మౌఢ్యానికి టీకా డాక్ట‌ర్ షిమ్నా..

Header Banner

మౌఢ్యానికి టీకా డాక్ట‌ర్ షిమ్నా..

  Tue Nov 21, 2017 22:31        India, Telugu

మంచి కన్నా చెడుకే ప్రచారం ఎక్కువ. నిజం నోరు దాటేలోగా అబద్ధం ప్రపంచాన్నే చుట్టి వచ్చేస్తుందన్నది ఒక పాత సామెత. శాస్త్రీయ విజ్ఞానం ఎంత విస్తరిస్తున్నా మూఢత్వం అక్కడక్కడ గింగుర్లు తిరుగుతూనే ఉంటుంది. తద్వారా లాభాలు పొందేవారంతా ప్రజలు ఎల్లప్పుడూ మూఢత్వంలోనే ఉండాలని కోరుకుంటుంటారు. చాలాచోట్ల మూఢత్వ మూర్ఖులకు దూరంగా ఉండడమే మంచిదని విజ్ఞానంతో ఉన్నవారూ అప్పుడప్పుడూ మౌనంగా ఉండిపోతారు. కానీ ఆ డాక్టరమ్మ ప్రజల్లో మూఢత్వాన్ని తొలగించడానికి ఏం చేసారో తెలుసా? 

 

కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పదిహేనేళ్ల వయసులో ఉండే పిల్లలందరికీ వ్యాధినిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అమలుచేస్తున్న ఈ కార్యక్రమంలో మీజిల్స్‌, రూబెల్లా, ఎమ్‌ఆర్‌ వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేస్తారు. భావితరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవాలి అన్నది అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తపన. అయితే ఈ ప్రయత్నానికి ఏదోవిధంగా అడ్డుపడకపోతే తమకు మనుగడ కష్టమేనని అక్కడున్న నకిలీవైద్యులు.. అశాస్త్రీయ వైద్యాన్ని అందించే నేచురోపతి.. హోమియోపతి.. మూలికా వైద్యులు.. పిఎమ్‌పిలు.. ఆర్‌ఎమ్‌పిలు తదితరులంతా భావించారు. దీంతో పెద్ద ఎత్తున టీకాల కార్యక్రమానికి వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. కోజికోడ్‌, మలప్పురం తదితర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని విషప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీకాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ప్రచారానికి సోషల్‌ మీడియానే వేదికగా చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ గ్రూపుల్లో అసత్యవార్తలు, అబద్ధాలతో వ్యాసాలు, ఫేక్‌ఫొటోలు, వీడియోలు వంటివి ఇబ్బడిముబ్బడిగా పెట్టారు. వీరి ప్రచారం ఏ స్థాయికి వెళ్లిందంటే టీకాలు వేసుకుంటే చనిపోతామనే భయాన్ని ప్రజల్లో కల్పించేటంతగా పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం ఏ సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించిందో.. ఆ టీకాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో జనం ఆలోచించుకునే పరిస్థితి లేకుండా చాలాచోట్ల అసత్యం ప్రచారమైపోయింది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల వారీగా వైద్యాధికారులను రంగంలో దించింది. వారితో పాఠశాలల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. ఆమె పేరు షిమ్నా అజీజ్‌. మలప్పురంలోని ముంజేరి మెడికల్‌ కళాశాలలో వైద్యాధికారి. ఆమె ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఒక పాఠశాలలో వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.

అది టీకాల వ్యతిరేక ప్రచారం బలంగా ఉండే ప్రాంతం కావడం వల్ల ఆమె టీకాల ప్రయోజనాలేమిటో వివరిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు టీకాల విషయంలో తమకున్న సందేహాలనూ అడుగుతుంటే ఆమె సమాధానాలు ఇస్తున్నారు. ఆ సంభాషణలో ఆమె ''నా చిన్నతనంలో నేనే మీజిల్స్‌ టీకా వేయించుకున్నాను. అప్పట్లో రూబెల్లా టీకా వేయించుకోవడం వీలుకాలేదు. ఇప్పుడు అందరికీ మంచి అవకాశం వచ్చింది. తమ పిల్లలకు అందరూ ఈ రెండు టీకాలు వేయించండి. అది చాలా అవసరం'' అని చెప్పారు. అక్కడున్న వారిలో ఒకతను వెంటనే లేచి ''టీకా వేయించుకోని నువ్వు మాకు టీకాలు తప్పకుండా వేయించాలని చెబుతున్నావా? ఆ టీకా వేసుకుంటే ఏమీకాదు అని నిరూపించడానికి దానిని వేసుకో మా ముందే!'' అంటూ సవాల్‌ చేశాడు. డాక్టర్‌ షిమ్నా ఆ మాటలకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. కొన్ని వేల మాటలు చెప్పి వారిలో అవగాహన కల్పించడం కన్నా, ఇదేదో బాగుందని అనుకున్నారు. వెంటనే అందరి ముందూ ఆ టీకాను ఆమె వేయించుకున్నారు. అంతే అక్కడ ఉన్నవారందరిలోనూ విస్మయం. టీకాల కార్యక్రమానికి అడ్డుపడేవారూ ఆక్కడ నుండి వెళ్లిపోయారు. సందేహాలతో ప్రశ్నించినవారు, లోలోపల భయపడుతున్న వారూ తమ అనుమానాలు చెదిరిపోగా పిల్లలకు టీకాలు వేయించారు.  అయితే ఈ ఘటన ప్రభావం ఆ ఒక్క పాఠశాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఎపిసోడ్‌ కూడా స్థానిక పత్రికల్లో, సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. అంతవరకూ జరుగుతున్న టీకాల వ్యతిరేక ప్రచారం రానురానూ బలహీనపడడానికి ఇది కారణమైంది.

ఈ నెల మొదటివారంలో జరిగిన ఈ ఘటనపై చాలా రకాలుగా చర్చలూ జరిగాయి. ఇది తమకు మేలు చేసే కార్యక్రమమేనన్న అభిప్రాయానికి అంతా వస్తున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాన్ని తొలగించడానికి డాక్టర్‌ షిమ్నా అజీజ్‌ చేసిన ప్రయత్నాన్ని మెచ్చి వీరి ఫేస్‌బుక్‌ పేజీ (ఇన్ఫోక్లినిక్‌) కి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సోషల్‌ మీడియా అవార్డు కూడా ప్రకటించింది. ప్రజల్లో శాస్త్రీయ విషయాలపై ఎంత అవగాహన కలిగించాలని ప్రయత్నిస్తున్నా.. చుట్టుపక్కల వాళ్లు చెప్పే మూఢత్వపు కబుర్లే నిజమని నమ్ముతారు. అసత్యాలు చాలా వేగంగా ప్రచారమవుతుంటాయి. సోషల్‌ మీడియాలో ఇలాంటి అబద్దపు ప్రచారకులు ఎక్కువే ఉన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 26 మంది డాక్టర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ముల్లుని ముల్లుతోనే తీయాలని, అందుకు ఫేస్‌బుక్‌నే వేదికగా చేసుకోవాలని భావించాం. మేమంతా కలిసి 'ఇన్ఫోక్లినిక్‌' పేరుతో ఒక పేజీ పెట్టాం. శాస్త్రీయ అంశాలను ప్రచారం చేస్తూ వ్యాసాలు, ఫోటోలు, కేస్‌స్టడీలు, వీడియోలు అందులో పొందుపరిచాం. దీనికి మంచి ఆదరణ లభించింది.

కేవలం కొన్ని వారాల్లోనే 50 వేల మంది ఇందులో చేరారు. అయితే ఇక్కడితో మేం ఆగిపోవడం లేదు. వైద్యశాస్త్ర విజ్ఞానానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని ఖండించడానికీ, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికీ ఒక వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం.


   మౌఢ్యానికి టీకా డాక్ట‌ర్ షిమ్నా..