ఇప్పటి జట్టులో ధోనీనే కీలక ఆటగాడు: మాజీ కీపర్

Header Banner

ఇప్పటి జట్టులో ధోనీనే కీలక ఆటగాడు: మాజీ కీపర్

  Mon Feb 19, 2018 22:25        India, Sports, Telugu

టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కీపర్ ఎంఎస్ ధోనీ క్రికెట్ కెరీర్‌పై గత కొన్ని రోజులుగా భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కొందరు మాజీ క్రికెటర్లు ధోనీ జట్టు నుంచి తప్పుకొని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ధోనీ జట్టులో కొనసాగితేనే జట్టుకు బలం అని వాదిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రస్తుత కెప్టెన్ విరాట్, కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీకి మద్దతుగా నిలిచారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో ధోనీ బ్యాటింగ్ పరంగా అంతగా రాణించకపోయినా.. గ్రౌండ్‌లో తన సహచర ఆటగాళ్లకు మంచి సలహాలు ఇస్తూ.. విజయాల్లో తన వంతు కృషి చేస్తున్నాడు. మరోవైపు కీపింగ్‌లో మాత్రం తనకు తానే సాటి అని నిరూపింస్తూ.. రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా టీం ఇండియా మాజీ కీపర్ కిరణ్ మోరే.. ధోనికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత జట్టులో ధోనీనే కీలక ఆటగాడు అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘జట్టులో ధోనీ కీలక ఆటగాడు. అందులో సందేహమేమి లేదు. ముఖ్యంగా ఇద్దరు యువ స్పిన్నర్లు అతని సలహాలతో ఎక్కువ లాభపడుతున్నారు. ఎక్కడ, ఎలా బౌలింగ్ చేయాలో అతను వాళ్లకి సూచిస్తున్నాడు. అందుకే వికెట్ల వెనుక అతను ఉండటం జట్టుకు ఎంతో ముఖ్యం’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోరే పేర్కొన్నారు.

 

అంతేకాక ధోనీ జట్టులో ఉండటం వల్ల కెప్టెన్ కోహ్లీకి ఎంతో మేలు జరుగుతుంది అని ఆయన తెలిపారు. ‘‘అతను(ధోనీ) ఎంతోకాలం కెప్టెన్సీ చేశాడు. ఇప్పుడు అతని అనుభవం కోహ్లీకి ఎంతో ఉపయోగపడుతుంది. బౌలర్లు, ఫీల్డింగ్ విషయంలో ధోనీ కోహ్లీకి ఎంతో సహాపడుతున్నాడు. దాంతో అతను(కోహ్లీ) ప్రశాంతంగా బ్యాటింగ్‌పై దృష్టి పెడుతున్నాడు’’ అని ఆయన తెలిపారు.

 


   ఇప్పటి జట్టులో ధోనీనే కీలక ఆటగాడు: మాజీ కీపర్