ఏపీకి రైల్వేజోన్‌పై తాజా అప్డేట్.. తేల్చిచెప్పేసిన కేంద్రం

Header Banner

ఏపీకి రైల్వేజోన్‌పై తాజా అప్డేట్.. తేల్చిచెప్పేసిన కేంద్రం

  Mon Mar 12, 2018 22:06        అమరావతి కబుర్లు, India, Telugu

 


ఏపీకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి రైల్వేజోన్ వస్తుందని గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రజలు వేయికళ్లతో వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నేతలు సైతం జోన్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రం ఎట్టకేలకు రైల్వే జోన్‌‌పై కేంద్రం తేల్చేసింది. ఏపీకి రైల్వే జోన్‌ లేనట్టేనని కేంద్రం తేల్చిసింది. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం రైల్వేజోన్‌ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ దినేష్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.

 

కాగా సోమావారం 13వ షెడ్యూల్‌పై ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చ జరిగింది.  ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రజలు, పార్టీలు మండిపడుతున్నాయి. హోదా ఇవ్వకపోయినా ఇవ్వాల్సినవన్నీ అటు బీజేపీ నేతలు కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

 

పుండు మీద కారం చల్లారు..!

ఏపీకి రైల్వేజోన్ ఇచ్చేయడం గ్యారెంటీ అని ఒడిశాతో చర్చలు జరిపాక పరిధిని కుదించి విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటిస్తామని కొద్దిరోజుల క్రితమే కేంద్ర పెద్దలు స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగింది. ఇటు ఏపీలో... అటు కేంద్రంలో ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఈ సమయంలోనే రైల్వేజోన్ ఇవ్వటం సాధ్యంకాదని పుండు మీద కారం చల్లింది.

 

చర్చ సాగిందిలా..

13వ షెడ్యూల్‌లో ఉన్నటువంటి ఎడ్యకేషన్‌కు సంబంధించి ఐదు అంశాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన 12 అంశాలు.. మొత్తం 17 అంశాలపై సుధీర్ఘమైన చర్చ జరిగింది. ఇందులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 8వ అంశంగా ఉన్నటువంటి రైల్వే జోన్ ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏపీకి రైల్వేజోన్ ఇచ్చేది లేదని ఏపీ సీఎస్‌‌కు.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి తేల్చిచెప్పేసింది. అయితే ఈ తరుణంలో అధికారులతో ఏపీ సీఎస్‌‌ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. నిన్న మొన్నటి వరకు విశాఖ కేంద్రంగా గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో కొత్త జోన్ ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రైల్వేజోన్‌పై కేంద్రం చేతులెత్తేసింది.

 


   ఏపీకి రైల్వేజోన్‌పై తాజా అప్డేట్.. తేల్చిచెప్పేసిన కేంద్రం