నేషనల్ హైవేనే ఆక్రమించేశారు.. ఆక్రమించిన పెద్దలను వదిలేశారు!

Header Banner

నేషనల్ హైవేనే ఆక్రమించేశారు.. ఆక్రమించిన పెద్దలను వదిలేశారు!

  Mon Feb 12, 2018 23:09        India, Telugu

సబ్‌ రిజిస్ట్రార్ మనోడైతే చార్మినార్ కూడా రిజిస్ట్రర్ అవుతుందని ల్యాండ్ మాఫియా డాన్లు చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటి ఓ భూకుంభకోణం బట్టబయలైంది. ఏకంగా నేషనల్ హైవేనే తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కొందరు అక్రమార్కులు. మొత్తం 26 ఎకరాలను అమ్మేసుకున్నారు. తమది కాని భూమిని ఓ ముఠా బోగస్ పత్రాలతో దర్జాగా సేల్‌ డీడ్ చేయించుకుంది. షాద్‌నగర్ సబ్‌ రిజిస్ట్రార్ పరిధిలోని కొత్తూరులో జరిగిన భూకబ్జాపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

 

ఓ యువనేత కొత్తూరులోని కొన్ని భూములపై కన్నేశాడు. చాకచక్యంగా పావులు కదిపాడు. చనిపోయిన వారిని బతికున్నట్లు చూపించి తిమ్మిని బమ్మిని చేస్తూ భూకుంభకోణానికి తెరతీశాడు. ఆ యువనేత వెనక ఓ మంత్రి ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జరిగిన అక్రమాలన్నీ వెలికితీసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అది పక్కా ప్రైవేట్ ల్యాండ్. కొత్తూరు గ్రామంలోని ఈ భూమిని 1987లో ఏపీఎస్ఎఫ్‌సీ నుంచి వేలంలో కొన్న కొందరు వ్యక్తులు అక్కడ ఓ పరిశ్రమను స్థాపించారు. 2000 సంవత్సరం వరకు ఏపీ‌ఎస్‌ఎఫ్‌సీకి బాకాయిలు చెల్లించి తమ సంస్థ పేరిట రిజిస్ట్రార్ సేల్‌ డీడ్ చేయించుకున్నారు. తరువాత కొత్తూరు గ్రామం పెరిగడం.. ఈ కంపెనీ వల్ల కాలుష్యం వస్తుందంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫ్యాక్టరీని మూసివేశారు. తరువాత ఈ స్థలాన్ని లే అవుట్‌గా మార్చేందుకు స్థల యజమానులు హెచ్‌ఎండీఏకి దరఖాస్తు చేశారు. అక్కడే వీరికి షాకింగ్ న్యూస్ తెలిసింది.

 

మీరు దరఖాస్తులో పేర్కొన్న స్థలం వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యిందని, మీరు లే అవుట్ ఎలా వేస్తారంటూ హెచ్ఎండీఏ అధికారులు వారిని ప్రశ్నించారు. దీంతో అవాక్కైన భూ యజమానులు ఆధారాలు చూపించాలన్నారు. హెచ్‌ఎండీఏ అధికారులు తమదగ్గర రిజిస్ట్రర్ అయిన ఓ సేల్‌ డీడ్‌ను చూపించారు. ఆ సేల్‌ డీడ్ చూసిన కంపెనీ ప్రతినిధులకు మూర్చపోయినంత పనైంది. మొత్తం 26 ఎకరాల స్థలం కోసం చేసిన ఆ సేల్‌ డీడ్‌లో తమ ఆధీనంలో ఉన్న రెండెకరాల స్థలం కూడా ఉంది. అత్తాపూర్‌కు చెందిన కొలను జైపాల్ రెడ్డి, ఎం. ఆనంద కుమార్ ఆ స్థలాన్ని కొన్నట్లు పత్రాలు సృష్టించారు. ఈ భూమిని కొత్తూరు గ్రామానికి చెందిన బండి చెన్నయ్య, అతని కుమారులు కృష్ణ, శ్రీనివాస్, వెంకటయ్య అమ్మినట్లు సేల్ డీడ్‌లో ఉంది.

 

ఆ నకిలీ సేల్‌ డీడ్‌లో ఉన్న వివరాల ఆధారంగా బండారి సోదరులకు చెందిన 20 ఎకరాలు, రాజేంద్రప్రసాద్‌కు చెందిన రెండు ఎకరాలు, మరో వ్యక్తికి చెందిన రెండు ఎకరాలు కూడా అమ్మేశారు. అయితే ఇందులో మరో షాకయ్యే అంశం ఏంటంటే.. ఈ దస్తావేజులో అమ్మిన నాలుగు ఎకరాలు నేషనల్ హైవేకు సంబంధించిన స్థలం. మొత్తం 26 ఎకరాలను షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ 2016లో డాక్యూమెంట్ నెంబర్ 2245 ప్రకారం.. రిజిస్ట్రేషన్ చేశారు.

 

ఈ సేల్‌ డీడ్‌లోని మరో రెండెకరాలు రాజేంద్రప్రసాద్‌కు సంబంధించింది. చాలా ఏళ్లుగా ఆ స్థలం ఆయన ఆధీనంలోనే ఉంది. కానీ జేఎన్ బయోటెక్ ప్రతినిధులు ఆరా తీయడంతో ఈయన స్థలం కూడా బండి చెన్నయ్య అమ్ముకున్నట్లు తేలింది. శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్‌తో పాటు మిగతా బాధితులంతా కలిసి తమకు తెలియకుండా, తమ స్థలాలను ఎలా అమ్ముతారని షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పరుగులు తీశారు. వేరెవరో అమ్మితే తమ స్థలాలకు సేల్‌ డీడ్ ఎలా చేశారని ప్రశ్నించారు. అంతేకాదు.. అందరూ కలిసి కొత్తూరు పోలీసులకు గతేడాది డిసెంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాల బాగోతాన్ని వెలికి తీయాలని మొరపెట్టుకున్నారు.

 

వెంటనే రంగంలోకి దిగిన కొత్తూరు పోలీసులు రిజిష్టర్డ్ సేల్ డీడ్ 2245 అంతు తేల్చడం కోసం అందులో జత చేసిన డాక్యుమెంట్లు ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవడం కోసం కొత్తూరు తహసీల్దారుకు, షాద్‌నగర్ ఆర్డీవోకు, మహబూబ్ నగర్ ఆర్డీవోకు లేఖలు రాశారు. రెవెన్యూ అధికారుల నుంచి కీలకమైన జవాబు వచ్చింది. పట్టాదారు పాసుపుస్తకం, ఆర్డీవో ప్రొసీడింగ్స్ అన్నీ ఫోర్జరీవని రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా పోలీసులకు తెలియజేశారు. ప్రొసీడింగ్స్ ఫైల్‌లో వాడిన నంబర్ 1124 నిజమైనప్పటికీ కులం సర్టిఫికెట్ కోసం ఓ విద్యార్థిని పెట్టిన దరఖాస్తు ఆధారంగా ఆమెకు మంజూరు చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఫైల్ నంబర్‌ అని, ఫైల్ నంబర్లు వాస్తవం అయినా.. అందులోని సబ్జెక్ట్ మాత్రం అబద్ధమని రెవెన్యూ అధికారులు తేల్చేశారు.

 

ఈ క్రమంలో భూమిని అమ్మిన బండి చెన్నయ్య గురించి విచారించిన పోలీసులకు మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. కొత్తూరు గ్రామానికి చెందిన బంటి చెన్నయ్య భూమిని తనదంటూ బండి చెన్నయ్య బోగస్ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. బంటి చెన్నయ్య నాలుగు దశాబ్ధాల క్రితమే మరణించాడు. ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. కానీ ప్రస్తుతం తెరమీదికి వచ్చిన బండి చెన్నయ్య బీసీ కులస్తుడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. దీన్ని గుర్తించిన పోలీసులు చెన్నయ్య అండ్ సన్స్‌ను పిలిచి ప్రశ్నించే సరికి యువనేత పేరు వెలుగులోకి వచ్చింది.

 

కొత్తూరు గ్రామానికి చెందిన యువనేత క్రాంతిరెడ్డి మొత్తం ఈ కథకి సూత్రధారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పాట్టాదారు పాసుపుస్తకాలు, ప్రొసీడింగ్స్, ఇతరత్రా డాక్యుమెంట్లను ఫోర్జరీతో క్రాంతిరెడ్డి తయారు చేయించి.. తెర వెనక కథ నడిపాడని చెన్నయ్య అండ్ సన్స్ పోలీసులకు చెప్పేశారు. ఇక్కడ ఎకరం భూమి విలువ కోటి రూపాయల పైనే ఉంది. ఒక స్థలాన్ని వివాదంలోకి లాగడం వల్ల వీలైతే కబ్జా చేయడం.. లేదంటే స్థల యజమానులకు సేల్ డీడ్ చూపించి బెదిరించి సెటిల్ చేసుకునే లక్ష్యంగా కథ నడిపినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. దీంతో క్రాంతిరెడ్డితో పాటు చెన్నయ్య, అతని కుమారున్ని కొత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇంత పెద్ద భూకుంభకోణాన్ని వెలికి తీసిన పోలీసులు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా, మీడియాకి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా క్రాంతిరెడ్డి సొంత వాహనంలోనే కోర్టుకు తరలించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

 

స్కెచ్ వేసిన వ్యక్తి అరెస్టయ్యాడు సరే. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొలను జైపాల్ రెడ్డి. ఆనంద కుమార్ వీరికి సహకరించిన షాద్‌నగర్ మాజీ సబ్‌ రిజిష్ట్రార్ సులోచన దేవి అరెస్టుల విషయంలో మాత్రం పోలీసులు స్లో అయిపోయారు. ఎందుకంటే క్రాంతిరెడ్డి అరెస్టుతో ఓ మంత్రి అనుయాయులు రంగంలోకి దిగి కేసును పాతరేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారని బాధితులు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిష్ట్రార్ సులోచనదేవి పై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఆమెను గతంలో సిద్ధిపేటకు బదిలీ చేయడం వెనక పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా, తనపై కేసు నమోదు చేయడం వెనుక కుట్ర కోణం ఉందంటున్నారు ఇటీవల కొత్తూరు పోలీసులు అరెస్టు చేసిన క్రాంతిరెడ్డి. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని, నిందితుల నేర అంగీకార పత్రం ద్వారా తన పేరు రికార్డుల్లోకి తీసుకుని వచ్చి అరెస్టు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి చెన్నయ్య కుటుంబం దాదాపు పదేళ్ల నుంచి ఈ భూమి విషయంలో రెవిన్యూ అధికారుల వద్ద పోరాడుతుందన్నారు. తాను కొత్తూరులో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న నేపధ్యంలో తనను బ్లేమ్ చేయడంలో భాగంగా ఈ అరెస్టు జరిగిందన్నారు క్రాంతిరెడ్డి. విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 


   నేషనల్ హైవేనే ఆక్రమించేశారు.. ఆక్రమించిన పెద్దలను వదిలేశారు!