బీజేపీలో చేరిన గంటకే షాకిచ్చారు..!

Header Banner

బీజేపీలో చేరిన గంటకే షాకిచ్చారు..!

  Mon Mar 12, 2018 22:24        India, Telugu

ఎంత సీనియర్ నేత అయినా నోరు దగ్గర పెట్టుకోకపోతే చివాట్లు తప్పవు. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతగా పేరున్న నరేష్ అగర్వాల్ ఆ పార్టీకి సోమవారం ఉద్వాసన చెప్పి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే చేరిన గంటలోనే ఆయనకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సుష్మా స్వరాజ్‌ తలంటేశారు.

 

సమాజ్‌వాదీ పార్టీలో సీనియర్ నేత అయినప్పటికీ తనను కాదని నాలుగోసారి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా జయాబచ్చన్‌కు పార్టీ టిక్కెట్ ఇవ్వడం నరేష్ అగర్వాల్‌ జీర్ణించుకోలేకున్నారు. ఇంకా అక్కడ ఉండటం కన్నా బీజేపీలో చేరడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. జయాబచ్చన్ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే ఆయన బీజేపీలో చేరిపోయారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్ విధానాలు నచ్చే పార్టీలో చేరానంటూ వారిని పొగిడేశారు. అంతవరకూ బాగానే ఉన్నా తన రాజీనామా వెనుక అసలు కారణాన్ని కూడా బయట పెట్టేశారు. తనకు టిక్కెట్లు నిరాకరించి సినిమాల్లో డాన్సులు చేసే వాళ్లకు టిక్కెట్ ఇవ్వడం సిగ్గుచేటంటూ

పరోక్షంగా జయాబచ్చన్‌పై అక్కసు వెళ్లగక్కారు. డాన్సర్ కారణంగా తాను టిక్కెట్ కోల్పోయానన్నారు.

 

మహిళ అని కూడా చూడకుండా జయాబచ్చన్‌ను డాన్సర్‌‌తో నరేష్ అగర్వాల్ పోల్చడం బీజేపీని ఉలిక్కి పడేలా చేసింది. పార్టీలకు అతీతంగా అజాతశత్రువుగా పేరున్న సుష్మాస్వరాజ్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నరేంద్ర అగర్వాల్ పార్టీలోకి చేరడాన్ని స్వాగతిస్తున్నామని అంటూనే....జయాబచ్చన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎండగట్టారు. ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరైనవి కావని, ఆమోదయోగ్యం కానేరవని ఓ ట్వీట్‌లో తలంటేశారు.

 


   బీజేపీలో చేరిన గంటకే షాకిచ్చారు..!