దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

Header Banner

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

  Wed Dec 27, 2017 21:36        India, Sports, Telugu

పెళ్లి, ఆ తర్వాత హనీమూన్... అటు తర్వాత రిసెప్షన్లతో బిజీగా ఉన్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడాడు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పని కోసం సెలవు తీసుకున్నానని, క్రికెట్‌తో మళ్లీ అనుసంధానం కావడం పెద్ద విషయమేమీ కాదని తేల్చి చెప్పాడు. క్రికెట్ తన రక్తంలోనే ఉందని పేర్కొన్నాడు. పెళ్లి కోసం జట్టుకు దూరమైనా దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం మూడు వారాలుగా సిద్ధమవుతూనే ఉన్నానని వివరించాడు. క్రికెట్ ఆడేందుకే దక్షిణాఫ్రికా వెళ్తున్నాం తప్ప అక్కడ ఏదో నిరూపించుకోవాలని కాదని స్పష్టం చేశాడు. గతంలో సాధించలేనిది ఇప్పుడు సాధించి చూపిస్తామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

 

అనంతరం కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా టూర్‌ను అతి పెద్ద సవాల్‌గా భావిస్తున్నట్టు చెప్పాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో భాగంగా భారత్ మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో వచ్చే నెల 5న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్.. దక్షిణాఫ్రికా టూర్‌లోనూ సత్తా చాటి రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.

 


   దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీ కీలక వ్యాఖ్యలు!