దేశమే ముందు...తర్వాతే పార్టీ : మోదీ దిశానిర్దేశం

Header Banner

దేశమే ముందు...తర్వాతే పార్టీ : మోదీ దిశానిర్దేశం

  Mon Sep 25, 2017 21:51        India, Telugu

మొదట దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని, రెండో ప్రాధాన్యం పార్టీ అని ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలకు సోమవారంనాడు దిశానిర్దేశం చేశారు. అవినీతిపై ప్రభుత్వం సాగిస్తున్న పోరాటం విషయంలో రాజీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా సాగే రాజకీయాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు. మోదీ ప్రసంగం అనంతరం ఆయన ప్రస్తావించిన కీలకాంశాలను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వివరించారు. ఎన్నికలే పరమావధిగా కాకుండా పార్టీని జనబాహుళ్యానికి చేరువ చేయాలని, ప్రజాభాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నట్టు జైట్లీ తెలిపారు. దేశానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే పార్టీ అని ప్రధాని స్పష్టం చేశారని అన్నారు. ప్రజల భాగస్వామ్యం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలే ముఖ్యమని, అవినీతి, ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని ప్రధాని తన ప్రసంగంలో పునరుద్ఘాటించారని చెప్పారు. అక్టోబర్ 31న 'ఐక్యతా పరుగు' నిర్వహించేందుకు కూడా ప్రధాని నిర్ణయించారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై జైట్లీని అడిగినప్పుడు 'గత త్రైమాసికంలో జీడీపీ కొంత తగ్గింది. పెట్టుబడులు, ఉత్పత్తుల కొరతే కారణం' అని ఆయన సమాదానమిచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని, ప్రధాని మోదీ కలలుగన్న నవ భారతాన్ని సుసాధ్యం చేస్తామని జైట్లీ చెప్పారు.   దేశమే ముందు...తర్వాతే పార్టీ : మోదీ దిశానిర్దేశం