ఆసియాకప్‌ విజేతకు అభినందనలు

Header Banner

ఆసియాకప్‌ విజేతకు అభినందనలు

  Sat Sep 29, 2018 14:15        Sports, Telugu

నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఏడోసారి ఆసియాకప్‌ను ముద్దాడింది భారత్‌. చివరి బంతి వరకూ అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించింది. టోర్నీ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు.. ఫైనల్‌లో కాస్త తడబడినా చివరకు ఆ ఒత్తిడిని జయించి కప్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియాను పలువురు ప్రముఖులు అభినందించారు. అటు ఫైనల్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చిన బంగ్లాదేశ్‌ జట్టుపై ప్రశంసలు కురిపించారు.

* ఆసియా కప్‌ విజేత టీమిండియాకు అభినందనలు. బంగ్లాదేశ్‌కు విజయం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. కానీ కీలక ఆటగాళ్లు లేకపోయినా బంగ్లా జట్టు ఎంతో ధైర్యంగా ఆడింది - మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌

* ఆసియాకప్‌ ఛాంపియన్స్‌కు అభినందనలు. కీలక సమయంలో ఉత్తమ ప్రదర్శన చేసిన కేదార్‌ జాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. బంగ్లా కూడా చాలా బాగా ఆడింది. షకీబ్‌, తమీమ్‌ లాంటి ఆటగాళ్లు లేకపోయినా ఎక్కడా నమ్మకాన్ని కోల్పోకుండా విజయం కోసం పోరాడింది- మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

* కంగ్రాట్స్‌ టీమిండియా. టోర్నీ మొత్తంలో బౌలర్లు ఎంతో మాయ చేశారు. ఈ గెలుపునకు ప్రధాన కారణం వారే. ఫైనల్‌ మ్యాచ్‌ను ఎంతో ఉత్కంఠభరితంగా మార్చిన బంగ్లాదేశ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. వెల్‌డన్‌ - మాజీ క్రికెటర్ మహ్మద్‌ కైఫ్‌

* ఆసియా కప్‌ విజేత టీమిండియాకు అభినందనలు. కానీ బంగ్లాదేశ్‌ను తప్పకుండా అభినందించాలి. గొప్పగా పోరాడారు. నేడు క్రికెట్‌ గెలిచింది - పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అఖ్తర్‌

* ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న టీమిండియాకు అభినందనలు - మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌


   ఆసియాకప్‌ విజేతకు అభినందనలు