ఫీచర్ ఫోన్లకు ప్రాణం పోసిన జియో!

Header Banner

ఫీచర్ ఫోన్లకు ప్రాణం పోసిన జియో!

  Sat Sep 23, 2017 22:47        India, Telugu

జియో 4జీ ఫీచర్ ఫోన్ పుణ్యమా అని దేశంలో ఫీచర్ ఫోన్లకు మళ్లీ ప్రాణం లేచి వస్తోంది. చాలా చిప్ కంపెనీలు దేశంలోని ఫీచర్ ఫోన్ల తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయి. చైనా సెమీ కండక్టర్ కంపెనీ స్ర్పెడ్‌ట్రమ్ భారత్‌లోని మొబైల్ మేకర్స్‌తోపాటు, భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న చైనా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 4జీ ఫీచర్ ఫోన్ల కోసం తాము చిప్‌లు సరఫరా చేస్తామంటూ ఒప్పందానికి ముందుకొచ్చింది.
 
అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ భారత్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని 4జీ ఫీచర్ ఫోన్ల కోసం చిప్‌లు అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆన్‌లైన్ మూవీ, ఈవెంట్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్‌మై షో జియో ఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ జియో ఫోన్ ఈ నవరాత్రి నుంచే వినియోగదారుల చేతుల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు చిప్‌మేకర్లు, హ్యాండ్‌సెట్ మేకర్ల నుంచి యాప్ డెవలపర్ల వరకు ఇప్పుడు ఫీచర్ ఫోన్లపై మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆయా కంపెనీలన్నీ ఫీచర్ ఫోన్లను వదిలి స్మార్ట్‌ఫోన్లపై పడ్డాయి.
 
దేశంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో ఇప్పటికీ సగం మంది ఫీచర్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు జియ ఫోన్ రాకతో ఫీచర్ ఫోన్ల హవా మరోమారు కొనసాగనుంది. దీనికి తోడు రిలయన్స్ తన జియో ఫోన్‌ను ఉచితంగా అందిస్తుండడం, దానికి ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండడంతో, ఇంచుమించు స్మార్ట్‌ఫోన్‌లా పనిచేసే అవకాశం ఉండడంతో అందరూ అటువైపు మళ్లే అవకాశం ఉంది.
 
ఇక దేశంలోని చాలామంది వాయిస్ కాల్స్‌ కోసం ఇంకా ఫీచర్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారని, వాయిస్ కాల్స్‌కు ఆ ఫోన్లు అయితేనే బాగుంటాయని వారు భావిస్తున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా తెలిపారు. దీనికి తోడు బ్యాటరీ బ్యాకప్, విద్యుత్ సమస్య వంటి వాటివి కూడా ఈ ఫోన్లపై మొగ్గు చూపడానికి కారణమవుతున్నాయని వివరించారు.
 
 
ఒక్కసారిగా ఫీచర్ ఫోన్ల హవా పెరగడంతో మొబైల్ మేకర్లందరూ వీటిపై పడ్డారు. చైనా ఫోన్ మేకర్ ఐటెల్, దేశీయ కంపెనీలు లావా, ఇంటెక్స్‌లు బండిల్ ఆఫర్ల కోసం వొడాఫోన్ ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి. 2జీ ఫీచర్ ఫోన్లతో వాయిస్ కాల్ ప్లాన్స్, క్యాష్‌ బ్యాక్ ఆఫర్లకు ప్లాన్ చేస్తున్నాయి. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌టెల్.. లావా, కార్బన్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. రూ.2500తో 4జీ ఫీచర్ ఫోన్‌ను తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది ఈ దీపావళికే బండిల్ ఆఫర్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
 
 
 


   JIO -Features