అమెరికా మెట్రోలో మన తెలుగమ్మాయి!

Header Banner

అమెరికా మెట్రోలో మన తెలుగమ్మాయి!

  Sun Dec 10, 2017 21:40        India, Telugu

తెలుగు ప్రజలు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల... మెట్రో రైలు! నెలాఖరుకు హైదరాబాద్లో కల నెరవేరబోతోంది. మొట్ట మొదటి మెట్రో రైలు పరుగులు పెట్టడానికి సిద్ధమవుతోంది. అయితే తెలుగమ్మాయి ఇప్పటికే అమెరికా మెట్రో రైలు (సబ్వే)కి దిక్సూచిగా మారింది. అమెరికాలోని న్యూయార్క్లో సబ్వే కండక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి భారతీయురాలిగానే కాదు... ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన పుస్తకం కూడా రాసి మంచి పేరు తెచ్చుకున్న సుజాత గిడ్ల జర్నీఆమె మాటల్లోనే...

ఓ మధ్య తరగతి కుటుంబం మాది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మా సొంతూరు

అమ్మ మంజుల, నాన్న ప్రభాకర్‌... ఇద్దరూ అధ్యాపకులుగా పనిచేశారు. అప్పట్లో మా కుటుంబంలో సైకిల్‌ తొక్కిన మొట్టమొదటి ఆడపిల్లను నేనే! చిన్నప్పటి నుంచీ రొటీన్‌కు భిన్నంగా ఉండటమంటే ఇష్టం. ఆ అభిరుచే ఇప్పుడిలా కండక్టర్‌ను చేసింది. నిజానికి ఇంటర్‌ అయ్యాక నా మిత్రులకు భిన్నంగా బీటెక్‌లో మెకానికల్‌ తీసుకున్నాను. ఆ తరువాత మాస్టర్స్‌ కోసం అమెరికా వచ్చాను.

 

అది అవ్వగానే ఓ బ్యాంకులో కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా చేరాను. మంచి జీతం. కానీ రొటీన్‌గా అనిపించేది. ఆర్థిక సంక్షోభం వచ్చి ఉన్న ఉద్యోగం పోయింది. మళ్లీ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ల కోసం ఎక్కడా అప్లికేషన్లు పెట్టలేదు. బ్యాంకులో పనిచేసేటప్పుడు సబ్‌వే ట్రయిన్‌లో వెళ్లి వస్తుండేదాన్ని. రైల్లో లేడీ కండక్టర్‌ను చూస్తుంటే ముచ్చటేసేది. ప్రయాణికులతో ప్రయాణిస్తూ... వాళ్లని వారి గమ్యానికి చేర్చడానికి ఆమె చూపించే శ్రద్ధ నన్ను ఆకట్టుకుంది. నాక్కూడా ఇలాంటి ఉద్యోగం వస్తే బాగుంటుందనుకొనేదాన్ని.

 

కోరుకున్న ఉద్యోగం...

అనుకోకుండా ఒకరోజు పేపర్లో సబ్‌వే కండక్టర్‌ జాబ్‌ కోసం ప్రకటన వచ్చింది. అది చూసి దరఖాస్తు చేసి... పరీక్ష రాశాను. సెలక్ట్‌ అయ్యాను. కానీ ఆ విషయం నాకు తెలియదు. మేము ఫలితాలు రాక ముందే ఇల్లు మారిపోయాం. దీంతో వాళ్లు ఇంటర్వ్యూకి రమ్మని ఎన్నిసార్లు ఉత్తరాలు పంపినా, ఫోన్లు చేసినా... నాకు చేరలేదు. కొన్నాళ్లు ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో నేను రాసిన పరీక్ష గుర్తుకు వచ్చింది. ఏమైందో తెలుసుకుందామని రైల్వే కార్యాలయానికి వెళితే... వాళ్లు జరిగిన విషయం చెప్పారు. అప్పుడు కానీ వెళ్లుండకపోతే.. వేరే వాళ్లకి ఆ ఉద్యోగం ఇచ్చేసేవారమని అధికారులు చెప్పారు. అలా 2009లో కోరుకున్న ఉద్యోగంలో చేరాను.

 

నమస్తే... వణక్కం...

సబ్‌వే రైల్లో ఒక్కోసారి భారత ప్రయాణికులు కనిపిస్తుంటారు. అలా వారిని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది. వాళ్లు తెలుగువారైతే ‘నమస్తే’ అని... తమిళంలో మాట్లాడుతుంటే ‘వణక్కం’ అని... పంజాబీలైతే ‘సస్రియాకాల్‌’ అంటూ పలకరిస్తుంటాను. అలా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ... వారితో కలసి ప్రయాణిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది.

నా జాబ్‌ గురించి చెప్పాలంటే... మన దేశంలో రైల్వే గార్డ్‌ లాంటిది. మేము రైలు మధ్యలో ఉంటాం. ప్యాసింజర్స్‌కి తలుపులు తెరవడం, మూయడం, స్టేషన్లు వచ్చినప్పుడు అనౌన్స్‌మెంట్‌ ఇవ్వడం, వారు జాగ్రత్తగా దిగేలా చూడటం, ఎక్కే వారికి సాయం చేయడం, ఎలాంటి ఇబ్బందులూ, సమస్యలూ లేకుండా వారి గమ్యాలకు చేర్చడం లాంటి బాధ్యతలన్నీ ఉంటాయి. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న వృత్తి. రోజూ కచ్చితంగా సమయానికి విధులకు రావాలి. యూనిఫాంలో ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రయాణికులు ఇబ్బంది పడతారు. మేమే అవసరమైనవన్నీ తెచ్చుకోవాలి. ముఖ్యంగా స్టూల్స్‌ తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒక్కోసారి ఫ్లాట్‌ఫామ్‌కి కొద్దిగా దూరంలో రైలు ఆగుతుంటుంది. అలాంటప్పుడు ప్యాసింజర్లు సులువుగా దిగడానికి ఈ స్టూల్స్‌ వాడుతుంటాం. ప్రయాణికులు మమ్మల్ని దూషించినా, కామెంట్‌ చేసినా వారిని ఏమీ అనకూడదు. నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించి తీరాలి. బ్యాంకులో చేసేటప్పుడు రొటీన్‌గా బోర్‌ కొట్టేది. కానీ కండక్టర్‌గా అన్ని దేశాల వారితో కలిసి పనిచేస్తున్నాను. అందరితో మాట్లాడుతూ... వారి సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. మన సంస్కృతి గొప్పదనం వారికి చెప్పవచ్చు.

 

వేరే ఉద్యోగం చూసుకోవచ్చుగా అనేవారు...

ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో ప్రయాణికులు నన్ను కొత్తగా చూసేవారు. ఇక్కడ తొలి భారతీయ కండక్టర్‌ను నేనేనని తెలిసి సంతోషిస్తారు. అభినందిస్తారు. నాకు అవి ఎంతో సంతృప్తినిస్తాయి. కానీ కొంతమంది భారతీయులు మాత్రం ‘ఇంత చదువుకుని ఈ కండక్టర్‌ ఉద్యోగం ఏంటి? వేరేది చూసుకోవచ్చు కదా’ అని సలహాలిస్తారు. మరికొంత మంది ‘వేరే ఉద్యోగం రాకనే ఈ చిన్న ఉద్యోగంలో చేస్తున్నట్టుంది’ అంటూ ఎగతాళీ చేస్తారు. కొత్తలో మా అమ్మ బాధపడుతుందని యూనిఫాం బ్యాగులో పెట్టుకుని వెళ్లేదాన్ని.

 

కొన్నాళ్లకు ఆమెకు తెలిసింది. ‘చిన్న ఉద్యోగమని కాదు... నీ భద్రత గురించే నా ఆందోళనంతా’ అని చెప్పింది అమ్మ. భయపడాల్సిందేమీ లేదని చెబితే ఆమె కుదుట పడింది. అంతేకాదు... నేను రాసిన ‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’ పుస్తకం రివ్యూలో కూడా ఒక భారతీయుడు ‘పాపం సుజాత చివరికి సబ్‌వేలో కండక్టర్‌ అయ్యారు’ అని జాలి చూపిస్తూ రాశారు. మరి కొంతమంది నేను దళితురాలిని కాబట్టి బ్యాంక్‌ జాబ్‌ పోయినందుకు, ఈ చిన్న జాబ్‌ వచ్చినందుకు సంతోషించారు.

 

వారికి డిగ్నిటీ ఆఫ్లేబర్తెలుసు

ఫలానా పని తక్కువ... ఫలానా పని ఎక్కువ అనే ఆలోచనే తప్పు. ఆ మాటకొస్తే అమెరికన్స్‌కి ‘డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌’ తెలుసు. ఎంత పెద్ద చదువులు చదివినా వారికిష్టమయితే బస్‌ డ్రైవర్‌ ఉద్యోగమో, టీచర్‌ ఉద్యోగమో, బిల్డింగ్‌ల కిటికీలు క్లీన్‌ చేయడానికి కూడా వెనకాడరు. మంచి ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా కూర్చోకుండా చిన్న చిన్న పనులు చేస్తుంటారు. కానీ కొందరు భారతీయులు మాత్రం కోరుకునే జాబ్‌ వచ్చేవరకు ఖాళీగా ఉంటారు.

 

మనలా అమెరికాలో కుల వ్యవస్థ, అంటరానితనం లేవు. భారత్‌లోలా ఇక్కడ నన్నెవ్వరూ వేరుగా చూడలేదు. చూడరు. మా నాన్న ఇంగ్లిష్‌ లెక్చరర్‌. ఇక్కడ ఆయన ట్యూషన్స్‌ చెప్పేటప్పుడు విని, ఆంగ్లం నేర్చుకున్నా. నా ఇంగ్లిష్‌ ధాటి చూసి భారతీయులు నాది అగ్ర కులం అనుకునేవారు. కానీ... దళితురాలినని తెలియగానే దూరంగా వెళ్లిపోయేవారు. ‘అలాంటి పట్టింపులన్నీ భారత్‌లోనే, ఇక్కడకు వచ్చిన తరువాత ఉండవు’ అనుకున్నా. అయితే మనవారు ఎక్కడికి వెళ్లినా సంస్కృతి పేరుతో కులాన్ని తీసుకువస్తున్నారు. అది మన దౌర్భాగ్యం.

 

అంటరానివారిగా చూసేవారు...

చిన్నప్పటి నుంచి కుల వివక్ష నన్ను వెంటాడుతూనే ఉంది. విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీలో తిరిగాను. జైలుకి వెళ్లాను. మేం ముగ్గురం పిల్లలం. అమ్మ ఒక చోట... నాన్న మరో ఊళ్లో పనిచేసేవారు. మేం అమ్మతో ఉండేవాళ్లం. పేదరికంలో పెరిగిన మమ్మల్ని అంటరానివారిగా చూసేవారు.

 

ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నారనేది చిన్నప్పటి నుంచీ అంతుపట్టేది కాదు. మా మామయ్య పీపుల్స్‌ వార్‌ గ్రూపు నాయకుడు కె.జి.సత్యమూర్తి గారు (ప్రముఖ కవి శివసాగర్‌). నేను ఆయన్ని కలిసింది మాత్రం తనని పార్టీ నుంచి తొలగించిన తరువాతే! ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. ‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’ పుస్తకంలో నేను కులవ్యవస్థ గురించి, దళిత క్రిష్టియన్స్‌ గురించి రాసి తప్పు చేశానంటున్నారు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా సంప్రదాయం పేరిట కులాలను తమతో పాటు తీసుకెళ్లి భద్రంగా కాపాడుకుంటున్న వారి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం! 

 

‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’... ఇంగ్లిష్‌లో రచించిన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ‘న్యూయార్క్‌ టైమ్స్‌, బీబీసీ’ వంటి మీడియాల్లో రివ్యూలు, ఇంటర్వ్యూలూ వచ్చాయి. అప్పుడే నేను కేవలం రచయిత్రిగానే కాకుండా... తొలి భారతీయ మహిళా కండక్టర్‌గా కూడా అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ పుస్తకాన్ని ఇక్కడి కులం గురించి పట్టించుకొనే భారతీయులు విమర్శిస్తున్నారు.

 

 


   అమెరికా మెట్రోలో మన తెలుగమ్మాయి!