ప్రవాసాంధ్రుల కోసం ‘యాప్‌’

Header Banner

ప్రవాసాంధ్రుల కోసం ‘యాప్‌’

  Sat Nov 04, 2017 21:18        Gulf News, India, Telugu

విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం వెళ్లేవారికి సాయం చేయడంతో పాటు..సొంత ప్రతిభతో ఉద్యోగాలు తెచ్చుకున్నవారు ఆయా దేశాలకు వెళ్లేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావేత్తలు, నిపుణులే కాకుండా...చిన్న చిన్న ఉద్యోగాల కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారిపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. ఈ వ్యవహారాలన్నింటినీ చూసేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్వర్యంలో అమరావతిలో ఒక ప్రవాస కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకపరంగా కూడా విదేశాలకు వెళ్లేవారికి అవసరమైన సాయాన్ని ఈ కేంద్రం అందిస్తుంది. విదేశాలకు వెళ్లాక ఏదైనా ఆపదలో చిక్కుకుంటే సత్వరం ఇక్కడకు సమాచారం చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. గల్ఫ్‌దేశాలకు వెళ్లేవారికి అక్కడి పరిస్థితులు, భాష, వ్యవహారాలు, నిబంధనలపై ముందే శిక్షణ ఇస్తారు. వారి సెల్‌ఫోన్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ ఒక ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి ఇస్తుంది. సమస్యల్లో ఉన్నప్పుడు, ఏదైనా తెలియజేయాలని అనుకున్నప్పుడు ఆ యాప్‌ను నొక్కితే ఏపీఎన్‌ఆర్‌టీ ప్రవాస కేంద్రానికి సమాచారం అందేలా ఏర్పాటుచేస్తున్నారు. అదే సమయంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారికి కొంతమేర అరబిక్‌ భాష కూడా నేర్పుతారు. దీనివల్ల కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయని ఏపీఎన్‌ఆర్‌టీ ఛైర్మన్‌ వేమూరి రవికుమార్‌ తెలిపారు.

శిక్షణతో అధిక జీతం!

గల్ఫ్‌ దేశాలు వెళ్లేవారికి కొంత శిక్షణ ఉంటే అధిక జీతం వచ్చే అవకాశాలున్నాయని ఏపీఎన్‌ఆర్‌టీ భావిస్తోంది. ఉదాహరణకు దుబాయ్‌లో ఒక మెకానిక్‌కు రూ.20వేల జీతం ఇస్తారనుకుంటే.. కొద్దిపాటి శిక్షణతో మరో ఐదువేల రూపాయలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. జనవరి ఒకటినాటికి ప్రవాస కేంద్రంతో పాటు, జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు నెలకొల్పుతారు. అదే రోజున ప్రభుత్వం తరఫున హాట్‌లైన్‌, ఇతర సౌకర్యాలను ప్రారంభిస్తారు

 


   ప్రవాసాంధ్రుల కోసం ‘యాప్‌’