కువైత్‌లో రాయబారిగా తెలుగు దౌత్యవేత్త జీవసాగర్

Header Banner

కువైత్‌లో రాయబారిగా తెలుగు దౌత్యవేత్త జీవసాగర్

  Wed Dec 13, 2017 22:02        India, Telugu

కువైత్లో భారతీయ రాయబారిగా అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కే. జీవసాగర్ నియామకమయ్యారు. కువైత్లో రాయబారిగా నియామకమయిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి జీవసాగర్ కావడం గమనార్హం. కృష్ణాజిల్లా, మచిలీపట్నానికి చెందిన 57ఏళ్ల జీవసాగర్.. 1991లో అఖిల భారతీయ సర్వీసుకు ఎంపికయ్యారు. ఇరానీ భాష ఫార్సీలో ప్రావీణ్యం పొంది ఇరాన్లో దౌత్యవేత్తగా తన ఉద్యోగ పర్వాన్ని ప్రారంభించారు. అఫ్రికా, యూరోప్, అసియా దేశాలతో పాటు విదేశాంగ శాఖలో కీలకమైన పాకిస్తాన్ వ్యవహారాల విభాగం అధిపతిగా కూడా ఆయన పని చేశారు. 

 

సంఝోత రైలు దుర్ఘటన అనంతరం ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్తాన్‌తో కలిసి జరిగిన మొదటి సంయుక్త సమావేశంలో జీవసాగర్ భారత్ పక్షాన కీలక పాత్ర వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆఫ్రికా పర్యటనలో కూడా కీలక పాత్ర వహించిన ఆయన ప్రస్తుతం సంయుక్త కార్యదర్శిగా న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు నిర్వహించే విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కువైత్ రాయబారిగా నియామకం అవడంతో త్వరలో కువైత్‌ రాజు (అమీర్) శేఖ్ సభాను కలుస్తారు. ఇప్పటి వరకు రాయబారిగా పని చేసి తెలుగు వారి సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన రాజస్ధాన్‌కు చెందిన సునీల్ జైన్ పదవి విరమణ చేసిన కొద్ది నెలలుగా కువైత్‌లో రాయబారి పదవి ఖాళీగా ఉంది.

 

మచిలీపట్నంలోని నోబల్ కళాశాలలో చదివిన జీవ సాగర్ 1991లో ఐ.యఫ్.యస్‌కు ఎంపిక కాక ముందు కెనారా బ్యాంకులో వివిధ హోదాలలో పని చేశారు. లిదియా శ్రీలతతో వివాహమైన ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ప్రప్రధమంగా తెలుగు దౌత్యవేత్త రాయబారిగా రానుండంతో కువైత్ లోని తెలుగు ప్రవాసీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    కువైత్‌లో రాయబారిగా తెలుగు దౌత్యవేత్త జీవసాగర్