13 మంది కన్న బిడ్డలను చిత్ర హింసలు పెట్టి..

Header Banner

13 మంది కన్న బిడ్డలను చిత్ర హింసలు పెట్టి..

  Tue Jan 16, 2018 21:45        Gulf News, India, Telugu

 ‘కన్న తల్లిదండ్రులే తమ పిల్లల్ని బంధించి తిండి పెట్టకుండా ఉంటే’.. ఊహించడానికే భయానకంగా ఉన్న ఇలాంటి సంఘటనొకటి అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 13 మంది పిల్లలకు తిండితిప్పలు లేకుండా కొన్ని నెలలుగా ఇంట్లోనే బంధించారు. తమ పిల్లలకు చిన్నగా దెబ్బతగిలితేనే విలవిలలాడిపోయే తల్లిదండ్రులు ఇలాంటి దారుణానికి పాల్పడతారంటే నమ్మలేంకానీ, ఈ వార్త చదివాక అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారని నమ్మక తప్పదు.

 

ఇంతకీ విషయమేంటంటే.. కాలిఫోర్నియా రాష్ట్రం రివర్‌సైడ్‌ కంట్రీలోని పెర్రిస్‌ పట్టణంలో డేవిడ్‌ అలెన్‌ టర్పిన్, ఆనా టర్పిన్ అనే దంపతులు ఉంటున్నారు. వారికి 13 మంది సంతానం. వారంతా 2 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారు. పెర్రిస్‌ శివారులోని రెండస్తుల ఇంట్లో ఉంటున్నారు. అంతమంది పిల్లలున్న ఆ ఇంట్లో.. చాలా నెలలుగా అలికిడి లేకపోయినా చుట్టుపక్కలవారు అంతగా పట్టించుకోలేదు. చైన్లు, తాళ్లతో పిల్లలందరినీ మంచాలకు కట్టేసి, అలెన్‌, ఆనాలు కూడా లోపలే ఉండిపోయారు. బందీలుగా ఉన్న పిల్లల్లో ఓ పాప మొన్న ఆదివారం ఇంట్లో నుంచి తప్పించుకుని 911కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది.

 

తమ పిల్లనే ఇలా చైన్లు, తాళ్లతో కట్టేసి, తిండిపెడ్డకుండా నరకం చూపించారా తల్లిదండ్రులు! తిండిలేక చిక్కిపోయి, తీవ్రమైన దుర్గంధంలో పడిఉన్న వారిని ఎట్టకేలకు పోలీసులు కాపాడారు. అలెన్‌-ఆనా దంపతులు సొంతపిల్లలనే ఎందుకు ఇలా టార్చర్‌ చేశారనే కారణాలు తెలియాల్సిఉంది. పిల్లలు ఇంకా షాక్‌లోనే ఉన్నారని, వారు కోలుకున్న తర్వాతే అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.

 

 


   13 మంది కన్న బిడ్డలను చిత్ర హింసలు పెట్టి..