మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు పద్మవిభూషణ్

Header Banner

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు పద్మవిభూషణ్

  Thu Jan 25, 2018 21:36        Cinemas, India, Telugu

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 9మందిని పద్మశ్రీ అవార్డు వరించింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(సంగీత దర్శకుడు)కు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. కాగా వీరంతా రిపబ్లిక్ డే రోజున అవార్డులు అందుకోనున్నారు. అవార్డు ప్రకటన గురించి తెలుసుకున్న ఇళయరాజా ఆనందం వ్యక్తం చేశారు.

 

ఇళయరాజ సంగీత ప్రస్థానం.. 

తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న (పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు) నిర్వహించే సంగీత బృందంతో కలసి ఉరూరా తిరిగేవారు. అతను తన సోదరులతో కలసి దక్షిణ భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు.

         ఈ కాలంలోనే ఇళయరాజా తన సంగీత జ్ఞానాన్ని పరీక్షించుకున్నాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టారు. 1968లో మద్రాసులో అడుగెడుతూనే ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసించారు. పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించారు.

      ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) మరియు ఒక కుమార్తె (భవతారణి). ఈయన సోదరుడు గంగై అమరెన్ కూడా సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. 

 

భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడిగా ఇళయరాజా పేరుగాంచారు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. దక్షిణ భారత సంగీతం, పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ఆయన ప్రవేశపెట్టారు. ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా ఇప్పటికే నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నారు. ఈయన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రం 2010లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

 


   మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు పద్మవిభూషణ్