అగ్గెపెట్టె కోసం ఆర్మీ మాజీ అధికారిని బుగ్గి చేశారు!

Header Banner

అగ్గెపెట్టె కోసం ఆర్మీ మాజీ అధికారిని బుగ్గి చేశారు!

  Tue Feb 13, 2018 21:56        India, Telugu

అగ్గెపెట్టె కోసం జరిగిన గొడవలో ఓ కాల్ సెంటర్ ఉద్యోగి.. ఆర్మీ మాజీ అధికారిని దారుణంగా చంపేశాడు. ఫిబ్రవరి 1న పుణె క్యాంప్ ఏరియాలో ఈ ఘటన జరగ్గా తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) ప్రదీప్ దేశ్‌పాండే కథనం ప్రకారం.. ఆర్మీ మాజీ అధికారి రవీంద్రకుమార్ బాలి రోడ్డుపక్కన ఉండే పేవ్‌మెంట్‌పై చిన్న టెంట్ వేసుకుని నివసిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఓ కాల్ సెంటర్‌లో టెలీకాలర్‌గా పనిచేస్తున్న ముంబైలోని పన్వేల్‌కు చెందిన రాబిన్సన్ అలియాస్ రాబిన్ ఆంథోనీ లాజరస్ (20) ఆ దారిగుండా వెళ్తూ సిగరెట్ కాల్చుకునేందుకు బాలీని అగ్గెపెట్టె అడిగాడు. అయితే అతడు తన వస్తువులను దొంగిలించేందుకు వచ్చాడని అనుమానించిన బాలి అగ్గెపెట్టె ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా పెద్దగా అరిచాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్తా ముదరడంతో నియంత్రణ కోల్పోయిన లాజరస్ పేవ్‌మెంట్‌పై ఉన్న సిమెంట్ ఇటుక (పేవర్ బ్లాక్)ను తీసుకుని బాలి తలపై గట్టిగా మోది చంపేశాడు.

 

లాజరస్ కోసం గాలించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఘటన సమయంలో తనతో పాటు స్నేహితుడు కూడా ఉన్నాడని చెప్పాడు. నిందితుడు లాజరస్‌పై గతంలోనూ పెట్రోలు, సెల్‌ఫోన్ దొంగతనం కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

 

హత్యకు గురైన బాలి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 17 ఏళ్లపాటు ఆర్మీలో కెప్టెన్‌గా సేవలందించారు. ఇంగ్లిష్ చక్కగా మాట్లాడే బాలి ఆ ప్రాంతవాసులకు సుపరిచితుడు. ఒంటరివాడు కావడంతో రోడ్డు పక్కన పేవ్‌మెంట్‌పై టెంట్ వేసుకుని నివసిస్తున్నాడు.

 


   అగ్గెపెట్టె కోసం ఆర్మీ మాజీ అధికారిని బుగ్గి చేశారు!