తివాచీలతో పచ్చదన సోయగం

Header Banner

తివాచీలతో పచ్చదన సోయగం

  Sat Sep 29, 2018 15:50        Real Estate, Telugu

ఎంత విలాసవంతంగా ఇల్లు నిర్మించుకున్నా పచ్చదనాలు పంచే మొక్కలు లేనిదే ఆ ఇంటికి అందం రాదు. అందుకే ఇంటి చుట్టుపక్కల మాత్రమే కాదు ఇంట్లో కూడా అందమైన మొక్కలు పెంచుతూ పచ్చదనాల తివాచీలు పరుచుకుంటున్నారు.
 
 
చల్లని గాలిని, కాలుష్యరహిత వాతావరణాన్ని పెంచే మొక్కలంటే చాలా మందికి ఇష్టం. రసాయన ఎరువులు, పురుగు మందులు వంటివి వాడకుండా ఇంటి అవసరాలకు సరిపడ కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను పెంచుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. పెరట్లో, బాల్కనీకి మాత్రమే పరిమితమయ్యే మొక్కలు ఇప్పుడు ఇంటి లోపలకు కూడా వస్తున్నాయి. విశాలమైన హాలులో, ఆకర్షణీయమైన సోఫా పక్కన ఓ మంచి మొక్క అందంగా ఉంటుందని యువతరం భావిస్తోంది. ఒకప్పుడు ఇంట్లో ప్లాస్టిక్‌తో తయారుచేసి, రంగులు వేసిన మొక్కలు, పూలు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ స్థానంలో పచ్చని మొక్కలే దర్శనమిస్తున్నాయి. హాల్‌, లివింగ్‌ రూమ్‌, బాల్కనీలలో ఈ మొక్కలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాల్లో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి పెరిగిపోయాక, పచ్చని మొక్కలను చూడడమే కరువైపోయింది. అందువల్ల గదుల్లో అందాన్ని పెంచి, ఠీవిగా నిలిచేలా ఓ మంచి మొక్కను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంట్లో మొక్కలుండడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, ఉత్సాహం పెరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని భావించడంతో పాటు పచ్చని మొక్కలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నమ్ముతున్నారు. ఇన్ని సుగుణాలనిచ్చే మొక్కల్ని మీరూ మీమీ అభిరుచులకు అనుగుణంగా ఇంట్లో ఏర్పాటుచేసుకుంటారు కదూ? ఇంటి అందాన్ని పెంపొందించే మొక్కల ఏర్పాటులో నిపుణులు ఇస్తున్న సూచనలు ఇవి.
  • ఇంటి బయటే కాదు ఇంట్లో కూడా చిన్న కుండీల్లో మొక్కలు పెంచడం వల్ల గాలి పరిశుభ్రం కావడంతో పాటు ఇంట్లో సానుకూల తరంగాలు వ్యాపిస్తాయి.
  • హాల్‌లో, టీవీ చెంతన, బెడ్‌రూం, స్టడీ టేబుల్‌ మీద, బుక్‌ షెల్ఫ్‌ల మీద చిన్న చిన్న మొక్కల్ని పెంచడం వల్ల ఇల్లు నవ్య శోభతో మెరుస్తుంది.
  • మనీ ప్లాంట్‌, ఫిగ్‌, కాక్టస్‌, అలోవేరా, పీస్‌ లిల్లీ తదితర మొక్కల్ని చిన్న పింగాణీ కుండీల్లో లేదా అందమైన గాజు కుండీల్లో పెంచితే ఇంటి అందం పెంపొందుతుంది.
  • ఇంట్లో పెంచే మొక్కల్ని తరచు మారుస్తూ వుండటం వల్ల ఇల్లు నిరంతరం కొత్తగా కనిపిస్తుంది.
  • సువాసనలు వెదజల్లే మొక్కలతో పాటు గాలిని శుభ్రం చేసే మొక్కల్ని పెంచడం వల్ల ఇల్లు నిరంతరం నిర్మలంగా వుంటుంది

    తివాచీలతో పచ్చదన సోయగం