బస్తీ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడమే లక్ష్యం

Header Banner

బస్తీ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడమే లక్ష్యం

  Sat Sep 29, 2018 15:05        Helping Hand, Telugu

  • ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌ షిప్‌ కోసం ప్రత్యేక శిక్ష
  • సమాజ సేవ వైపు దృష్టి సారిస్తున్న యువత
  • యూత్‌ఫర్‌ సేవా పేరుతో సేవా కార్యక్రమాలు
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్‌ విద్యా సంస్థల పిల్లలతో పోటీ పడేలా టెక్కీలు పాఠాలు బోధిస్తున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు కారణంగా విద్యార్థుల్లో పెరుగుతున్న నిరాశ నిస్పృహలను పారద్రోలేలా శిక్షణనిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడమే యూత్‌ ఫర్‌ సేవా లక్ష్యంగా పెట్టుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులు ఖాళీ సమయా ల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెపుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పథకం గురించి వివరిస్తున్నారు.
 
ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌ షిప్పుల కోసం..
కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పథకం కింద దారిద్ర రేఖకు దిగువ ఉన్న ఏడోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్ర తి నెల రూ.500 స్కాలర్‌షిప్‌ కింద అందచేస్తుంది. ఇలా నాలుగు సంవత్సరాల వరకు డబ్బు అందిస్తారు. ఈ పథకం అర్హత సాధించాలంటే విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ పథకం గురించి బస్తీ పిల్లలకు అవగాహన కల్పించడమే కాకుండా మూడు నెలలపాటు యూత్‌ ఫర్‌ సేవా సంస్థ ప్రతినిధులు శిక్షణ అందిస్తున్నారు. 2014లో 11 స్కూల్స్‌ల నుంచి 66 మంది విద్యార్థులు, 2015లో 21 స్కూల్స్‌ నుంచి 121, 2016లో 88 స్కూల్స్‌కు చెందిన 215, 2017లో 373 మంది అర్హత సాధించారు. ఈ విద్యార్థులకు పారితోషికం అందేలా సుమారు వంద మంది యూత్‌ ఫర్‌ సేవా ప్రతినిధుల కష్టపడ్డారు.
 
యూత్‌ఫర్‌సేవా పుట్టింది ఇలా....
వెంకటే్‌షమూర్తి అనే యువకుడు ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లారు. అక్కడ బాగానే సంపాదించి తిరిగి ముంబాయికి వచ్చి స్థిరపడ్డారు. కాని ఆయనలో తెలియని ఆవేదన. జన్మనిచ్చిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనే తపనలో నుంచి యూత్‌ ఫర్‌సేవా పుట్టింది. ఫండ్‌ రైజింగ్‌తో పాటు యువతను సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయాలనుకున్నారు. ఆ మేరకు ఫలితాలు సాధించారు. వెంకటేష్‌ మూర్తి ఆశయానికి స్ఫూర్తిగా నగరానికి చెందిన వెంకట్‌, శ్యాం, ఆదిత్య తదితరులు 2012లో హైదరాబాద్‌ చాప్టర్‌ను నెలకొల్పారు.
 
స్కూల్‌ కిట్స్‌..
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో చిరునవ్వులు చూడాలనుకున్న నిర్వాహకులు మొదట స్కూల్‌కిట్స్‌ను వారికి అందించే కార్యక్రమంతో తమ సేవలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 700 మంది వాలంటీర్లు కిట్స్‌కు అయ్యే ఖర్చును ఫండ్‌ రైజింగ్‌ ద్వారా సమకూరుస్తున్నారు. ఈ యేడాది 22 మండలాల్లో ఆరు వేల కిట్స్‌ను విద్యార్థులకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దివ్యాంగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సంస్థ ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు దాదాపు వంద మందికి ఉద్యోగాలు కల్పించింది. అంతేకాకుండా వరదలు, భూకంపాలు సంభవించినపుడు ఆయా ప్రాంతాలకు వెళ్లి సహాయం అందిస్తున్నారు.
 
 
విద్యార్థుల ముఖంలో ఆనందం చూడాలి..
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధుల ముఖంలో ఆనందం చూడాలనేదే సంస్థ ప్రధాన భావన. మూడేళ్ల క్రితం నగరంలో ఏర్పడిన యూత్‌ఫర్‌ సేవా ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఇంకా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదారబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు కూడా సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం.
- శ్యామ్‌ ప్రసాద్‌
 
వాలంటీర్లకు కొదవ లేదు
సేవ అందించేందుకు వాలంటర్‌లు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వారితో డ్పాటుతోనే కార్యక్రమాలు విస్తృ తం చేస్తున్నాం. ఫండ్స్‌ను చాలా మంది స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ఆర్ధికంగా సహాయం చేయలేని వారు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పేందుకు తమ పనులు మానుకొని వస్తున్నారు. స్కూల్‌కిట్స్‌ను వచ్చే యేడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం.

    బస్తీ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా టెక్కీస్‌ టీచింగ్‌