సాంకేతిక స్వాప్నికుడు.. సుందర్‌పిచాయ్‌

Header Banner

సాంకేతిక స్వాప్నికుడు.. సుందర్‌పిచాయ్‌

  Fri Sep 28, 2018 15:26        Profession, Telugu

 సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తూ అంతర్జాలాన్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తోంది ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఈ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌ అనే ఓ భారతీయుడు ఎంపిక కావడం భారతీయుల్లో ఆనందాన్ని నింపింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా రికార్డు సృష్టించిన ఆయన ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ డిగ్రీ పట్టాపొందారు. అనంతరం ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్‌ చేశారు. 2004లో గూగుల్‌లో చేరిన ఆయన ఆ సంస్థ సీఈవోగా నియమితులయ్యారు. ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచే ఆయన ప్రస్థానంలో విశేషాలెన్నో...

సుందర్‌రాజన్‌ నుంచి.. సుందర్‌ పిచాయ్‌ దాకా 
చెన్నైకి చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1972లో సుందర్‌ జన్మించారు. సుందర్‌ తండ్రి రఘనాథ పిచాయ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌, తల్లి స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో చాలా కాలం పాటు ఇంట్లో టీవీ గానీ కారు గానీ ఉండేది కాదు. ఎటైనా వెళ్లాలంటే స్కూటర్‌పై వెళ్లేవారు. వనవాణి మెట్రిక్యులేషన్‌ స్కూల్లో పదోతరగతి దాకా చదివారు. చైన్నైలోని జవహర్‌ విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ అభ్యసించారు. అనంతరం ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ చేశారు. 1993లో అమెరికా వెళ్లిన సుందర్‌ స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేశారు. వార్టన్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ కూడా చేశారు. 2004లో గూగుల్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా చేరారు. గూగుల్‌లో క్రోమ్‌ బౌజర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. ఇక సెర్చింజన్‌లో టూల్‌బార్‌ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. గూగుల్‌లో చేరడానికి ముందు మెకిన్సే, అప్లైడ్‌ మెటీరియల్స్‌ వంటి సంస్థల్లో పనిచేశారు. గూగుల్‌ చేస్తుండగా మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో అవకాశం వచ్చినప్పటికీ వెళ్లలేదు. వాస్తవానికి సుందర్‌ అసలు పేరు పి సుందర్‌రాజన్‌ కాగా అమెరికాకు వెళ్లిన తర్వాత పేరును కుదించి సుందర్‌ పిచాయ్‌గా మార్చుకున్నారు.ప్రస్తుతం గూగుల్‌లో సుందర్‌ ఏడాదికి రూ.310 కోట్ల జీతభత్యాలు పొందుతున్నారు.

కొంచెం సిగ్గరి.. 
స్వతహగా సుందర్‌ సిగ్గరి. గూగుల్‌లో సహ ఉద్యోగులు ఆయన్ను అందరికీ ఆత్మీయుడిగా అభివర్ణిస్తారు. చురుకైన విద్యార్థి అయినప్పటికీ అనవర పాండిత్య ప్రదర్శన చేసేవాడు కాదని ఆయన ఐఐటీ గురువులు చెబుతారు.

క్రికెటర్‌ కావాలనుకుని.. 
క్రికెట్‌ అంటే ప్రాణం పెట్టే సగటు భారతీయ యువకుల్లాగానే సుందర్‌కి కూడా ఒకప్పుడు క్రికెట్‌ అంటే పిచ్చి. తాను కూడా క్రికెటర్‌ కావాలనుకున్నా అని.. సచిన్‌ గవాస్కర్‌లను ఇష్టపడేవాడినని ఓ సందర్భంలో చెప్పారు. ‘ నా దృష్టిలో టెస్టు క్రికెట్‌ అత్యుత్తమం. 1986లో చైన్నైలో ఒక టెస్ట్‌మ్యాచ్‌ చూశాను. సమయం దొరికితే టెస్ట్‌లతో పాటు వన్డేలు కూడా చూస్తాను. కానీ టీ20లు ఎందుకో అంతగా నచ్చవు’ అని చెప్పారు. ఇక ఫుట్‌బాల్‌లో తాను బార్సిలోనా జట్టుకు అభిమానినని చెప్తుంటాడు. లియొనెల్‌ మెస్సీ ఆట చూసేందుకు ఇష్టపడతానని ఆ సందర్భంలో చెప్పారు.

సుందర్‌ భార్య పేరు అంజలి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. పాఠశాల రోజుల నుంచి సుందర్‌, అంజలికి పరిచయం ఉండేది. అది కొన్నాళ్లకు ప్రేమ వివాహానికి దారి తీసింది.


   సాంకేతిక స్వాప్నికుడు