మంచి చెప్పిన తల్లి.. దారుణంగా చంపేసిన కూతురు

Header Banner

మంచి చెప్పిన తల్లి.. దారుణంగా చంపేసిన కూతురు

  Mon Mar 12, 2018 22:33        India, Telugu

మహిళా టీచర్‌తో కలిసి జీవించేందుకు అంగీకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో కన్న తల్లినే అత్యంత దారుణంగా చంపేసిందో కుమార్తె. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ నెల 9న జరిగిందీ ఘటన. కుమార్తె చేతిలో దారుణంగా గాయపడిన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కవి నగర్ పోలీసులు యువతి కోసం గాలిస్తున్నారు. యువతి తండ్రి కథనం ప్రకారం.. తల్లిపై కర్ర, ఇనుప రాడ్డుతో దాడిచేసిన యువతి అక్కడి నుంచి పరారైంది. స్కూలు నుంచి వచ్చిన ఆమె చిన్న కుమార్తె రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

 

ఉపాధ్యాయురాలితో తన కుమార్తెకు మూడు నెలలుగా సంబంధం ఉందని, ఇద్దరూ కలిసి పారిపోవాలనుకున్నారని యువతి తండ్రి తెలిపారు. దీనిని తాము వ్యతిరేకించడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కూడా టీచర్‌తో కలిసి ఓసారి వెళ్లిపోయిందని చెప్పారు. కేసు పెట్టడంతో పోలీసులు తిరిగి తమ కుమార్తెను తీసుకొచ్చి అప్పజెప్పారని పేర్కొన్నారు. భర్తతో విడిపోయి టీచర్ ఒంటరిగా ఉంటోందని వివరించారు. తన భార్యపై దాడి చేసిన అనంతరం పారిపోయిన కుమార్తె తప్పకుండా టీచర్ దగ్గరికే వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. బాధిత భర్త ఫిర్యాదుతో అతని కుమార్తెతోపాటు టీచర్‌పైనా కేసు నమోదు చేసిన పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.

 


   మంచి చెప్పిన తల్లి.. దారుణంగా చంపేసిన కూతురు