బాల్ ట్యాంపరింగ్‌లోకి సచిన్‌ని లాగిన వార్న్

Header Banner

బాల్ ట్యాంపరింగ్‌లోకి సచిన్‌ని లాగిన వార్న్

  Wed Mar 28, 2018 22:14        India, Telugu

బాల్ ట్యాంపరింగ్‌ వివాదంపై దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఎట్టకేలకు స్పందించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఒక ఏడాది నిషేధం వాళ్లు చేసిన నేరానికి సరైన శిక్ష కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ దేశ ఆటగాళ్ల నిషేధంపై ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పందించారు. ‘‘ఒక ఆస్ట్రేలియన్‌గా, క్రికెట్ ప్రేమికుడిగా కేప్‌టౌన్‌లో జరిగిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటువంటి ఘటన గతంలో ఎన్నడూ జరుగలేదు. ఈ విషయంలో మేం తీవ్రంగా బాధపడ్డాము. ఈ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ఐదేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్‌ టీం చేస్తున్న పనుల్ని ప్రతీ ఒక్కరు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన తప్పుకి ఇది సరైన శిక్ష కాదు. వాళ్లు చేసిన పని క్షమించరానిది. దానికి వాళ్లు కఠిన శిక్షలు అనుభవించాలి. కానీ ఒక సంవత్సరం నిషేధం దీనికి సమాధానం కాదు. నేనైతే.. వాళ్లని నాలుగో టెస్ట్‌లో నిషేధించి, భారీ జరిమానా విధించి, ఇద్దరిని కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించేవాడిని. కానీ ఆ తర్వాత ఆడేందుకు అనుమతించే వాడిని’’ అని పేర్కొన్నారు.

 

ఇక వివాదంలో వార్న్ పలువురు క్రికెటర్లను లాగారు. ‘‘బాల్ ట్యాంపరింగ్ విషయంలో ఆటగాళ్లు ఎందుకు సిగ్గుపడుతున్నారు? బాల్ ట్యాంపరింగ్‌తో చీటింగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ డు ప్లెసిస్ రెండుసార్లు, జట్టు బౌలర్ ఫిలాందర్ ఒకసారి దొరికారు. బాల్ ట్యాంపరింగ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, మైక్ అథెట్రాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఉన్నారు. నా దృష్టిలో స్మిత్ మంచి ఆటగాడు మాత్రమే కాదు... మంచి మనిషి కూడా. కానీ అతని చాలా తెలివితక్కువ పని చేశాడు. వాళ్లకి విధించిన శిక్ష చాలా దారుణం. కానీ ఆ తప్పుకి ఈ శిక్ష సరితూగడం లేదు’’ అని పేర్కొన్నారు.

 


   బాల్ ట్యాంపరింగ్‌లోకి సచిన్‌ని లాగిన వార్న్