెలకొల్పాలని భావిస్తున్నాయి?

ఎంత భూమిని ఏ ప్రాతిపదికన కోరుతున్నాయి? ఆశిస్తున్న ప్రోత్సాహకాలు?’ తదితర అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. వీటి ఆధారంగా మలిదశలైన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ), టెండర్ల జారీ, వాటి ఖరారుపై సీఆర్డీయే దృష్టి పెట్టనుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగైదు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి కనస్ట్రక్షన్‌ సిటీ రూపురేఖలపై స్పష్టత వస్తుందని అంచనా.

బిల్డింగ్ మెటీరియ‌ల్ అందుబాటులో..
ప్రస్తుతం నిర్మాణదారులు తమకు అవసరమైన బిల్డింగ్‌ మెటీరియల్‌, పరికరాలు కావాలంటే ఒక్కోచోటికి వెళ్లాల్సి వస్తోంది. ఇటుకలు, సిమెంట్‌, ఇనుము, కలప, విద్యుత్‌, ప్లంబింగ్‌, ఫ్లోరింగ్‌, అంతర్గత ఫిట్టింగ్స్‌, అద్దాలు, రంగులు, ఎలివేషన్‌, అలంకరణ సామగ్రి వంటి వాటికోసం పలు ప్రదేశాలకు తిరగాల్సి వస్తోంది. స్థానికంగా దొరికే వాటితో పోల్చితే తక్కువ ధరకు లభిస్తాయని, ఎక్కువ వెరైటీలు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లడం పరిపాటైంది. టైల్స్‌, శానిటరీ సామగ్రి కోసం గుజరాత్‌కు, మార్బుల్‌ కోసం రాజస్థాన్‌, ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్స్‌ కోసం న్యూఢిల్లీకి, పెద్దస్థాయి బిల్డర్లయితే షాండ్లేయర్లు వంటి వాటి కోసం చైనా వెళ్లడమూ తెలిసిందే. ఇటీవల కాలంలో ఇటాలియన్‌ మార్బుల్‌ తదితర విదేశీ వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటివి కావాల్సినవారు ఇకపై నిర్మాణ రంగానికి సంబంధించి తమకు ఏం కావాల్సి వచ్చినా మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా అవన్నీ అమరావతిలోనే లభించేలా కనస్ట్రక్షన్‌ సిటీని తీర్చిదిద్దాలని సీఆర్డీయే అనుకుంటోంది.

అందుబాటులో అన్నిస్థాయిల్లోని వారికి అనువైన సంస్థలు
ఈ నిర్మాణ నగరం ద్వారా సీఆర్డీయే పలు ప్రయోజనాలు ఆశిస్తోంది. వేలకోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుతం రాజధాని అమరావతిలో పెద్దఎత్తున జరుగుతున్న వివిధ నిర్మాణాలకు అవసరమైనవన్నీ ఒకేచోట కొనుగోలుకు లేదా అద్దె ప్రాతిపదికన లభించేలా చూడటం ద్వారా గృహ నిర్మాణదారులు, డెవలపర్ల సమయం, ధనాన్ని ఆదా చేయడం అందులో ప్రధానమైనది. పైగా అన్నిస్థాయిల్లోని వారికి అనువైన సంస్థలు వస్తాయి.

ఈ సంస్థల లావాదేవీల రూపంలో రాజధానికి భారీ ఆదాయం సమకూరడంతోపాటు వాటిల్లో వేల మందికి ఉపాధి లభిస్తుంది. కొనుగోళ్ల కోసం వివిధ ప్రాంతాల నుంచి నిర్మాణ నగరానికి వచ్చే వారితో రాజధాని సందర్శకుల సంఖ్య పెరిగి ఆతిథ్య, రవాణా తదితర రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం పూర్తయ్యేలోగా ఈ నగరాన్ని మరింత విస్తృతపరిచి దేశానికే నిర్మాణరంగ కూడలిగా దీనిని నిలపాలని సీఆర్డీయే భావిస్తోంది.

కాలుష్యరహిత ప‌రిశ్ర‌మ‌ల‌కే అనుమ‌తి
కనస్ట్రక్షన్‌ సిటీలో ఏమాత్రం కాలుష్యానికి ఆస్కారం లేకుండా చూడాలన్నది సీఆర్డీయే లక్ష్యం. ఇందుకోసం ఈ నగరంలో కేవలం కాలుష్యరహిత పరిశ్రమలను మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. పూర్తిగా పర్యావరణహితంగా ఉండేలా చూడనుంది.   city