కాలిఫోర్నియాలో మళ్ళీ దావానలం

Header Banner

కాలిఫోర్నియాలో మళ్ళీ దావానలం

  Wed Dec 06, 2017 21:54        India, Telugu

- వందలాది ఇళ్ళు ధ్వంసం లక్షలాదిమంది ప్రజల తరలింపు         

 కాలిఫోర్నియాలో మళ్ళీ దావానలం పెచ్చరిల్లింది. రెండు నెలల్లో ఇక్కడ దావానలం బీభత్సం సృష్టించడం ఇది రెండవసారి. లాస్‌ఏంజెల్స్‌కు వాయవ్యంగా వెంటూరా కౌంటీలో చెలరేగిన అగ్నికీలల కారణంగా 150 వరకు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్ళు దగ్ధం కాగా, వేలాదిమంది ప్రజలు వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. మంటలు అదుపులోకి వచ్చేలోగా మరింత నష్టం సంభవించే అవకాశం వుందని అధికారులు పేర్కొంటున్నారు. వెంటూరాకు 72కిలోమీటర్ల దూరంలో శాన్‌ గాబ్రియెల్‌ పర్వత సానువుల్లో కొన్ని నివాసాలు దగ్ధమయ్యాయని అధికారులు చెప్పారు. పెను గాలుల కారణంగా ఈ మంటలు మరింత త్వరగా కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయని, ఈ వారమంతా కూడా ప్రమాదకరమైన ఈ పరిస్థితి కొనసాగవచ్చని మేయర్‌ ఎరిక్‌ గార్సెటి తెలిపారు. ఆలస్యం చేయకుండా వెంటనే తమ ఇళ్ళను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. లక్షా 50వేల మంది ప్రజలు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని వీడి వెళ్ళాల్సిన అవసరం వుందన్నారు. ఇప్పటివరకు కేవలం ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగలేదని, అందువల్ల ఆలస్యం చేయకుండా కదలాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం చెలరేగిన మంటలు మంగళవారానికల్లా మూడు ప్రాంతాలను కమ్మేసాయని, దీంతో మంటలు పూర్తి స్థాయిలో వ్యాపించకుండా విమానాల ద్వారా నీళ్ళను జల్లుతునే వున్నారని చెప్పారు. మంటలు కారణంగా రెండు రహదారులను మూసివేశారు. లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగ కమ్ముకుపోయింది.    కాలిఫోర్నియాలో మళ్ళీ దావానలం