‘హాల్‌’ అత్యధిక టర్నోవర్‌

Header Banner

‘హాల్‌’ అత్యధిక టర్నోవర్‌

  Sat Sep 29, 2018 14:13        Technology, Telugu

 రాఫెల్ ఒప్పందం వివాదంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్) పేరు తెరమీదకు వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హాల్‌’ను పక్కనబెట్టి, అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌కు ప్రభుత్వం కావాలనే కాంట్రాక్టును అప్పగించిందని గత కొంతకాలంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ ఒప్పందంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. మరోవైపు ‘హాల్‌’కు సామర్థ్యం లేకపోవడం వల్లే కాంట్రాక్టును ఇవ్వలేదని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. దీంతో కంపెనీ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిన వేళ.. ‘హాల్‌’ రికార్డు స్థాయిలో అత్యధిక టర్నోవర్‌ సాధించడం విశేషం.

2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ ‘హాల్‌’ రూ. 18,200కోట్ల టర్నోవర్‌ సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ. 17,600కోట్ల టర్నోవర్‌ నమోదుచేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ‘హాల్‌’ ఈ గణాంకాలను విడుదల చేయగా.. శుక్రవారం జరిగిన కంపెనీ వాటాదారుల 55వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వీటిని మరోసారి వెల్లడించింది. రాఫెల్‌ వివాదం నేపథ్యంలో ఈ గణాంకాలు తాజాగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 40 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లను తయారుచేసిందని హాల్‌ తెలిపింది. వీటిలో సు-30 ఎంకేఐ, ఎల్‌సీఏ తేజస్‌, డార్నియల్‌ లాంటివి కూడా ఉన్నాయి. ఇక 105 కొత్త ఇంజిన్లు, స్పేస్‌ ప్రొగ్రామ్‌ కోసం 550 ఇంజినట్లు, 146 కొత్త ఏరో స్ట్రక్చర్లను తయారుచేసినట్లు పేర్కొంది.

రాఫెల్‌ వివాదంపై ఇటీవల రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. యూపీఏ హయాంలో రాఫెల్‌ ఒప్పందం జరగకపోవడానికి ‘హాల్‌’కు సామర్థ్యం లేకపోవడం కూడా ఒక కారణమేనని అన్నారు. మరోవైపు రాఫెల్‌ ఒప్పందం కోసం రిలయన్స్‌ డిఫెన్స్‌ పేరును మోదీ సర్కారే ప్రతిపాదించిందని ఇటీవల ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి దారితీసింది.


   హల్ అత్యధిక టర్నోవర్‌