ట్రిపుల్ తలాక్‌ బిల్లుకు యోగి సర్కార్ సై.

Header Banner

ట్రిపుల్ తలాక్‌ బిల్లుకు యోగి సర్కార్ సై.

  Wed Dec 06, 2017 21:36        India, Telugu

 ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ఇటీవల తీసుకువచ్చిన ముసాయిదా బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునివ్వడంతో ఇందుకు అనుగుణంగా మోదీ సర్కార్ ఇటీవల ముసాయిదా బిల్లును తీసుకువచ్చింది. దీనిని రాష్ట్రాల ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లును యోగి అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. దీంతో ట్రిపుల్ తలాక్‌పై ముసాయిదా బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది. మోదీ కేబినెట్ ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లును తమ ప్రభుత్వం ఆమోదించినట్టు యూపీ రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం తమదేనని చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం ఆమోదించి రాష్ట్రాలకు పంపిందని, డిసెంబర్ 10లోగా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లును వచ్చే వారంలో ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెడుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ఉల్లంఘిస్తే బెయిలుకు అవకాశం లేని నేరంగా పరిగణించి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. భార్యకు భరణం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.   ట్రిపుల్ తలాక్‌ బిల్లుకు యోగి సర్కార్ సై.