నారావారిపల్లెలో సామాన్యుడికి సారీ చెప్పిన సీఎం

Header Banner

నారావారిపల్లెలో సామాన్యుడికి సారీ చెప్పిన సీఎం

  Tue Jan 16, 2018 20:59        India, Telugu

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సామాన్యుడికి సారీ చెప్పారు. సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన సీఎంకు స్థానికులు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో అటువైపు నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తన కుటుంబంతో కలిసి సీఎం ఇంటివైపుగా వస్తున్నారు. అటువైపు వాహనాలు ఆపేయడంతో ఎ.రంగంపేట గ్రామం నుంచి సుమారు కిలోమీటరు దూరం నుంచి కాలి నడకన సీఎం ఇంటివరకు చేరుకున్నారు.

 

ముఖ్యమంత్రి వల్లే తాము కిలోమీటరు నడవాల్సి వచ్చిందని భావించిన నవీన్ అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశాడు. అదంతా గమనించిన సీఎం చొరవ తీసుకుని, సమస్యను అర్థం చేసుకుని నవీన్‌కు సారీ చెప్పారు. వెంటనే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించమని పోలీసులను ఆదేశించారు. ఓ సామాన్యుడికి సీఎం సారీ చెప్పడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలు తెలిపి ‘సీఎం జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటనతో ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు అంటూ’ సీఎం చంద్రబాబును కొనియాడారు.

 


   CBN -Saying - Sorry