'మోదీలా అమెరికాను అభివృద్ధి చేస్తానన్న ట్రంప్'

Header Banner

'మోదీలా అమెరికాను అభివృద్ధి చేస్తానన్న ట్రంప్'

  Wed Dec 06, 2017 21:39        India, Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం బుధవారంనాడు ముగియనుండటంతో ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ఒక్కసారిగా ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ తరఫున పలు ర్యాలీల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రచారం చేయగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావ్‌నగర్ జిల్లాలో ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా 22 ఏళ్లుగా గుజరాత్‌లో పాలన సాగిస్తున్న బీజేపీని, మోదీ నాయకత్వాన్ని యోగి ఆదిత్యనాథ్  ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా మోదీ తరహా అభివృద్ధిని అందిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా యోగి ప్రస్తావించారు. 'అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికాను ఏవిధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ట్రంప్‌ను అడిగినప్పుడు, ఇండియాలో మోదీ తరహాలో అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ ఆయన సమాధానమిచ్చారు' అని నాటి సంఘటనను యోగి గుర్తు చేశారు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ట్రంప్ సైతం మోదీ పట్ల తనుకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారని అన్నారు. గుజరాత్ తరహా అభివృద్ధిని ప్రతి రాష్ట్రం కోరుకుంటోందని, మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇతర నేతలు ఆయనను ఎంతగానో గౌరవిస్తున్నారని చెప్పారు. అలాంటి గౌరవం పొందిన కాంగ్రెస్ నేతలనెవరినైనా మీరు చూశారా? అని ర్యాలీలో ప్రజలనుద్దేశించి యోగి ప్రశ్నించారు. కులప్రాతిపదికపై గుజరాత్‌ను విడగొట్టాలని కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని, స్థిరమైన ప్రభుత్వం కోరుకునే వారు మాత్రం బీజేపీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వాదనను ప్రస్తావిస్తూ, రామజన్మభూమి పనులు మొదలయ్యాయని, కపిల్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారని అన్నారు. అసలు అయోధ్యలో రామాలయం కట్టాలనుకుంటున్నారా వద్దా అనే దానిపై కాంగ్రెస్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని యోగి డిమాండ్ చేశారు.   'మోదీలా అమెరికాను అభివృద్ధి చేస్తానన్న ట్రంప్'