ఓఖి తుపానుపై ముందస్తు హెచ్చరికలు అందలేదు : కేర‌ళ సీఎం

Header Banner

ఓఖి తుపానుపై ముందస్తు హెచ్చరికలు అందలేదు : కేర‌ళ సీఎం

  Wed Dec 06, 2017 21:45        India, Telugu

- కేరళ ముఖ్యమంత్రి విజయన్వెల్లడి

       ఓఖి తుఫాను రాకపై తమకు వాతావరణశాఖ నుండి ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ అందలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తుఫాను బాధితులను ఆదుకోవటంలో తమ ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్న విమర్శలపై బుధవారం ఆయన మీడియా సమావేశంలో స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తుఫాను బాధిత ప్రజలకు ఆయన కొన్ని సహాయక ప్యాకేజిలను ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ముందుగానే అవసరమైన చర్యలు చేపడతామని, తద్వారా విపత్తు నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. తుఫానుకు సంబంధించిన తొలి సమాచారం తమ ప్రభుత్వానికి గత నెల30వ తేదీ మధ్యాహ్నం అందిందని ఆయన వివరించారు. దీనిపై తముకు ముందస్తు హెచ్చరికలేమీ అందలేదని, నవంబర్‌ 30వ తేదీ ఉదయం 8.30 గంటల సమయంలో కన్యాకుమారి తీరంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించిందని ఆయన చెప్పారు. అప్పుడు సైతం తమకు అందిన సమాచారంలో తుఫాను ప్రస్తావన లేదన్నారు. అప్పటికే రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లిపోయారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు సైతం సహాయ కార్యక్రమాల కొనసాగింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం లేదని చెప్పారని, కేవలం గంట వ్యవధిలోనే రక్షణ సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వివరించారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకు వచ్చే వరకూ తాము చేపట్టిన సహాయక కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. దాదాపు 1,130 మంది మళయాళీలలతో సహా మొత్తం 2,600 మంది మత్స్యకారులను రక్షించామని, అధికారిక రికార్డుల ప్రకారం ఇంకా 92 మంది జాడ తెలియటం లేదని ఆయన చెప్పారు. తుఫానులో చనిపోయిన వారి కుటుంబాలకు వ్యక్తికి రు.20 లక్షల వంతున, వికలాంగులైన వారికి రు.5 లక్షల వంతున పరిహారం అందచేస్తామని ఆయన ప్రకటించారు. రానున్న వారానికి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు రోజుకు రూ.60 వంతున, వారి పిల్లలకు రు.45 వంతున దినసరిభత్యం చెల్లిస్తామన్నారు. అదే విధంగా తీర ప్రాంత గ్రామ ప్రజలకు ఉచిత రేషన్‌ను కూడా అందచేస్తామని ఆయన చెప్పారు. చేపలవేటకు సంబందించిన పరికరాలు కోల్పోయిన వారికి పరిహారం అందచేస్తామని, మరణించిన వారి పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగ శిక్షణ కల్పిస్తామని వివరించారు. ఇప్పటి నుండి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తమ వివరాలను మత్స్యశాఖ వద్ద ప్రతిరోజూ నమోదు చేసుకోవాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించామన్నారు. చేపల వేటకు వెళ్లే బోట్లన్నింటికీ జిపిఎస్‌ వ్యవస్థను అమరుస్తామన్నారు. తీర ప్రాంత పోలీసు విభాగానికి 200 మందిని నియమిస్తామని, ఇందులో ప్రాణాలు కోల్పోయిన, గల్లంతయిన వారి పిల్లలకు ప్రాధాన్యత కల్పిస్తామని విజయన్‌ వివరించారు. ఈ విపత్తులో తమకు సరైన సమయంలో సహాయం అందించిన కేంద్రానికి, బాధిత ప్రజలను ఆదుకోవటంలో సహకరించిన వారందరికి తమ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి తమకు ప్రత్యేక సహాయ ప్యాకేజి అందించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన చెప్పారు.   ఓఖి తుపానుపై ముందస్తు హెచ్చరికలు అందలేదు : కేర‌ళ సీఎం