ఆమరణదీక్ష తర్వాత పరిస్థితులు నా చేతుల్లో ఉండవు: పవన్

Header Banner

ఆమరణదీక్ష తర్వాత పరిస్థితులు నా చేతుల్లో ఉండవు: పవన్

  Wed Mar 14, 2018 22:12        అమరావతి కబుర్లు, India, Telugu

 

 

ప్రత్యేక హోదా సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆమరణదీక్ష తర్వాత పరిస్థితులు తన చేతుల్లో ఉండవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చిరించారు.

 

‘‘కాకినాడ సభ తర్వాత అందరూ అడిగారు. తర్వాత ఏం చేస్తావని. హోదా కోసం అవసరమైతే ఆమరణదీక్షకు కూర్చుంటా. ఆంధ్రుల ఆత్మగౌరవ ఎలా ఉంటుందో కేంద్రానికి చూపిద్దాం. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి మాలో సజీవంగా ఉంది. రోడ్లపై పోరాటాలు చేస్తాం. హోదాపై కేంద్రం ఏదో ఒక సమాధానం చెప్పి తీరాలి. పార్లమెంట్‌లో డ్రామాలు ఆడి చేతులు దులుపుకుంటే ఊరుకోం. మేం చెవిలో పూలు పెట్టుకొని కూర్చోలేదు. ఇది ఒక ప్రత్యేక హోదా సమస్య మాత్రమే కాదు.. పార్లమెంట్‌ సాక్షిగా చేసిన వాగ్దానాలను విస్మరించకుండా నిలువరించే పోరాటం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఉగాది పండగను అమరావతిలో జరుపుకుంటానని, ఈ నెల 18 వరకు అమరావతిలోనే ఉంటానని పవన్ చెప్పారు. పాతికేళ్లు ప్రజాసేవకు అంకితమవుతానని, పారిపోనని స్పష్టం చేశారు. ఏపీలో కొత్త యువనాయకత్వం కావాలని, సరికొత్త యువనాయకత్వాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే లక్ష్యమని ప్రకటించారు. కలిసొచ్చే పార్టీలతో కలిసిపనిచేస్తామని, ప్రత్యేక హోదాపై సీపీఎం, సీపీఐ నేతలతో చర్చించబోతున్నామని పవన్ చెప్పారు.

 


   ఆమరణదీక్ష తర్వాత పరిస్థితులు నా చేతుల్లో ఉండవు: పవన్